అనుకూలమా? ప్రతికూలమా?

 రాజధాని ప్రాంతంలోని జంట జలాశయాల పరిరక్షణ కోసం గతంలో జారీ చేసిన జీవో 111ను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంతో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది? సమీప ప్రాంతాల్లో స్థిరాస్తుల ధరలు

Published : 16 Apr 2022 03:11 IST

రియల్‌పై జీవో 111 ఎత్తివేత ప్రభావం

ఈనాడు, హైదరాబాద్‌ : రాజధాని ప్రాంతంలోని జంట జలాశయాల పరిరక్షణ కోసం గతంలో జారీ చేసిన జీవో 111ను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంతో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది? సమీప ప్రాంతాల్లో స్థిరాస్తుల ధరలు తగ్గుతాయా? మున్ముందు మార్కెట్‌ ఎలా ఉండబోతుంది?  ఎత్తివేశాక ఆ ప్రాంతం అభివృద్ధి ఎలా ఉంటే మేలు? పరిశ్రమ వర్గాలు ఏమంటున్నాయి?  కొవిడ్‌ ఒడిదొడుకులను తట్టుకుని ఏడాదిగా నగరంలో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ వృద్ధి పథంలో పయనిస్తోంది. ఇళ్లు, స్థలాలు, భూముల క్రయ విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. విక్రయాల పరంగా ఒకటిరెండు నెలలు హెచ్చుతగ్గులున్నా.. మొత్తంగా మార్కెట్‌లో లావాదేవీలు ఆశాజనకంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో భూముల ధరలు భారీగా పెరగడం.. ఇంకా పెరుగుతాయనే అంచనాలతో ఎక్కడికక్కడ స్థానికంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. కొత్త ప్రాంతాలకు రియల్‌ ఎస్టేట్‌ విస్తరించింది. ప్రభుత్వం నగరానికి అన్నివైపులా ఐటీ టవర్లు, పారిశ్రామిక క్లస్టరు ఏర్పాటు చేస్తుండటం, పరిశ్రమల రాకతో ఆయా ప్రాంతాల్లో రియల్‌ వ్యాపారం ఊపందుకుంది. సిటీకి దూరమైనా భవిష్యత్తు దృష్ట్యా కొనుగోళ్లు చేస్తుండటంతో ఆరు ప్లాట్లు, మూడు విల్లాల మాదిరి వ్యాపారం సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్నాళ్లుగా వినపడుతున్న జీవో 111 ఎత్తివేతపై సాక్షాత్తు సీఎం ప్రకటనతో రియల్‌ ఎస్టేట్‌పై రకరకాల ఊహగానాలు ప్రచారంలోకి వచ్చాయి. 84 గ్రామాల్లో ఆంక్షల ఎత్తివేత అనంతరం భూముల లభ్యత పెరిగితే  ఇళ్ల ధరలు దిగి వస్తాయని కొందరు సంతోషపడుతుంటే.. జీవో 111 పరిధిలో లేని ప్రాంతాల్లో స్థలాలను ఇదివరకే కొనుగోలు చేసినవారు డిమాండ్‌ లేక ధరలు  ఏమైనా తగ్గుతాయా? ఇక్కడి మార్కెట్‌ ప్రభావితం అవుతుందా అని ఆరా తీస్తున్నారు.

కొన్ని కిలోమీటర్ల మేర గ్రీన్‌ బఫర్‌ జోన్లుగా.. : - జి.వి.రావు, అధ్యక్షుడు, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌(టీడీఏ)

* జీవో 111 ఎత్తివేయాలనే మంత్రి మండలి నిర్ణయంతో జంట జలాశయాలు, పర్యావరణానికి హాని జరగకుండా చర్యలు చేపట్టాలి. 

* చెరువులను కాపాడటం ప్రాథమిక లక్ష్యంగా ఉండాలి. ఆ తర్వాతే అభివృద్ధి. ఇది పర్యావరణాన్ని దెబ్బతీయని విధంగా ఉండాలి. 

* ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలి. ఆలస్యం చేయకుండా ఆంక్షల  సడలింపు అమల్లోకి వచ్చే సమయానికి ప్లాన్‌ను ఆచరణలోకి తీసుకురావాలి. . 

* మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎకనమిక్‌ సెన్సిటివ్‌ జోన్లను అధ్యయనం చేయాలి. అక్కడ స్టీల్, సిమెంట్‌ వంటి భవన సామగ్రి స్థానంలో ప్రత్యామ్నాయం వినియోగిస్తారు. కలప ఇళ్లు ఉంటాయి. ఉష్ణోగ్రతలు పెరగకుండా ఉంటాయి. ఈ తరహా జోన్లను సందర్శించి ఆ ప్రకారం చేయాలి. 


* మాస్టర్‌ ప్లాన్‌ కమిటీలో పర్యావరణవేత్తలు, పర్యావరణ ఆర్కిటెక్ట్‌లు, ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ప్లాన్‌ నిపుణులు, స్థానిక ఆర్కిటెక్ట్‌లు, హెచ్‌ఎండీఏ అధికారులను భాగస్వామ్యం చేయాలి.  వారందరితో సంప్రదింపులు జరపాలి. వాటి సారాంశం అనుగుణంగా మాస్లర్‌ ప్లాన్‌ కూర్పులో జాగ్రత్తలు తీసుకోవాలి.  

* అభివృద్ధి జోన్లు జలాశయాల నుంచి కొన్ని కి.మీ మేర గ్రీన్‌ బఫర్‌గా ఉండేలా చూడాలి. అక్కడ రిసార్టులు, స్పోర్ట్స్‌ క్లబ్‌లు, విద్యాసంస్థలు,తక్కువ ఎత్తులోని ఇళ్లు మాత్రమే ఉండేలా చూడాలి. 

* ఆకాశహర్మ్యాలకు, ఐటీ భవనాలకు అనుమతి ఇచ్చి ఇప్పుడున్న ప్రాంతాలకు పోటీ(కాంపిటీషన్‌)గా కాకుండా నగరానికి కొత్త ప్రాంతం కాంప్లిమెంటరీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పోటీగా ఉంటే మాత్రం ఇప్పుడున్న ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ తగ్గే అవకాశాలు ఉన్నాయి. 


ధరలు తగ్గడానికి అవకాశం లేదు: - ఎం.విజయసాయి, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ (ట్రెడా)

*ప్రభుత్వం జీవో 111 ఎత్తివేయాలనే నిర్ణయానికి వచ్చినా ఎలా చేస్తుంది? ఎప్పటికి అవుతుంది? అనేది స్పష్టంగా తెలియదు. వేల ఎకరాలు రాత్రికి రాత్రే అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. దశలవారీగా అందుబాటులోకి తీసుకొచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న మార్కెట్లలో ధరలు పెద్దగా తగ్గుతాయని, మార్కెట్‌ ప్రభావితం అవుతుందని మేం భావించడం లేదు.

*  ఉదాహరణకు కోకాపేటలో ఎకరం రూ.50 కోట్లు  ఉంది.  పక్కనే ఖానాపూర్‌ ఉంది.  ఇప్పటివరకు ఇక్కడ ఆంక్షలు ఉన్నాయి. తొలగించగానే ఇక్కడి భూములు  ఎకరా రూ.10 కోట్లకు  వస్తుందా? అంటే రాదనే చెప్పగలం. సమీపంలో మార్కెట్‌ ధర ప్రకారమే చుట్టుపక్కల ధరలు స్థిరపడిపోతాయి. కోకాపేట చ.అ. రూ.10వేలకు అమ్మితే పక్కనే ఖానాపూర్‌లో రూ.8వేలకు ఇవ్వొచ్చు తప్ప రూ.5వేలకే వస్తుందని ఊహించలేం. భూమి తక్కువ ధరకు వచ్చినా మార్కెట్‌ ప్రకారమే విక్రయిస్తారు.  

*  ఈ ప్రాంతంలో రైతుల భూములతో పాటూ పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఎత్తివేతతో కలిగే ప్రయోజనం ప్రభుత్వమూ పొందాలని చూస్తుంది కాబట్టి ధరలు పడిపోయేలా నిర్ణయాలు ఉండకపోవచ్చు. 

*  మొత్తం భూములను ఒకేసారి కాకుండా దూరంగా ఉన్న గ్రామాల్లో మొదటగా.. అలా క్రమంగా ఆంక్షలు తొలగించే అవకాశం ఉంది. బెంగళూరులో చాలా భూములు కన్జర్వేటివ్‌ జోన్లుగా ఉన్నాయి. ఐదేళ్లకోసారి ఇందులోంచి వెయ్యి నుంచి రెండువేల ఎకరాలకు సడలింపులు ఇస్తారు.  ఇక్కడ సైతం దశలవారీగా ప్రణాళికలను అమలు చేసే అవకాశం ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని