అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడేనా?

కొత్త మున్సిపల్‌ చట్టాన్ని స్థిరాస్తి సంఘాలు స్వాగతించాయి. 75 గజాల లోపు స్థలంలో జి+1 ఇంటి నిర్మాణానికి అనుమతి అక్కర్లేదని.. 500 చదరపు మీటర్ల లోపు నిర్మాణాలకు డ్రీమ్డ్‌ అప్రూవల్‌ ఇవ్వడం వరకు ఇందులో పొందుపర్చారు. హైదరాబాద్‌ నగర శివార్లలోని మున్సిపాలిటీలను కార్పొరేషన్లు చేయడం ద్వారా అక్కడ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడుతుందని నిర్మాణ సంఘాలు అంటున్నాయి. లేఅవుట్లపై కలెక్టర్‌కు అధికారం కట్టబెట్టడానికి సంబంధించి ఆచితూచి స్పందించాయి.

Updated : 20 Jul 2019 06:06 IST

కొత్త మున్సిపల్‌ చట్టాన్ని స్వాగతించిన స్థిరాస్తి సంఘాలు 
ఈనాడు, హైదరాబాద్‌

కొత్త మున్సిపల్‌ చట్టాన్ని స్థిరాస్తి సంఘాలు స్వాగతించాయి. 75 గజాల లోపు స్థలంలో జి+1 ఇంటి నిర్మాణానికి అనుమతి అక్కర్లేదని.. 500 చదరపు మీటర్ల లోపు నిర్మాణాలకు డ్రీమ్డ్‌ అప్రూవల్‌ ఇవ్వడం వరకు ఇందులో పొందుపర్చారు. హైదరాబాద్‌ నగర శివార్లలోని మున్సిపాలిటీలను కార్పొరేషన్లు చేయడం ద్వారా అక్కడ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడుతుందని నిర్మాణ సంఘాలు అంటున్నాయి. లేఅవుట్లపై కలెక్టర్‌కు అధికారం కట్టబెట్టడానికి సంబంధించి ఆచితూచి స్పందించాయి.

జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మాణదారులు నిబంధనల మేరకే కట్టడాలు చేపడుతున్నారని స్థిరాస్తి సంఘాలు చెబుతున్నాయి. 10 శాతం మార్టిగేజ్‌ చేయాలనే నిబంధనతో ఇక్కడ ఉల్లంఘనలు తక్కువని అంటున్నాయి. ఇందుకు భిన్నమైన పరిస్థితి శివార్లలో ఉంది. మొన్నటివరకు ఈ ప్రాంతాలన్నీ పంచాయతీలు కావడంతో అనుమతులు లేకుండానే ఇష్టారీతిగా నిర్మాణాలు వెలిశాయి. 15 అడుగుల రహదారి కూడా లేని కాలనీల్లోనూ ఐదు అంతస్తుల భవనాలు నిర్మించారు. 200 గజాల స్థలంలోనే ఆరు అంతస్తుల మేడలు వెలిశాయి. మౌలిక వసతులు లేక అక్కడ ఇళ్లను కొనుగోలు చేసినవారు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. శివారు ప్రాంతాలను కొత్తగా కార్పొరేషన్‌ చేయడంతో ఇక్కడ నిర్మాణాలు ప్రణాళికాబద్ధంగా వచ్చే అవకాశం ఉంది.

గతానుభవాలు ఎలా ఉన్నాయి.. 
500 చ.మీ.పైగా విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు సెట్‌బ్యాక్‌ వంటి నిబంధనలు పాటిస్తున్నా.. తక్కువ విస్తీర్ణంలో చేపట్టే వ్యక్తిగత గృహాల్లో అస్సలు వదలడం లేదు. వీటికి ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్‌ పొందడంలో సడలింపు ఇవ్వడంతో అడుగు జాగా వదలకుండా నిర్మాణాలు చేపడుతున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఎంత విస్తీర్ణంలో ఎన్ని అంతస్తులు నిర్మించవచ్చు? ఎవరి నుంచి అనుమతి తీసుకోవాలనే నిబంధనలు ఉన్నా పాటించడం లేదు. నిబంధనల ఉల్లంఘనలతో వ్యక్తిగతంగా ఎక్కువ లాభపడే పరిస్థితులు ప్రస్తుతం ఉండటంతో యథేచ్ఛగా వాటిని తుంగలో తొక్కుతున్నారు. కొత్త చట్టం ప్రకారం స్వీయ ధ్రువీకరణ కీలకం. ఇది పాటించకపోతే తీవ్రంగా నష్టపోతామనే భయం ఉండేలా భారీ జరిమానాలు ఉంటాయని ప్రభుత్వం అంటోంది.

కూల్చే అధికారం ఉంటుంది..  
- జె.వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ 

కొత్త మున్సిపల్‌ చట్టం చాలా బాగుంది. 500 చదరపు మీటర్లలోపు నిర్మాణాలకు సింగిల్‌ విండో విధానం, డ్రీమ్డ్‌ అప్రూవల్‌తో అనుమతుల జారీలో జాప్యం ఉండదు. నిర్మాణదారులకు, సొంతంగా నిర్మించుకునేవారికి చాలా ఊరట. ఎక్కడికైనా బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి కొత్త చట్టంలో కల్పించడం వల్ల సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యం వహిస్తే బదిలీ వేటు పడుతుందనే భయం ఉంటుంది. లేఅవుట్‌ అధికారం కలెక్టర్‌కు ఇవ్వడం ద్వారా నియంత్రణ ఉంటుంది. పూర్తి వివరాలు తెలిస్తే తప్ప దీని ప్రభావంపై కచ్చితమైన అంచనాకు రాలేం. పచ్చదనం పెంపు కార్పొరేషన్‌లోని ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉండటంతో భయంతోనైనా సంరక్షణ బాధ్యత తీసుకుంటారు. అక్రమ నిర్మాణాలు చేపడితే కార్పొరేషన్‌కు కూల్చేసే అధికారం ఉంది కాబట్టి వీటికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నాం. 

ప్రణాళికాబద్ధ అభివృద్ధికి ఆస్కారం 
- జి.వి.రావు, అధ్యక్షుడు, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌

లేఅవుట్లపై తుది అధికారం కలెక్టర్‌కు ఇవ్వడం మంచిదే. ఐఏఎస్‌ అధికారులు కావడంతో మూడేళ్లకొకరు మారిపోతుంటారు. జిల్లా అభివృద్ధే తప్ప ఇతరత్రా వేరే ఉద్దేశాలు ఉండవు. డబ్బులు తీసుకుని అనుమతులు ఇవ్వడం అంటూ ఉండదు. కొత్త చట్టంలో ప్రధానంగా మూడు అంశాలు కనిపించాయి. స్వీయ ధ్రువీకరణ, స్వీయ మదింపు, తప్పైతే భారీ జరిమానాలు ఇందులో ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో పంచాయతీలు ఉండటంతో తగినంత సిబ్బంది లేక నియంత్రణ ఉండేది కాదు. పైగా అక్కడ ఒకటే ప్రణాళిక ఉండేది. ఇప్పుడు కార్పొరేషన్లు కావడంతో ప్రణాళికాబద్ధ అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా 5 రకాల ప్రణాళికలు రూపొందించుకోవడం, అమలయ్యేలా చూసే బాధ్యత వీటి మీద ఉంటుంది. మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, మురుగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్యం, పచ్చదనం, ట్రాఫిక్‌, రవాణా ప్రణాళికలతో మాస్టర్‌ ప్లాన్‌ ఉంటుంది. ఎడాపెడా కాకుండా ఓ రీతిన అభివృద్ధి ఉంటుంది. సహజంగానే ఇది స్థిరాస్తి రంగానికి మేలు చేస్తుంది. డ్రీమ్డ్‌ అప్రూవల్‌ 500 చదరపు మీటర్ల వరకు అన్నా.. 10 మీటర్ల ఎత్తు ఆంక్షలు ఉన్నాయి. సిల్ట్‌+3 అంతస్తులు మాత్రమే వీటి పరిధిలోకి వస్తాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని