పోచారం పోదాం పద

తూర్పు హైదరాబాద్‌లో గృహ నివాసాలకు అనుకూలమైన ప్రాంతాల్లో పోచారం ఒకటి. ఇన్ఫోసిస్‌ వంటి ఐటీ కార్యాలయాల అతిపెద్ద క్యాంపస్‌.. సింగ్‌పూర్‌ టౌన్‌షిప్‌తో కొన్నేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ

Updated : 21 May 2022 09:26 IST

ఈనాడు, హైదరాబాద్‌

తూర్పు హైదరాబాద్‌లో గృహ నివాసాలకు అనుకూలమైన ప్రాంతాల్లో పోచారం ఒకటి. ఇన్ఫోసిస్‌ వంటి ఐటీ కార్యాలయాల అతిపెద్ద క్యాంపస్‌.. సింగ్‌పూర్‌ టౌన్‌షిప్‌తో కొన్నేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ ప్రాంతంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి.  బహుళ అంతస్తుల భవనాలు, విల్లాలు వస్తున్నాయి. వ్యక్తిగత గృహాలు నిర్మించుకుంటున్నారు. సొంతింటి కల నెరవేర్చుకోవాలని అనుకునే వారికి అవుటర్‌ లోపల అనువైన ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. మున్సిపాలిటీగా మారడం, ఎక్స్‌ప్రెస్‌ వే వస్తుండటం, మాస్టర్‌ప్లాన్‌లో వంద అడుగుల రహదారుల ప్రతిపాదనలతో మున్ముందు ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందని స్థిరాస్తి వర్గాలు అంటున్నాయి.

మౌలిక వసతుల కల్పనతో కొన్ని ప్రాంతాల రూపురేఖలు ఆసాంతం మారిపోతుంటాయి. మెట్రోతో ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌, మియాపూర్‌ చుట్టుపక్కల ప్రాంతాలు నివాస అనుకూలంగా మారాయి. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్‌ వేల వంతు వచ్చింది. ప్రస్తుతం  ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు 6.2 కి.మీ. ఎక్స్‌ప్రెస్‌ వే పనులు పురోగతిలో ఉన్నాయి. మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్‌ వరకు ఉన్న 11.6 కి.మీ. ఎక్స్‌ప్రెస్‌ వే తర్వాత ఇదే రెండో అతిపెద్దది. వరంగల్‌, యాదాద్రి, అవుటర్‌ నుంచి వచ్చే వాహనాలు ట్రాఫిక్‌ రద్దీ లేకుండా సిటీలోకి వెళ్లేందుకు ఆరు వరుసల పైవంతెన కడుతున్నారు. అదే సమయంలో ఇప్పుడు వరంగల్‌ జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టారు. పైవంతెన రాకతో పోచారం చుట్టుపక్కల ప్రాంతాలకు  ఎక్కువ మేలు జరగనుంది. పైవంతెన దిగగానే పోచారం వస్తుంది. పది నిమిషాల వ్యవధిలో ఉప్పల్‌ చేరుకోవచ్చు. దీంతో మున్ముందు పోచారం, నారపల్లి ప్రాంతాలకు మరింత డిమాండ్‌ పెరుగుతుందని అంటున్నారు.

ఏ ధరలో ఉన్నాయ్‌
ఈ ప్రాంతంలో బహుళ అంతస్తుల నివాసాలు ఎక్కువగా ఉన్నాయి. స్టాండలోన్‌ అపార్ట్‌మెంట్లు బాగా వస్తున్నాయి. కొన్ని గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టులు సైతం చేపట్టారు. విల్లాలు కడుతున్నారు. రూ.2 కోట్ల వరకు విల్లాల ధరలు చెబుతున్నారు. విస్తీర్ణాన్ని బట్టి ధరల్లో హెచ్చుతగ్గులున్నాయి. అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు రూ.40 లక్షల నుంచి దొరుకుతున్నాయి. చదరపు అడుగు రూ.4వేలకు అటుఇటుగా విక్రయిస్తున్నారు. వ్యక్తిగత ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి స్థలాలు అందుబాటులో ఉన్నాయి. పోచారంలో రాజీవ్‌ స్వగృహ రెండు, మూడు పడక గదుల ఫ్లాట్లు వేలంలో అందుబాటులో ఉన్నాయి. వీటిని కొనడానికి వచ్చి ఆ ప్రాంతంలోని ఇతర నిర్మాణాల గురించి కొనుగోలుదారులు వాకబు చేస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ప్రధాన రహదారి నుంచి లోపలికి వెళ్లేకొద్దీ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. చదరపు గజం రూ.20వేల నుంచి రూ.30వేల మధ్య చెబుతున్నారు. ప్రధాన రహదారికి చేరువగా వచ్చేకొద్దీ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా గ్రామ పంచాయితీ లేఅవుట్లకు సంబంధించిన స్థలాలు ఉన్నాయి. ఎల్‌ఆర్‌ఎస్‌  ఉందా లేదా? ఆ మార్గంలో మాస్టర్‌ప్లాన్‌ ప్రతిపాదిత 100 అడుగుల రహదారి ఏమైనా ఉందా లేదా చూసి కొనుక్కోవాలి.


సోషల్‌ ఇన్‌ఫ్రా మెరుగ్గా..

* షాపింగ్‌, వినోదం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం మున్ముందు ఉండకపోవచ్చు. జాతీయ రహదారికి అటు ఇటు, అన్నోజిగూడ ప్రాంతాల్లో రిటైల్‌ మాల్స్‌, మల్టీఫ్లెక్స్‌లు అందుబాటులో ఉన్నాయి. కొత్తవి కూడా వస్తున్నాయి. రెస్టారెంట్లు, వినోద కేంద్రాలు, డ్రైవ్‌ ఇన్‌లు, ప్రైవేటు క్రీడా మైదానాలు అందుబాటులో ఉన్నాయి.

* అన్నింటికీ మించి ఇల్లు కొనేవారు చుట్టుపక్కల పాఠశాలలు ఎక్కడ ఉన్నాయని చూస్తుంటారు. పేరున్న పలు బడులు, కళాశాలలు సైతం చేరువలోనే ఉన్నాయి.

* ఐదు కిలోమీటర్ల దూరంలోని ఓఆర్‌ఆర్‌ అనుసంధానం.. 11 కి.మీ. దూరంలో ఉప్పల్‌ మెట్రో అందుబాటులో ఉంది.

* సేద తీరేందుకు నారపల్లిలో నందనవనం పార్కు ఉంది.

* నీటి వసతి మెరుగు పర్చేందుకు ప్రభుత్వం రూ.45 కోట్లతో పనులు చేపట్టింది.


ఎవరికి అనుకూలం

ఉప్పల్‌ చుట్టుపక్కల పనిచేసే వారికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందని బిల్డర్లు అంటున్నారు. ఉప్పల్‌లో ఆకాశహర్మ్యాల భవనాలు వస్తుండటంతో నివాస ధరలు రూ.కోటికి ఎగబాకాయి. ఉప్పల్‌ చుట్టుపక్కల ప్రాంతం ఐటీ జోన్‌గా విస్తరిస్తోంది. ఇప్పటికే ఇక్కడ ఒక ఐటీ సెజ్‌ ఉండగా... మరికొన్ని  ఐటీ కార్యాలయాలు వస్తున్నాయి.  ఇదివరకు ఉన్న పారిశ్రామిక కేంద్రాలను క్రమంగా ఐటీకి మారుస్తున్నారు. దీంతో ఇక్కడ గృహ వసతి ఖరీదుగా మారడంతో పోచారం వంటి ప్రాంతాల వైపు కొనుగోలుదారులు చూస్తున్నారు. బడ్జెట్‌ ధరల్లో ఇళ్లు చూస్తున్న వారికి సైతం ఈ ప్రాంతం అనుకూలంగా ఉంది. సొంతింటి కోసం చూస్తున్నవారు గట్టిగా బేరమాడి మరింత తక్కువ ధరకు తమ కలను నెరవేర్చుకోవచ్చు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని