భూముల ధరల్లో దిద్దుబాటుకు అవకాశం

ఊహాగానాలకు తెరపడింది.. అనుకున్నట్లే ప్రభుత్వం జీవో 111ని ఎత్తివేసింది. జంట జలాశయాల పరిరక్షణ కోసం 26 ఏళ్ల పాటు నగరానికి ఒకవైపు కొనసాగిన ఆంక్షలను తొలగించింది. ఆయా గ్రామాలు ఇప్పటికే అభివృద్ధి చెందిన ...

Updated : 23 Apr 2022 05:44 IST

జీఓ 111 పరిధిలో ప్రణాళికాయుత అభివృద్ధికే అవకాశం ఇవ్వాలి

ప్రభుత్వం దీన్ని ఆదాయ వనరుగా చూడొద్దు

‘ఈనాడు’తో క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రధాన కార్యదర్శి వి.రాజశేఖర్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌

ఊహాగానాలకు తెరపడింది.. అనుకున్నట్లే ప్రభుత్వం జీవో 111ని ఎత్తివేసింది. జంట జలాశయాల పరిరక్షణ కోసం 26 ఏళ్ల పాటు నగరానికి ఒకవైపు కొనసాగిన ఆంక్షలను తొలగించింది. ఆయా గ్రామాలు ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలకు, అవుటర్‌కు చేరువగా ఉండటం.. లక్ష ఎకరాలకు పైగా భూములు అందుబాటులోకి వస్తుండటంతో రియల్‌ ఎస్టేట్‌ పరంగా అవకాశాలను అందిపుచ్చుకోవాలని పెట్టుబడిదారులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో కొనే ఆలోచనలు ఉన్నవారు సైతం కొంతకాలం వేచిచూసే ధోరణిలో ఉన్నారు. తాజా పరిణామాలతో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ ప్రస్తుతం కొంత గందరగోళంలో ఉందని.. ఇది ఎక్కువకాలం కొనసాగితే మార్కెట్‌ దెబ్బతింటుందని క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రధాన కార్యదర్శి వి.రాజశేఖర్‌రెడ్డి అన్నారు. జీవో 111 మాత్రమే తొలగించారని అక్కడ స్థిరాస్తి కార్యకలాపాలకు అనుమతి ఇవ్వలేదనే విషయం గుర్తించాలని అన్నారు. హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో అసాధారణంగా పెరిగిన భూముల ధరల్లో దిద్దుబాటుకు అవకాశం ఉంటుందన్నారు. ‘ఈనాడు’ ముఖాముఖిలో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

పర్యావరణాన్ని కాపాడుకుంటూనే..

ఒక ప్రాంతంపై కొన్ని సంవత్సరాల పాటు ఆంక్షల కారణంగా అభివృద్ధికి అవకాశం లేకపోవడం సరైంది కాదు. ఈ కోణంలోంచి కూడా చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందే. అదే సమయంలో జంట జలాశయాల పరిధిలోని పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

సమగ్రాభివృద్ధి దిశగా..

ప్రభుత్వ నిర్ణయంతో ప్రస్తుతమున్న హైదరాబాద్‌కు సమానంగా మరో నగరాన్ని నిర్మించేంత భూభాగం దాదాపు 1.32 లక్షల ఎకరాలు అందుబాటులోకి వస్తున్నాయి.  ఈ ప్రాంతం సమగ్రాభివృద్ధి కోసం కాకుండా కేవలం ఒక ఆదాయ వనరుగా ప్రభుత్వం చూస్తే మాత్రం నష్టపోతాం.

పర్యాటకంగా అవకాశాలు..

హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ను పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అప్పుడు చెప్పిన ప్రాంతాల్లోనే కాకుండా ఈ అభివృద్ధిని మరింతగా విస్తరించాలి. ప్రైవేటు భాగస్వామ్యాలను ఆహ్వానించాలి. సేద తీరే ప్రాంతంగా అభివృద్ధి చేసుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఎకో టూరిజాన్ని ప్రోత్సహించాలి. ఒంటెద్దు పోకడలకు పోకుండా ఈ ప్రాంత పర్యావరణాన్ని కాపాడుతూనే అభివృద్ధి చేసుకునేలా సృజనాత్మక ఆలోచలకు పెద్దపీట వేయాలి.

ధరలు తగ్గుతాయా..

హైదరాబాద్‌లో ఇప్పటికీ పెద్ద ఎత్తున భూములు అందుబాటులో ఉన్నాయి. ఉన్నవాళ్ల చేతిలోనే ఉన్నాయి.. లేనివాళ్ల దగ్గర అసలే లేవు.  ఆంక్షల ఎత్తివేతతో అందుబాటులోకి వచ్చే భూములతో ధరల్లో ఎంతో కొంత దిద్దుబాటు ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం అక్కడ ఆంక్షలు మాత్రమే ఎత్తివేసింది. స్థిరాస్తి కార్యకలాపాలకు కొత్తగా అనుమతులు ఇవ్వడం లేదనే విషయాన్ని గుర్తించాలి.

ప్రణాళికాయుతంగా..  

ఇక్కడ ఉన్న చెరువులను పరిరక్షించుకుంటూ బఫర్‌ జోన్లు ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత గృహ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి. ఎత్తుపై ఆంక్షలు ఉండాలి. మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా గ్రీన్‌జోన్లు, రహదారులు, మౌలిక వసతుల కల్పనతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి ఉంటే ఈ ప్రాంతం హైదరాబాద్‌ నగరానికి మరో ఆకర్షణ అవుతుంది. ఇప్పటికీ  ఈ ప్రాంతంలో 15 అడుగుల రహదారుల్లోనే విల్లాలు కడుతున్నారు.  సరైన రహదారులు, డ్రైన్ల వంటి కనీస  మౌలిక వసతులు లేకుండా స్థలాల క్రయ విక్రయాలతో ఇష్టారీతిగా నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది. వీటిని నియంత్రించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని