Updated : 19 Mar 2022 04:33 IST

నిర్మాణాలు ఇక చకచకా

హైబ్రిడ్‌ టెక్నాలజీపై సర్వత్రా ఆసక్తి

కాలంతో పాటు పరుగెత్తాల్సిన సమయం నిర్మాణ రంగానికి వచ్చేసింది. ఏళ్లు పట్టే పనిని  నెలల్లోనే పూర్తిచేస్తున్నారు. హైబ్రిడ్‌ సాంకేతికతతో డీఆర్‌డీవో 7 అంతస్తుల భవనాన్ని 45 రోజుల్లోనే నిర్మించింది. ఇప్పటివరకు సంప్రదాయ పద్ధతుల్లో ఎక్కువ శాతం నిర్మిస్తుంటే.. ఇప్పుడిప్పుడే కొందరు ప్రీ కాస్టింగ్‌ విధానంలో  కడుతున్నారు. ఈ రెండింటి మేళవింపే హైబ్రిడ్‌ టెక్నాలజీ అంటోంది డీఆర్‌డీవో. రక్షణ రంగంలో అద్భుతాలు సృష్టించే ఈ సంస్థ నెలన్నర రోజుల్లోనే భవనాన్ని నిర్మించి భారతీయ నిర్మాణ సంస్థలు ఎలాంటి అద్భుతాలు చేయగలవో ప్రపంచానికి చూపించింది. రోజుల వ్యవధిలోనే ఆకాశహర్మ్యాలను సైతం నిర్మించే అవకాశం ఉండటంతో ఇతర నిర్మాణ సంస్థల దృష్టి ఇప్పుడు దీనిపై పడింది. 

ఈనాడు, హైదరాబాద్‌

నిర్మాణం ఏదైనా డ్రాయింగ్స్‌, డిజైనింగ్‌ పక్కాగా ఉండాలి. ఏ పనిని ఎప్పటిలోపు పూర్తిచేయాలి? సామగ్రి ఎక్కడి నుంచి తీసుకురావాలి అనే ప్రణాళిక సైతం సిద్ధంగా ఉండాలి. సంప్రదాయ విధానంలో సామగ్రిని సరఫరా చేసే వెండర్లు మార్కెట్లో చాలామంది ఉన్నారు. ఒకరు కాకపోతే ఇంకొరు అందిస్తారు.  క్యూరింగ్‌ గట్రా ఉంటాయి కాబట్టి ఇక్కడ కొంత సమయం దొరుకుతుంది. అదే ప్రీకాస్టింగ్‌ విధానంలో ముందే ఆర్డర్‌ ఇచ్చి సిద్ధం చేయించుకోవాలి. షెడ్యూల్‌ ప్రకారం సైట్‌ దగ్గరకు సామగ్రి చేరుకోవాలి. నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం ఉంటుంది. ఇదే మాదిరి కాంపొజిట్‌ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీలో ప్రణాళిక పక్కాగా ఉండాలి. ఇందుకోసమే మూడునెలల సమయమైనా పడుతుంది. తమ సాంకేతికతకు తగ్గట్టుగా డిజైనింగ్‌, సామగ్రి ఆర్డర్‌ ఇవ్వడం, యంత్రాలు రప్పించడం ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత నిర్మాణం మొదలెడతారు. చకచకా రోజుల వ్యవధిలోనే ఎన్ని అంతస్తులైనా పూర్తిచేయవచ్చు.

చాలా ప్రయోజనాలున్నాయ్‌..  
పాత రోజుల్లో మాదిరి సంప్రదాయ పద్ధతుల్లో నిర్మాణాలు చేపడతామంటే పూర్తి చేసేందుకు ఏళ్ల తరబడి ఎదురుచూపులు తప్పవు. ఏడు అంతస్తుల భవనానికి రెండేళ్ల సమయం తీసుకుంటున్నారు. ఈ లోపు ఉక్రెయిన్‌ యుద్ధం వంటి ఘటనలు ఎదురైతే స్టీలు, సిమెంట్‌ ధరలు ఒక్కసారిగా ఎగబాకుతాయి. కొన్నిసార్లు ఇసుక కొరత వేధించవచ్చు. కొవిడ్‌ మహమ్మారులతో మొత్తానికే పనులను ఆపేయాల్సి రావొచ్చు.  ఇవేవీ నియంత్రణలో లేని అంశాలు. పని ఆలస్యంతో నిర్మాణ వ్యయం 30 నుంచి 40 శాతం పెరుగుతోందని నిర్మాణదారులు అంటున్నారు. నెలల వ్యవధిలోనే పూర్తిచేయగలిగితే నిర్మాణాన్ని ముందే అంచనా వేసిన వ్యయంలో పూర్తిచేసే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టు పూర్తి నియంత్రణలో ఉంటుంది.

ఇలా కట్టారు..

* అంతస్తులు.. 45 రోజులు.. 1.30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం.
* పనులు మొదలెట్టడానికి ముందే ప్రీ కాస్టింగ్‌ విధానంలో గోడలు, టాయిలెట్‌ గదులు, లిఫ్ట్‌ గదులను సైతం సిద్ధం చేసి పెట్టారు.
* తొలిరోజు మొదట పునాదులు తవ్వి కాంక్రీట్‌ స్తంభాలు నిర్మించారు. తర్వాత.. వాటిపైనే స్టీల్‌ స్తంభాలు బిగించుకుంటూ వెళ్లారు. వీటిలోపల స్టీల్‌, సిమెంట్‌తో సాధారణ స్తంభం మాదిరి ఇన్‌సితూలో చేపట్టారు. ఇలా ఎన్ని అంతస్తులైనా పెంచుకోవచ్చు.
* మొదట నేలపై నుంచే కాంక్రీట్‌తో గ్రేడ్‌ స్లాబ్‌ వేసి.. స్తంభాల మధ్యలో ప్రీకాస్ట్‌ గోడలను అమర్చారు. సిద్ధంగా ఉన్న టాయ్‌లెట్‌ పాడ్స్‌ను ఒక్కో అంతస్తులో అమర్చారు.
* స్తంభాల అమరిక పూర్తయ్యాక వాటిపైన బీమ్‌లను బిగించి స్లాబ్‌ వేశారు. సన్నని పాడింగ్‌ బిగించాక దానిపైన స్లాబ్‌ వేస్తారు. మొదటి స్లాబ్‌ వరకు ఆరురోజుల్లోనే పూర్తిచేస్తారు. ఆ తర్వాత ఇంటీరియర్‌ వాల్‌ ప్యానల్స్‌ను అమర్చారు. కావాల్సిన చోట మాడ్యులర్‌ వాల్స్‌ను బిగించారు. ఫాల్స్‌ ఫ్లోరింగ్‌తో అందంగా ముస్తాబు చేశారు.
* ఇలా ఒక్కో అంతస్తును సగటున ఐదారు రోజుల్లోనే పూర్తి చేసుకుంటూ వెళ్లారు. నిర్మాణం పూర్తయ్యాక అన్నివైపులా అద్దాల గ్లాసుల పనులు చేపట్టారు.  
* ఒకవైపు పైఅంతస్తు పనులు జరుగుతుండగానే కింది అంతస్తుల్లో కార్పెట్‌ ఫ్లోరింగ్‌, ఇతర పనులు పూర్తిచేశారు. 41, 42వ రోజు నాటికి విద్యుత్తు, ప్లంబింగ్‌ పనులు పూర్తి చేశారు. 45వ రోజునాటికి గదుల్లో ఫర్నిచర్‌తో ప్రారంభానికి సిద్ధం చేశారు.


తక్కువ సమయంలో కట్టేలా కాన్సెప్ట్‌ను సిద్ధం చేశాం

- జి.సతీష్‌రెడ్డి, ఛైర్మన్‌, డీఆర్‌డీవో  

బెంగళూరులోని ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏడీఏ) ల్యాబ్‌లో అధునాతన యుద్ధ విమానాల డిజైన్స్‌ వర్క్స్‌, ప్లైట్‌ కంట్రోల్‌, సిమ్యూలేషన్‌, టెస్టింగ్‌ పనులు జరుగుతున్నాయి. దీనికోసం తొందరగా ఒక భవనం నిర్మించాల్సి వచ్చింది. ఎప్పుడో అనుకున్నా కొవిడ్‌తో ఆలస్యం అయింది. మావాళ్లను పిలిచి దీన్నో సవాల్‌గా తీసుకుని త్వరగా భవనాన్ని పూర్తిచేయాలని సూచించాను. దేశవ్యాప్తంగా వేర్వేరు పరిశ్రమలను సందర్శించి, ఐఐటీ చెన్నై, ఐఐటీ రూర్కీతో సంప్రదించిన తర్వాత ఒక కాన్సెప్ట్‌కు వచ్చాం. జడ్చర్లలో ఒక కంపెనీ మైవీర్‌, హైదరాబాద్‌లోని ఆర్కిటెక్ట్‌లతో మాట్లాడాం. 7 అంతస్తులు, 1.30 లక్షల చదరపు అడుగుల్లో భవనాన్ని కట్టాలని నిర్ణయించి 45 రోజుల్లో పూర్తిచేయాలని ఎల్‌అండ్‌టీకి కాంట్రాక్ట్‌కు ఇచ్చాం.

ఫిబ్రవరి 1న పనులు మొదలెట్టి పూర్తిచేశారు. కొంత ప్రీఫ్యాబ్‌, కొంత ఇన్‌సితూ విధానంలో దీన్ని చేశాం కాబట్టి హైబ్రిడ్‌  టెక్నాలజీ అన్నాం. నాకు తెలిసి ఇంత పెద్ద భవనం హైబ్రిడ్‌ టెక్నాలజీతో కట్టడం ఇదే మొదటిసారి. దేశంలో ఉన్న పరిశ్రమల సామర్థ్యాలను ఉపయోగించుకుని.. సమన్వయం చేసి.. డీఆర్‌డీవో ఈ కాన్సెప్ట్‌ను సిద్ధం చేసింది. ఇందులో పెద్దగా ఎక్కువ ఖర్చు కాదు. ప్రాచుర్యంలోకి వచ్చి ఎక్కువ మంది ముందుకొస్తే ఇంకా తగ్గుతుంది. జీవితకాలం కూడా ఎక్కువే. ఇప్పటికే దీని గురించి చాలా మంది ఆరా తీస్తున్నారు. ఆసక్తిగా ఉన్నవారికి ఈ టెక్నాలజీకి సంబంధించి సహాయ సహకారాలు అందించేందుకు డీఆర్‌డీవో సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో అవసరమైన చోట డీఆర్‌డీవో నిర్మించే భవనాలను ఇదే విధానంలో కడతాం.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని