వెండితెర కోటలో.. గృహ ప్రవేశం

నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం... సినీ, రాజకీయ, వ్యాపార, న్యాయ, అధికార, క్రీడా ప్రముఖులు నివాసముండే హిల్స్‌..  అక్కడ ఇల్లు ఉండటమే హోదాగా భావించే చోటు.. విశాలంగా, విలాసవంతమైన, విభిన్న నిర్మాణ శైలితో చూపరులను కట్టేపడేసే గృహాలు.. రోడ్‌ నంబర్లే ల్యాండ్‌మార్క్‌లు... మెరిసేపోయే రహదారులు.. కాలనీల్లో పరుచుకున్న పచ్చదనం.. సకల సౌకర్యాలతో నగరం నడిబొడ్డున ఉన్న రియల్‌ ఎస్టేట్‌ హాట్‌ స్పాటే

Updated : 28 May 2022 07:12 IST

నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం... సినీ, రాజకీయ, వ్యాపార, న్యాయ, అధికార, క్రీడా ప్రముఖులు నివాసముండే హిల్స్‌..  అక్కడ ఇల్లు ఉండటమే హోదాగా భావించే చోటు.. విశాలంగా, విలాసవంతమైన, విభిన్న నిర్మాణ శైలితో చూపరులను కట్టేపడేసే గృహాలు.. రోడ్‌ నంబర్లే ల్యాండ్‌మార్క్‌లు... మెరిసేపోయే రహదారులు.. కాలనీల్లో పరుచుకున్న పచ్చదనం.. సకల సౌకర్యాలతో నగరం నడిబొడ్డున ఉన్న రియల్‌ ఎస్టేట్‌ హాట్‌ స్పాటే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని చాలామంది కలలు కంటుంటారు. కానీ కొందరికే అదృష్టం వరించేది. గతంలో కంటే ఇప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున అపార్ట్‌మెంట్ల నిర్మాణంతో కలలను సాకారం చేసుకునే అవకాశాలు మెరుగయ్యాయి. 

ఈనాడు, హైదరాబాద్‌: సెంట్రల్‌ హైదరాబాద్‌లో ఉన్న హిల్స్‌ ప్రాంతాలు  ఒకప్పుడు గుట్టలు, కొండలతో ఉండేవి. క్రమంగా ఆవాసాలు వెలిశాయి. ఒక్కో నివాసం 500 నుంచి వెయ్యి గజాల విస్తీర్ణంలో విలాసవంతంగా ఉండేవి. అత్యధికం వ్యక్తిగత గృహాలే కనిపించేవి. అప్పట్లో కొనుగోలు శక్తి ఉన్నా.. చేతి దాకా అవకాశం వచ్చినా.. ఇల్లు కట్టుకునే ఖర్చు కంటే స్థలంలోని బండలను తొలగించేందుకు అయ్యే ఖర్చు అధికంగా అవుతుందని చాలామంది వదులుకున్నారు. అలాంటి గుట్టలున్న చోటే ఇప్పుడు సిటీలో అత్యంత ఖరీదైన ప్రాంతం. క్రమంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడమే కాదు ఐటీకారిడార్‌కు ఆనుకుని ఉండటంతో మరింత డిమాండ్‌ పెరిగింది. వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పేరున్న సంస్థల కార్యాలయాలు ఇక్కడికి వరస కట్టాయి. ఆసుపత్రులు, మాల్స్, విద్యాసంస్థలు, వినోద కేంద్రాలు, పార్కులు సకలం వచ్చేశాయి. అధునిక జీవనశైలి, నైట్‌ కల్చర్‌ కూడా ఈ ప్రాంతం రియల్‌ వ్యాపారానికి సానుకూలంగా మారింది.  

తెరుచుకున్న దారులు

బంజారాహిల్స్‌ ప్రాంతంలో వాహనాల రద్దీ పెరగడం.. ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నం కావడంతో ప్రభుత్వం పలు లింకు రోడ్లను వేసింది. ప్లైఓవర్లను నిర్మించింది. అన్నపూర్ణ స్టూడియో-యూసుఫ్‌గూడ, షేక్‌పేట-బంజారాహిల్స్, ప్రశాసన్‌నగర్‌-దర్గా రోడ్డు, రోడ్డు నంబరు 45-దుర్గం చెరువు కేబుల్‌ వంతెనతో ట్రాఫిక్‌ సాఫీగా సాగేలా మౌలిక వసతులు చేపట్టారు. ఈ దారులు ట్రాఫిక్‌ తగ్గించడంతో ఈ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌కు దారులు తెరిచాయి. మరిన్ని భూములు అందుబాటులోకి వచ్చాయి. చదరపు గజం రూ.మూడు లక్షలపైనే పలుకుతుండటంతో కొందరు తమ స్థలాలను, పాత ఇళ్లను డెవలప్‌మెంట్‌కు ఇస్తున్నారు. సిటీ బయట మరింత విశాలమైన స్థలంలో ఇళ్లు కట్టుకుని, విల్లాలు కొనుగోలు చేసి మకాం మారుస్తున్నారు. వారసత్వంగా వచ్చిన ఎకరాల భూములను కొందరు విక్రయిస్తున్నారు. ఆ ప్రదేశాల్లో ప్రస్తుతం అపార్ట్‌మెంట్లు వస్తున్నాయి. వందల సంఖ్యలో ఫ్లాట్లు మార్కెట్లో విక్రయానికి పెట్టారు. 

విశాలంగా ఉండేలా..  

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు పెద్దగా ఉండేవి కావు. ఇప్పుడు అవే ఎక్కువగా కనబడుతున్నాయి. నిర్మాణం చేపట్టే ప్రదేశం ఆధారంగా లక్షిత కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని బిల్డర్లు అపార్ట్‌మెంట్లు కడుతున్నారు. ఎక్కువశాతం అత్యంత విశాలంగా ఉండేలా చూస్తున్నారు. రెండువేల చదరపు అడుగులు మొదలు ఏడువేల చదరపు అడుగుల విస్తీర్ణం వరకు అల్ట్రా లగ్జరీ ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. అత్యధికం 4 పడక గదుల ఫ్లాట్లే కడుతున్నారు.  మూడు పడకల గదులు, స్టూడియో అపార్ట్‌మెంట్లు సైతం నిర్మిస్తున్నారు. రూ.కోటి మొదలు రూ.12 కోట్ల వరకు విస్తీర్ణాన్ని బట్టి ధరలు చెబుతున్నారు. వ్యక్తిగత ఇల్లు కావాలంటే రూ.50కోట్లైనా కావాలి. తక్కువ విస్తీర్ణమైనా రూ.పాతిక కోట్లు పెట్టాల్సిందే. అయినా దొరకని పరిస్థితి. దీంతో బడ్జెట్‌లో దొరికే ఫ్లాట్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. పశ్చిమ హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాల్లోనూ  అల్ట్రా లగ్జరీ ఫ్లాట్‌ కావాలంటే రూ.రెండుకోట్ల వరకు అవుతోంది. అదే ధర బంజారాహిల్స్‌లో వస్తుండటంతో కొన్ని వర్గాల కొనుగోలుదారులు, ముఖ్యంగా వ్యాపారులు, కార్పొరేట్‌ సంస్థలు వీటివైపు మొగ్గు చూపుతున్నాయి. రూ.5-10 కోట్ల మధ్య విలాసవంతమైన ఫ్లాట్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ చదరపు అడుగు సగటున రూ.14వేల నుంచి రూ.15వేల వరకు పలుకుతోంది. 20వేల వరకు విక్రయిస్తున్న సంస్థలు ఉన్నాయి. నిర్మాణ తీరుతెన్నులను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఎక్కువశాతం ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. 20 ఫ్లాట్లు మొదలు 135 వరకు ఒక్కో ప్రాజెక్టులో నివాసాలు వస్తున్నాయి. ‘ఈ ప్రాంతంలో ఇల్లు ఉండాలని ఎంతోమంది కలగలనేవారు. కొందరికే సాధ్యం అయ్యేది. ఇక్కడ స్థలం ఎంత ఉన్నా మూడు నాలుగు అంతస్తులకు మించి ఇదివరకు కట్టడానికి లేదు. ఇప్పుడు విస్తీర్ణానికి అనుగుణంగా ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌(ఎఫ్‌ఎస్‌ఐ) పరిమిత సడలింపు ఇవ్వడంతో అపార్ట్‌మెంట్లు కట్టే అవకాశం వచ్చింది. దీంతో మరింత ఎక్కువ మందికి సొంతింటి భాగ్యం ఇక్కడ దక్కుతోంది. ఈ ప్రాంతం అందం చెడకుండా నిర్మాణాలు చేపట్టాల్సిన బాధ్యత బిల్డర్లపై ఉంది’ అని ప్రదీప్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఎం.డి. బద్వేలు ప్రదీప్‌రెడ్డి ‘ఈనాడు’తో అన్నారు. 

ఎందుకు ప్రీమియం అంటే..

* మూడు నాలుగు దశాబ్దాలుగా ప్రీమియం మార్కెట్‌

* కొండ, గుట్టల ప్రాంతం కావడం 

* ఆధునిక జీవనశైలి.

* అప్పట్లోనే 50 అడుగుల విశాలమైన రహదారులు 

* ప్రముఖుల నివాస కేంద్రంగా మారడం 

* వాణిజ్య కార్యకలాపాలు పెరగడంతో భూముల ధరలు పెరిగాయి

7 ఎకరాలు ఉంటే మరింత ఎత్తుకు..

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో ఎఫ్‌ఎస్‌ఐ పరిమిత సడలింపుతో ఎక్కువ ఎత్తుకు వెళ్లడానికి అనుమతులు లేవు. అపార్ట్‌మెంట్లు సైతం ఐదు అంతస్తుల్లోనే వస్తున్నాయి. కొందరు టీడీఆర్‌ తీసుకుని అంతస్తులు వేస్తున్నారు. అయితే 7 ఎకరాల భూమి ఉంటే మరింత ఎత్తుకు వెళ్లేందుకు అనుమతి ఉందని నిర్మాణదారులు అంటున్నారు. ప్రస్తుతానికి ఎక్కువగా స్టాండలోన్‌ అపార్ట్‌మెంట్ల తరహాలోనే ప్రీమియంగా నిర్మిస్తున్నారు. మున్ముందు గేటెడ్‌ కమ్యూనిటీలు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. వివాదాల్లో ఉన్న భూములు ఒక్కోటిగా పరిష్కారమవుతూ వస్తున్నాయి. 

వాణిజ్యంలోనూ దూకుడు.. 

సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌గా భావించే ఈ ప్రాంతంలో లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య నిర్మాణాలు వస్తున్నాయి. నివాసాలు పెరగడంతో వాణిజ్యానికి డిమాండ్‌ ఏర్పడిందని.. ప్రముఖ బ్రాండ్ల షోరూంలు అన్నీ ఇక్కడ కొలువుదీరాయి. అంతర్జాతీయ బ్రాండ్లు మరిన్ని వస్తుండటంతో వీటికి నాణ్యమైన రిటైల్‌ నిర్మాణాలు కొరత ఉందని.. ఆ మేరకు కొత్త భవనాలకు డిమాండ్‌ ఉంటుందని బిల్డర్లు అంటున్నారు. గ్రేడ్‌-1 కార్యాలయాల నిర్మాణాలు సైతం వస్తున్నాయి. ప్లగ్‌ అండ్‌ ప్లే కార్యాలయాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా వస్తున్నాయి. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని