రియల్‌ పరుగు ఆగొద్దంటే..!

స్థిరాస్తి మార్కెట్‌ రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో ఎలా ఉండబోతుంది? మాంద్యం ప్రభావమేమైనా ఉంటుందా? పరిశ్రమ ఎలాంటి ఇబ్బందులు

Published : 21 Sep 2019 03:01 IST

ప్రభుత్వానికి తెలంగాణ క్రెడాయ్‌ పలు విజ్ఞప్తులు

స్థిరాస్తి మార్కెట్‌ రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో ఎలా ఉండబోతుంది? మాంద్యం ప్రభావమేమైనా ఉంటుందా? పరిశ్రమ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటోంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి మద్దతు కోరుకుంటుంది? ఈ అంశాలపై రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(క్రెడాయ్‌) తెలంగాణ శాఖ నూతన కార్యవర్గం తమ అభిప్రాయాలను వెల్లడించింది. రాష్ట్రంలో మొదలైన రియల్‌ పరుగు ఆగొద్దంటే ఈ రంగం తోడ్పాటుకు పలు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలను కోరింది.

ఈనాడు, హైదరాబాద్‌

దేశంలో వ్యవసాయం తర్వాత ఉపాధి కల్పన పరంగా రెండో అతిపెద్ద రంగం రియల్‌ ఎస్టేట్‌. ఇప్పటివరకూ దీనిని ఓ పరిశ్రమగా గుర్తించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి తగిన రీతిలో ప్రయోజనాలు కల్పించాలని తెలంగాణ క్రెడాయ్‌ కోరుతోంది.

రాష్ట్రానికి విజ్ఞప్తులు
నగరం అన్నివైపులా అభివృద్ధి విస్తరించేందుకు ప్రభుత్వం ముందుగా సామాజిక సదుపాయాలను కల్పించాలి. ఇవి ఉంటే ఆ ప్రాంతాలకు ఐటీ, ఇతర సంస్థలు వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా పశ్చిమ హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గుతుంది. అప్పుడు పశ్చిమ, తూర్పు ప్రాంతాలే కాదు నగరం అన్నివైపులా అభివృద్ధి చెందుతుంది.
పలు స్థిరాస్తి ప్రాజెక్ట్‌లు పద్నాలుగు నెలలుగా పర్యావరణ అనుమతులు రాక అపరిష్కృతంగా ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభించలేకపోతున్నారు. వీటిపై సత్వరం అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.
ఆన్‌లైన్‌ అనుమతుల జారీలోనూ సమస్యలు ఉన్నాయి. ప్రాజెక్ట్‌ ఆలస్యమయ్యేకొద్దీ వ్యయం పెరుగుతుంది. చివరకు అది కొనుగోలుదారుల మీద పడుతుంది. నిర్దేశించిన గడువు లోగా అనుమతులు జారీ అయ్యేలా చూడాలి.
జంట జలాశయాల పరివాహక ప్రాంతంలో లేని కొన్ని గ్రామాలు జీవో నంబర్‌ 111 పరిధిలో ఉన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గౌలిదొడ్డి ప్రాంతమే ఇందుకు నిదర్శనం. ఆ పక్కనే ఆకాశహర్మ్యాలు ఉంటాయి. గౌలిదొడి మాత్రం జీవో111 కింద ఉండడంతో నష్టపోతున్నారు. ఈ ప్రాంతమే పరివాహకంలో ఉంది. ఇలాంటి వాటిని శాస్త్రీయంగా పరిశీలించాలి. ఈ వెసులుబాటులో పశ్చిమ హైదరాబాద్‌ చుట్టుపక్కల భూ లభ్యత పెరుగుతుంది. ఇప్పటికే అందుబాటులో లేనంత స్థాయికి చేరిన ధరలతో సమీపంలోకి వెళ్లి కొనుగోలు చేసేందుకు ఆస్కారం ఉంటుంది.
నగరంలో వంద అడుగులపైన ఉన్న 107 రహదారులను కమర్షియల్‌ రోడ్లుగా జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. అయితే వీటిలో గచ్చిబౌలి నుంచి కేంద్రీయ విశ్వవిద్యాలయం వెళ్లే మార్గం లేదు. వీటిని సైతం కమర్షియల్‌ రోడ్లుగా గుర్తించాలి.

కేంద్రానికి..
నిర్మాణరంగంలో వాడే స్టీలు, సిమెంట్‌ ఇలా ఒక్కో వస్తువుకు జీఎస్టీ ఒక్కో స్లాబులో ఉంది. ఇన్‌ఫుట్‌ టాక్స్‌ సబ్సిడీ తీయడంతో వ్యయం పెరిగింది. వస్తువులన్నింటికి కలిపి కామన్‌గా ఒక స్లాబ్‌రేటును నిర్ణయించాలని పరిశ్రమ కోరుతోంది.
అందుబాటు గృహాలకు రూ.45 లక్షల పరిమితి విధించారు. దీన్ని మరింతగా పెంచాలి.
రెరా అమలుతో దేశవ్యాప్తంగా చిన్న బిల్డర్లు 50 శాతం తగ్గిపోయారు. ఇది ఆరోగ్యకరం కాదని.. ఈ రంగంపై ఆధారపడి 3000 ఇతర అనుబంధ పరిశ్రమలు ఉన్నాయని మునిగిపోకుండా ఉండేందుకు ఉద్దీపన చర్యలను చేపట్టాలని కోరుతోంది.

మున్ముందు మరింత డిమాండ్‌
- సీహెచ్‌.రాంచంద్రారెడ్డి, అధ్యక్షుడు, క్రెడాయ్‌ తెలంగాణ

దేశంలో చాలా ప్రాంతాల్లో స్థిరాస్తి రంగం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే హైదరాబాద్‌ మార్కెట్‌కు రెండుమూడేళ్ల వరకు ఢోకా లేదు. చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో గణనీయమైన డిమాండ్‌ ఉంది. కార్యాలయ నిర్మాణాల్లో లీజింగ్‌ పెరిగింది. సిద్ధంగా ఉన్న కార్యాలయాలు లేనేలేవు. నిర్మాణంలో ఉన్నవాటిలో లీజింగ్‌ చేసుకుంటున్నారు ఐటీ, ఐటీ ఆధారిత రంగాల వృద్ధి దీనికి కారణం. ఈ కార్యాలయాల్లో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు రానున్నాయి. రెండు మూడేళ్లలో గృహ నిర్మాణానికి డిమాండ్‌ అధికంగా ఉంటుందని అంచనా. చెన్నై, బెంగళూరు, పుణె నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో స్థిరాస్తి ధరలు తక్కువ. కాబట్టి కొనుగోలుదారులు తక్షణమే తమకు నచ్చిన ఇంటిని కొనేందుకు ఇదే సరైన సమయం.

పరిశ్రమగా గుర్తించాలి..
-  డి.మురళీకృష్ణారెడ్డి, ఎన్నికైన అధ్యక్షుడు

వ్యవసాయం తర్వాత అత్యధికమందికి ఉపాధి కల్పిస్తున్నది నిర్మాణ రంగమే. దీన్ని పరిశ్రమగా గుర్తించాలి. ఈ రంగంలో చిన్న ప్రాజెక్ట్‌ వ్యయం కూడా రూ.వంద కోట్లు ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల కోసం తీసుకొచ్చిన టీఎస్‌ ఐపాస్‌ సింగిల్‌విండో క్లియరెన్స్‌ విధానాన్ని రియల్‌ ఎస్టేట్‌ కోసం కల్పించాలి. దీనిపై ఇటీవల పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శితో మేము సమావేశమయ్యాం.  ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులు కోరారు. త్వరలోనే ప్రతిపాదనలు సమర్పిస్తాం.

జిల్లాలతో అనుసంధానం పెంచేలా..
- ఇ. ప్రేంసాగర్‌రెడ్డి, కార్యదర్శి

హైదరాబాద్‌ను అన్ని జిల్లాలతో అనుసంధానం చేసేలా పారిశ్రామిక కారిడార్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. ఫలితంగా వృద్ధి అన్నివైపులా సమానంగా జరుగుతుంది. హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్‌ కోసం సిద్ధం చేసిన ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌ను తక్షణమే ప్రభుత్వం ఆమోదించాలి. తద్వారా అక్రమ నిర్మాణాలకు, అడదిడ్డ అభివృద్ధికి అడ్డుకట్ట పడుతుంది. ప్రణాళిక మేరకు అభివృద్ధితో పాటూ ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని