పదేళ్లా.. పదా అటెళ్దాం!

మారుతున్న జీవనశైలికి తగ్గట్టుగా ఆవాసాలు ఉండాలని కొనుగోలుదారులు భావిస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో ఆధునిక హంగులతో పాటు సకల సౌకార్యాలు ఉండాలని వెతుకుతున్నారు. అందుకు తగ్గ నివాసాలు దొరికితే అక్కడే కొనుగోలు చేస్తున్నారు. వీరిని ఆకట్టుకునేందుకు కొత్తగా వస్తున్న గేటెడ్‌ కమ్యూనిటీలను

Updated : 26 Feb 2022 04:50 IST

ఆధునిక కుటీరాల్లో ఇల్లే ప్రపంచం

ఈనాడు, హైదరాబాద్‌

మారుతున్న జీవనశైలికి తగ్గట్టుగా ఆవాసాలు ఉండాలని కొనుగోలుదారులు భావిస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో ఆధునిక హంగులతో పాటు సకల సౌకార్యాలు ఉండాలని వెతుకుతున్నారు. అందుకు తగ్గ నివాసాలు దొరికితే అక్కడే కొనుగోలు చేస్తున్నారు. వీరిని ఆకట్టుకునేందుకు కొత్తగా వస్తున్న గేటెడ్‌ కమ్యూనిటీలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నారు. మొదట్లో పది ఇరవై సౌకర్యాలు ఉంటే గొప్ప అనుకుంటే ఇప్పుడు వాటి సంఖ్య హైదరాబాద్‌లో వంద దాటింది.. మార్కెట్లో పోటీ నేపథ్యంలో డెవలపర్లు సైతం కొత్త సదుపాయాలను కల్పించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తే ఎప్పటికప్పుడు కొంగొత్త మార్పులు వస్తుంటాయి. ప్రతి పదేళ్లకోసారి ఇవి స్పష్టంగా కనిపిస్తుంటాయి. ప్రస్తుతం స్టాండలోన్‌ అపార్ట్‌మెంట్లను వదిలి గేటెడ్‌ కమ్యూనిటీల వైపు, ఆకాశహర్మ్యాల వైపు చూస్తున్నారు. వీటిలో కొంటున్నవారిలో అధికశాతం మంది ఇదివరకు నగరంలో సొంతిల్లు ఉన్నవారేనని నిర్మాణదారులు చెబుతున్నారంటే మార్పు దిశగా అడుగులు బలంగా పడుతున్నాయన్న మాట. కొనుగోలుదారుల అభిరుచులను అందిపుచ్చుకుని డెవలపర్లు సైతం కొత్త సౌకర్యాలను జోడిస్తూ .. ఇక ఉంటే ఇక్కడే ఉండాలని అనేట్లుగా చేస్తున్నారు.

ఇంటి ముంగిటకే...

హైదరాబాద్‌లో గేటెడ్‌ కమ్యూనిటీ సంస్కృతి మరింత విస్తృతమవుతోంది. పశ్చిమ హైదరాబాద్‌లో మొదలైన ఈ పోకడ సిటీ వ్యాప్తంగా విస్తరిస్తోంది. గచ్చిబౌలి, మాదాపూర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాదు ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌, కొంపల్లి వైపు వస్తున్నాయి.. వీటిలో ఒక్కోచోట ఐదు వందల నుంచి వెయ్యి మంది నివసిస్తున్నారు. ఒకప్పుడు వీరంతా  తమ అవసరాల కోసం బయటికి వెళ్లాల్సి వస్తే...ఇప్పుడవన్నీ కమ్యూనిటీలో దొరుకుతున్నాయి. అలాంటి చోటనే నివాసానికి ఈ తరం ఇష్టపడుతోంది.

మినీ భారతం

నగరంలో గేటెడ్‌ కమ్యూనిటీలంటే దేశం నలుమూలల నుంచి వచ్చినవారు ఇక్కడ ఉంటున్నారు. వీటిలో నివాసంతో పిల్లలు వేర్వేరు భాషలు నేర్చుకుంటున్నారని.. భాషా వికాసం ఉంటుందని వీటిలో కొంటున్నవారు ఉన్నారు. ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులకు చిన్నారులను ఎక్కడ వదిలిపెట్టాలో తెలియదు. వీరి కోసం ప్రత్యేకంగా ఇక్కడ పిల్లల సంరక్షణ కేంద్రాలు  ఏర్పాటు చేస్తున్నారు.

అన్నీ ఇక్కడే..

నెట్‌ జీరో కాన్సెప్ట్‌తో కొన్ని ప్రాజెక్టులను కడుతున్నారు.. కరెంట్‌ కోసం డిస్కంపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా సౌర విద్యుత్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్నినెలల పాటు బయటికి రాకపోయినా కమ్యూనిటీలో ఏ లోటు లేకుండా నివసించేలా సర్వం ఏర్పాట్లు  ఉంటున్నాయి. కూరగాయలు, పాలు, గ్యాస్‌తో సహా అన్ని అక్కడే దొరికేలా కమ్యూనిటీలను డిజైన్‌ చేశారు.

కార్యాలయాల కోసం..

కమ్యూనిటీల్లో ఇదివరకు అతిథుల కోసం ప్రత్యేకంగా గదుల సదుపాయం ఉంది. కొవిడ్‌ అనంతరం ఇంటి నుంచే ఉద్యోగులు పనిచేస్తుండంతో ప్లగ్‌ ప్లే పద్ధతిలో పనిచేసేందుకు వీలుగా కొంత స్థలం కార్యాలయానికి కేటాయిస్తున్నారు. ఇంట్లో కార్యాలయ వాతావరణం లేదనే భావించేవాళ్లు ఇక్కడకు వచ్చి పనిచేసుకోవచ్చు. గేటు దాటి కూడా బయటికి వెళ్లాల్సిన పనిలేదు.

వినోదానికి పెద్దపీట

ఇప్పటివరకు వేడుకల కోసం బాంక్వెట్‌ హాల్‌, యాంపీ థియేటర్‌ వంటి సదుపాయాలు ఉండేవి. ఇళ్లలో హోం థియేటర్లు సర్వసాధారణంగా మారాయి. ఇప్పుడు చిన్నపాటి మల్టీఫ్లెక్స్‌లు, ప్రివ్యూ థియేటర్లు సైతం నగరంలోని గేటెడ్‌ కమ్యూనిటీల్లో కడుతున్నారు. ఎక్కడో మాల్‌కు వెళ్లాల్సిన పని లేకుండానే  కమ్యూనిటీల్లోనే కొత్త సినిమా చూసే రోజు రాబోతుంది.

పెట్‌ పార్క్‌లు

కమ్యూనిటీల్లో నివాసంపై జంతు ప్రేమికులు మొదట్లో కొంత గుర్రుగా ఉండేవారు. పెంపుడు జంతువులు పరిసరాలను పాడు చేస్తున్నాయనే ఫిర్యాదులు వారిని బాధించేవి. ఇష్టంగా పెంచుకున్న కుక్కను ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లి ఉదయం, సాయంత్రం అటుఇటు తిప్పడం కుదిరేది కాదని చింతించేవారు. ఇప్పుడు విల్లా గెటేడ్‌ కమ్యూనిటీల్లో పెట్‌ పార్క్‌లు వచ్చాయి. క్రమంగా ఈ సంస్కృతి నగరంలో విస్తరిస్తుండటంతో జంతు ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అడవులు పెంచుతున్నారు 

ఆధునిక గేటెడ్‌ కమ్యూనిటీల్లో తక్కువ విస్తీర్ణంలో ఎత్తైన భవనాలు నిర్మిస్తూ ఎక్కువ విస్తీర్ణంలో పచ్చదనానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అవసరమైతే 50 అంతస్తుల ఎత్తు వరకు వెళుతున్నారు. విదేశాల్లో మాదిరి వర్టికల్‌ గార్డెన్‌ను తీర్చిదిద్దుతున్నారు. రోజురోజుకు కాలుష్యం పెరుగుతుండటంతో ఇంటికి వచ్చాక ఆహ్లాదకర వాతావరణం ఉండాలని గదిని బట్టి బాల్కనీలు, కిటికీల పక్కన పూల, అలంకరణ, ఆక్సిజన్‌ ఇచ్చేవి ఇలా రకరకాల మొక్కలను పెంచుతున్నారు. కొన్ని ప్రాజెక్టుల్లో చిన్నపాటి అడవినే పెంచారు. జపాన్‌ మియావాకీ పద్ధతిలో అడవిని పెంచి మిగతావారికి ఆదర్శంగా నిలిచారు. స్కైగార్డెన్‌లు ఇప్పటి పోకడగా ఉంది. స్కైపూల్స్‌ను సైతం కడుతున్నారు.

ఆటలతో కాలక్షేపం.. పిల్లలు ఇంట్లో కంటే కమ్యూనిటీలోని ఆటస్థలాల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని తల్లిదండ్రులు అంటున్నారు. పాఠశాల నుంచి రాగానే పుస్తకాలు పక్కడ పడేసి ఇండోర్‌, అవుట్‌డోర్‌ గేమ్స్‌ ఆడేందుకు వెళ్లిపోతున్నారు. టెన్నిస్‌, వాలీబాల్‌, క్రికెట్‌తో పాటూ ఇండోర్‌ గేమ్స్‌, జిమ్నాజియం, స్కేటింగ్‌ సదుపాయాలు ఉంటున్నాయి. కొత్తగా కడుతున్న ఒక ప్రాజెక్ట్‌లో ప్రత్యేకంగా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌నే నిర్మిస్తున్నారు.

నిర్వహణ చూసుకోవాలి

సౌకర్యాలు, హంగులు ఎన్ని ఉన్నా నిర్వహణ లేకపోతే మూన్నాళ్ల ముచ్చటే. అలాంటి పరిస్థితి రాకుండా నిర్వహణ కోసం గేటేడ్‌ కమ్యూనిటీలు ప్రతినెల రూ.లక్షలు వ్యయం చేస్తున్నాయి. వీటి నిర్వహణ చూసుకునేందుకు ఏజెన్సీల ద్వారా ఉద్యోగులను నియమించుకుంటున్నారు. ప్రతి రోజు శుభ్రం చేసేందుకు పారిశుద్ధ్య సిబ్బందితో పాటు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. సౌకర్యాలు పెరిగేకొద్దీ ప్రతినెల చెల్లించే మెయింటనెన్స్‌ ఛార్జీలు పెరుగుతున్నాయి. గేటెడ్‌ కమ్యూనిటీల్లో చ.అ. రూ.3.5 వరకు వసూలు చేస్తున్నారు.


వైద్యసేవలు

గేటెడ్‌ కమ్యూనిటీల్లో వైద్యం కోసం బయటికి వెళ్లాల్సిన పనిలేదు. ఆసుపత్రులే తమ క్లినిక్‌లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయి. కొన్ని కమ్యూనిటీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు జనరల్‌ ఫిజీషియన్‌ అందుబాటులో ఉంటున్నారు. వారంలో ఒకటి రెండుసార్లు స్పెషలిస్టులు వచ్చి సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో పెద్దలు ఉన్నవారికి ఇవి సౌకర్యంగా ఉంటున్నాయి. కొన్ని సంస్థలు టెలి వైద్యసేవలు అందిస్తున్నాయి.


ప్రతిరోజూ పూజలు

కొంతమంది రోజూ గుడికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం అలవాటు. ఇలాంటి వారికోసం పలు భారీ గెటేడ్‌ కమ్యూనిటీల్లో గుడులు సైతం నిర్మించారు. ఇక్కడ ప్రతిరోజూ పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి.

కామన్‌ కిచెన్‌

గేటెడ్‌ కమ్యూనిటీలోని రిటైర్మెంట్‌ హోమ్స్‌లో కామన్‌ కిచెన్‌ పోకడ కనిపిస్తోంది. ఇక్కడ విశ్రాంత ఉద్యోగులు, పెద్దవారు నివసిస్తుంటారు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో వంట చేసుకోలేరు. కామన్‌ కిచెన్‌ ఉంటుంది. ఇక్కడికి వచ్చి అందరూ భోజనం చేసి వెళతారు. రిటైర్మెంట్‌ హోమ్స్‌ నుంచి ఇతర హోమ్స్‌లోనూ కామన్‌ కిచెన్‌ కడుతున్నారు. భార్యాభర్త ఇద్దరూ ఉదయం నుంచి ఉరుకులు పరుగుల జీవితంలో చాలామందికి వంటకు సమయం కుదరక స్విగ్గి, జోమాటోల ఆర్డర్లపైన ఆధారపడుతున్నారు. కామన్‌ కిచెన్‌ ఇలాంటివారికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని