2020 విల్లామెంట్‌లదే!

కొత్త సంవత్సరంలో మార్కెట్‌ పోకడలు ఎలా ఉండనున్నాయి? నిర్మాణదారులు ఎలాంటి కొత్త ఇళ్లను నిర్మించబోతున్నారు? 2020లో విల్లామెంట్‌లదే

Updated : 28 Dec 2019 03:34 IST

కొత్త సంవత్సరంలో మార్కెట్‌ పోకడలు ఎలా ఉండనున్నాయి? నిర్మాణదారులు ఎలాంటి కొత్త ఇళ్లను నిర్మించబోతున్నారు? 2020లో విల్లామెంట్‌లదే హవా అంటున్నారు బిల్డర్లు. నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో ఇప్పటికే వీటి నిర్మాణాలు ప్రారంభం అయ్యాయని మున్ముందు ఈ తరహా అల్ట్రా లగ్జరీ అపార్ట్‌మెంట్లు పెరుగుతాయని అంటున్నారు. ఈ పోకడ శివార్లలో మొదలైనా క్రమంగా నగరంలోకి విస్తరిస్తుందని చెబుతున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌లో ఈ ఏడాది కాలంలోనూ చాలా ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగాయి. అంతక్రితం ఏడాదే రెండింతలయ్యాయి. ఈ ప్రభావం విల్లా ప్రాజెక్ట్‌లపై పడింది. రూ.కోట్లలో పలుకుతున్న భూములను కొనుగోలు చేసి విల్లాలు నిర్మించడం ఆర్థికంగా లాభసాటిగా లేదని నిర్మాణదారులు అంటున్నారు. విల్లా ధరలు పెంచితే నగరానికి దూరం కాబట్టి కొనుగోలుదారుల నుంచి పెద్దగా ఆసక్తి ఉండదనే అంచనాతో కొత్త పోకడకు తెర తీశారు. విల్లాలో ఉండే సదుపాయాలన్నీ కల్పించేందుకు అపార్ట్‌మెంట్లను విశాలంగా అల్ట్రా లగ్జరీగా నిర్మిస్తున్నారు. వీటిని ఇప్పుడు విల్లామెంట్‌గా పిలుస్తున్నారు. తొలుత కొంచెం ఆలోచన చేసినా వీటిలో క్రమంగా విక్రయాలు పెరుగుతుండడంతో బిల్డర్లలోనూ విశ్వాసం పెరిగింది. ఒకరి తర్వాత ఒకరు విల్లామెంట్‌ ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తున్నారు.

ఏడువేల అడుగులపైనే..
నగరంలో బడా నిర్మాణ సంస్థలు ఇప్పటికే విలాసవంతమైన విల్లామెంట్లను తక్కువలో తక్కువ 4వేల చదరపు అడుగుల నుంచి 8వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. షేక్‌పేట, కొండాపూర్‌, కొల్లూరు, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఫిల్మ్‌నగర్‌లో చాలా ఏళ్ల క్రితమే ఇలాంటి ప్రాజెక్ట్‌లు వచ్చాయి. నగరంలోని ఇతర ప్రాంతాలకు, నగరం మధ్యలోనూ రాబోయే సంవత్సరాల్లో కొత్త విల్లామెంట్‌లు రానున్నట్లు నిర్మాణదారులు చెబుతున్నారు.

విల్లా మాదిరే..
బయట నుంచి చూడటానికి అపార్ట్‌మెంట్‌ మాదిరి ఉంటుంది కానీ సౌకర్యాల పరంగా విల్లాకు ఏ మాత్రం తగ్గకుండా డిజైన్‌ చేస్తున్నారు. అంతస్తుకు ఒకటి లేదా రెండే ఫ్లాట్లు ఉంటాయి. ప్రతి విల్లామెంట్‌కు ఫ్రైవేటు కారిడార్‌ ఉంటుంది. ఆ ఇంటివారు తప్ప ఇతరులు అక్కడ రాకపోకలు సాగించరు.మూడు నాలుగు బాల్కనీలు వస్తాయి. నాలుగైదు పడకగదులు ఉంటాయి. హోం థియేటర్‌తో పాటూ, వ్యాయామశాల, ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తున్నారు.  ప్రాంతాలను బట్టి రూ.రెండు మూడు కోట్ల నుంచి విస్తీర్ణం పెరిగేకొద్దీ ఇంకా ఎక్కువే చెబుతున్నారు. రూ.కోటి లోపు దొరుకుతున్నాయి.
 

ఎందుకు మొగ్గు...
విల్లాల ధరల పెరగడంతో విల్లామెంట్‌ల వైపు చూస్తున్నారు.
అభివృద్ధి చెందిన ప్రాంతంలో ప్రాజెక్ట్‌లు వస్తుండడంతో అక్కడే నివాసం ఉండొచ్చని...
భద్రతకు ఢోకా ఉండదని...
కుటుంబ సభ్యులందరూ దగ్గర ఉండొచ్చని... వేర్వేరు అంతస్తుల్లో తీసుకుంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని