కట్టండి.. కాసులిస్తాం 

నగరంలో నిర్మిస్తున్న స్థిరాస్తి ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థాగత మదుపరులు ముందుకొస్తున్నారు. దేశంలో స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి చట్టం(రెరా) అమల్లోకి రావడం...  రాష్ట్రంలో అమలుకు చర్యలు తీసుకోవడంతో ఇక్కడ చేపడుతున్న ప్రాజెక్ట్‌లపై సంస్థాగత మదుపరుల్లో క్రమంగా విశ్వాసం వ్యక్తం అవుతోంది. దీంతో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో ప్రైవేటు ..

Published : 10 Nov 2018 05:06 IST

స్థిరాస్తి ప్రాజెక్ట్‌లలో సంస్థాగత మదుపర్ల జోరు 
ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో నిర్మిస్తున్న స్థిరాస్తి ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థాగత మదుపరులు ముందుకొస్తున్నారు. దేశంలో స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి చట్టం(రెరా) అమల్లోకి రావడం...  రాష్ట్రంలో అమలుకు చర్యలు తీసుకోవడంతో ఇక్కడ చేపడుతున్న ప్రాజెక్ట్‌లపై సంస్థాగత మదుపరుల్లో క్రమంగా విశ్వాసం వ్యక్తం అవుతోంది. దీంతో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడులు గత ఏడాదితో పోలిస్తే పెరిగాయి. ముంబయి తర్వాత హైదరాబాదే ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించింది.
దేశంలోకి వస్తున్న పెట్టుబడుల్లో అత్యధికంగా ముంబయిలోని ప్రాజెక్ట్‌ల్లో  2 బిలియన్‌ డాలర్లను మదుపు చేశారు.  ఆ తర్వాత హైదరాబాద్‌లోనే. ఇక్కడి ప్రాజెక్ట్‌ల్లోకి 793 మిలియన్‌ డాలర్లు వచ్చాయి.

కట్టండి.. కాసులిస్తాం స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టడమంటే భారీగా రాబడి అందుకోవచ్చు.. కొన్నిసార్లు ‘అసలు’కే మోసం రావొచ్చు. వ్యక్తులే కాదు సంస్థాగత మదుపర్లకు గతంలో పలు చేదు అనుభవాలు ఉన్నాయి. గతంలో విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టి ఆర్థిక మందగమనంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. నగరంతో సహా దేశవ్యాప్తంగా కొన్ని పెద్ద సంస్థలు ఆయా స్థిరాస్తి ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తిచేయలేక పోయాయి. దివాళా తీశాయి. కొన్ని సంస్థలు బ్యాంకుల రుణాలు తీర్చలేకపోయాయి. దీంతో సంస్థాగత మదుపర్లు పెట్టుబడులు పెట్టేందుకు వెనక్కి తగ్గడంతో నగదు లభ్యత లేక మార్కెట్‌ ఇబ్బంది పడింది. ప్రాజెక్ట్‌లు పూర్తి చేయడంలో ఆలస్యం, పూర్తయిన వాటిలో అమ్మకాలు లేకపోవడం.. మొత్తంగా కొనుగోలుదారుల్లో, మదుపర్లు విశ్వాసం కోల్పోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే కేంద్రం స్థిరాస్తి నియంత్రణకు చర్యలు తీసుకురావడంతో క్రమంగా విశ్వాసం పెరుగుతోంది అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. ఈ రంగంలో వృద్ధికి ఎంతో అవకాశం ఉందని.. 2025 నాటికి 650 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని నరెడ్కో, ఏపీఆర్‌ఈఏతో కలిసి కేపీఎంజీ ఇచ్చిన నివేదికలో పేర్కొంది. 2030 నాటికి ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. 
అయిదేళ్లలో ఇదే అత్యధికం 
దేశంలోకి వస్తున్న పెట్టుబడుల్లో అత్యధికంగా ముంబయిలోని ప్రాజెక్ట్‌ల్లో పెట్టారు. ఏకంగా 2 బిలియన్‌ డాలర్లను మదుపు చేశారు. మొత్తం పెట్టుబడుల్లో ఇది 53 శాతం. ఆ తర్వాత హైదరాబాద్‌లోనే. ఇక్కడి ప్రాజెక్ట్‌ల్లోకి 793 మిలియన్‌ డాలర్లు వచ్చాయి. విదేశీతో పాటూ దేశీయ మదుపర్ల పెట్టుబడులు ఇందులో ఉన్నాయి. ఆ తర్వాత బెంగళూరు(694 మిలియన్‌ డాలర్లు) ఉంది. 
* అందుబాటు ఇళ్ల ప్రాజెక్ట్‌లు, కోవర్కింగ్‌ కార్యాలయాలు, ఏ గ్రేడ్‌ కార్యాలయాల ప్రాజెక్ట్‌ల్లోకి పెట్టుబడులు వస్తున్నాయి. 
* 2018లో 4 బిలియన్‌ డాలర్లను సంస్థాగత మదుపర్లు పెట్టుబడి పెట్టారు. 
* సగటున ఒక్కో ప్రాజెక్ట్‌లో పెట్టుబడి 150 మిలియన్‌ డాలర్ల వరకు ఉంది.  గత ఐదేళ్లలో ఇదే అత్యధికం. 
* 2016లో సగటున ఒక్కో ప్రాజెక్ట్‌లో పెట్టుబడి 47 మిలియన్‌ డాలర్లు మాత్రమే. రెండేళ్లలో దాదాపు మూడింతలు పెరిగింది. 
* పెట్టుబడుల్లో 44 శాతం వాటా  అమెరికా, కెనడా, సింగపూర్‌ సంస్థాగత మదుపర్ల నుంచే. 

కట్టండి.. కాసులిస్తాం 

* విదేశీ పెట్టుబడుల్లో 90 శాతం వరకు ముంబయి, హైదరాబాద్‌, బెంగళూరు, పుణె నగరాల్లో చేపట్టిన వాణిజ్య ప్రాజెక్ట్‌ల్లో పెట్టారు. 
* విదేశీ పెట్టుబడులు ఒక్కో ప్రాజెక్ట్‌లో సగటున 149 మిలియన్‌ డాలర్లుగా ఉంది. దేశీయ పెట్టుబడి సగటున 87 మిలియన్‌ డాలర్లుగా ఉంది. 
* దేశీయ సంస్థాగత మదుపర్లు వాణిజ్య, గృహ ప్రాజెక్ట్‌ల్లో సమంగా పెట్టుబడులు పెడుతున్నారు. వాణిజ్యంలో 959 మిలియన్‌ డాలర్లు మదుపు చేయగా.. గృహ నిర్మాణంలో 870 మిలియన్‌ డాలర్లు పెట్టారు.

 

డిమాండ్‌ ఉన్న నగరం

కట్టండి.. కాసులిస్తాం 

దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చితే మన దగ్గర భూముల ధరలు తక్కువగా ఉన్నాయి. రియల్‌ ఎస్టేట్‌లో వృద్ధికి అవకాశం ఉండటంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు, ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. హైదరాబాద్‌లో వచ్చే నాలుగైదేళ్లలో 3.3 కోట్ల చదరపు అడుగుల వాణిజ్య, కార్యాలయాలకు గిరాకీ ఉంటుంది. ఇప్పటికే చాలావరకు ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. వాణిజ్య నిర్మాణాల రాకతో ఆ మేరకు గృహనిర్మాణాలకు డిమాండ్‌ పెరుగుతుంది.

- పి.రవీందర్‌రావు, అధ్యక్షుడు, ట్రెడా 

నిబంధనల సడలింపుతో..

కట్టండి.. కాసులిస్తాం 

గతంలో పలు విదేశీ సంస్థాగత మదుపర్లు కొండాపూర్‌ చుట్టుపక్కల చేపట్టిన ప్రాజెక్ట్‌ల్లో పెట్టుబడులు పెట్టారు. అప్పట్లో వాటికి ప్రతికూల ఫలితాలే వచ్చినా.. మార్కెట్‌ త్వరగా కోలుకోవడం, నియంత్రణలు పెరగడం, కేంద్రం విదేశీ పెట్టుబడుల విషయంలో నిబంధనలు సడలించడం వంటి చర్యలతో తిరిగి పెట్టుబడులు పెరుగుతున్నాయి. స్థిరాస్తి పరంగా వృద్ధికి అవకాశం ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ సహజంగా ముందుంటుంది. అందుకే ఆయా సంస్థలు ఇటువైపు ఆసక్తి కనబరుస్తున్నాయి.

- జీవీ రావు, అధ్యక్షుడు, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని