నలువైపులా రావాలంటే?

ఐటీ సంస్థలన్నీ ఇదివరకు తమ కార్యాలయాల ఏర్పాటుకు 50వేల చదరపు అడుగుల విస్తీర్ణం సిద్ధంగా ఉంటే చాలనేవి. ఇప్పుడు ఒకే చోట లక్షల

Updated : 11 Jan 2020 02:52 IST

కొత్త ఐటీ టవర్ల నిర్మాణాలన్నీ పశ్చిమం వైపే..
ఈనాడు, హైదరాబాద్‌

 ఐటీ సంస్థలన్నీ ఇదివరకు తమ కార్యాలయాల ఏర్పాటుకు 50వేల చదరపు అడుగుల విస్తీర్ణం సిద్ధంగా ఉంటే చాలనేవి. ఇప్పుడు ఒకే చోట లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భవనాలు కావాలని కోరుతున్నాయి. ఒక్కో సంస్థ మూడు లక్షల నుంచి పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఐటీ కారిడార్‌లో మూడు నాలుగు ప్రాంతాల్లో ఉన్న తమ కార్యాలయాలను ఒకే చోటుకు మారుస్తున్నాయి. దీంతో ఏ గ్రేడ్‌ కార్యాలయ భవనాలకు డిమాండ్‌ ఏర్పడింది. ప్రభుత్వం లుక్‌ ఈస్ట్‌ అంటూ పోచారం చూపిస్తున్నా.. కార్యాలయాల ఏర్పాటు అనుకూలత దృష్ట్యా పశ్చిమ హైదరాబాద్‌లోనే ఐటీ సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. అమెరికా ఐటీ సంస్థ మైక్రాన్‌ నానక్‌రాంగూడలోని ఫినిక్స్‌ ఐటీ సెజ్‌లో 10.3 లక్షల చ.అ. కార్యాలయ జాగా (ఆఫీస్‌ స్పేస్‌)ను లీజ్‌కు తీసుకుంది. ఐటీ సెజ్‌లలో ఇది అతిపెద్ద లీజు కావడం విశేషం. ఇకపై ప్రతినెలా ఇలాంటి పెద్ద లీజులు ఉండబోతున్నట్లు మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.

హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి చుట్టుపక్కలనే ఐటీ విస్తరిస్తుండడం.. అభివృద్ధి మొత్తం ఒకేచోట కేంద్రీకృతం కావడం.. ట్రాఫిక్‌.. వంటి సమస్యలతో నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఐటీ విస్తరించానే ప్రణాళికలు ఉన్నాయి. కానీ ఐటీ టవర్లు, కొత్తగా వస్తున్న కార్యాలయాలన్నీ గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాల వైపే మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే ఐటీ కార్యాలయాల భవనాలు చాలావరకు రాయదుర్గం, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉండగా.. కొత్తగా నిర్మించేందుకు అనుమతులు కూడా ఇటువైపే తీసుకున్నారు. ఖాజాగూడ, కోకాపేట, పుప్పాలగూడవైపు కొత్తగా ఐటీ టవర్లు వస్తున్నాయి. నిర్మాణంలో ఉన్నవి.. అనుమతులు పొందినవి.. కొత్తగా వచ్చేవాటిని కలుపుకొంటే మరో ఐదారేళ్ల పాటు ఐటీ విస్తరణ పశ్చిమ హైదరాబాద్‌లోనే ఉంటుందని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థలు అంటున్నాయి. ఇక్కడ విస్తరణకు పలు సానుకూలతలు ఉన్నాయని చెబుతున్నారు. తక్షణం లీజుకు లక్షల చదరపు అడుగుల కార్యాలయ జాగా (ఆఫీసు స్పేస్‌) సిద్ధంగా ఉండడం, అధిక విస్తీర్ణంలో భూముల లభ్యత, ఐటీ నిపుణులు, ఉన్నతాధికారులు నివాసం ఉండేందుకు వారి స్థాయిలో ఇళ్ల లభ్యత, హోటల్స్‌ వంటి అనుకూలతలు ఇక్కడ ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఇప్పటికిప్పుడు ఇలాంటి అనుకూలతలు లేకపోవడంతో ఐటీ సంస్థలు అద్దెలు తక్కువైనా పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. ఇతర ప్రాంతాల్లో భూముల ధరలు అధికంగా ఉండడం ఒకింత సమస్యగానే ఉందన్నారు.

అంతస్తులు పెంచుతున్నారు..
ఐటీ కారిడార్‌లో భూముల ధరలు రూ.30 కోట్లకు పైగా పలుకుతుండడంతో కొత్తగా నిర్మించే కార్యాలయాలు గరిష్ఠంగా 36 అంతస్తులకు ఎగబాకుతున్నాయి. తొలినాళ్లలో ఐటీ సంస్థలు ఐదు అంతస్తుల్లో ఉండగా.. ఆ తర్వాత పదికి పెరిగాయి. ఇటీవల నిర్మించినవి 20 అంతస్తుల వరకు ఉన్నాయి. కొత్తవి మరింత ఎత్తుకు నిర్మిస్తున్నారు. ఐటీ సంస్థల నుంచి ఎక్కువ విస్తీర్ణం కావాలనే డిమాండ్‌ ఉండడం, కోవర్కింగ్‌ సంస్థలు రాకతో కొత్తగా భవనాల్లో లీజింగ్‌ వేగంగా పూర్తవుతోంది. గతేడాది 1.28 కోట్ల చదరపు అడుగుల లీజింగ్‌ జరగడం ఈ ప్రాంతానికి ఉన్న డిమాండ్‌ను సూచిస్తోంది. అయితే ఒకేచోట ఐటీ టవర్లు రావడంతో మౌలిక వసతులపై తీవ్ర ఒత్తిడి ఉంటోంది. ప్రభుత్వం మెరుగైన పాలసీలతో రాయితీలు ఇస్తే కొత్త ప్రాంతాలకు ఐటీ సంస్థలను రప్పించడం కష్టమేమీ కాదని స్థిరాస్తి సంఘాలు అంటున్నాయి. 2008లో మాదాపూర్‌లోనే ఐటీ కంపెనీలు ఉండేవని.. కొత్త సంస్థలను గచ్చిబౌలి వైపు రప్పించేందుకు శ్రమించాల్సి వచ్చిందని ఓ కన్సల్టెన్సీ ప్రతినిధి అన్నారు.

కొత్తవి కూడా ఇక్కడే..
* ఖాజాగూడలో 36అంతస్తుల్లో వాణిజ్య భవనాలు 2వస్తున్నాయి. టవర్‌ ‘ఏ’లో 34 అంతస్తులు, టవర్‌ ‘బి’లో 36 అంతస్తులు రాబోతున్నాయి.రెండింట్లో కలిపి58 లక్షల చ.అ. బిల్టప్‌ ఏరియా రాబోతుంది.
* నానక్‌రాంగూడలో 27 అంతస్తుల భవనం రాబోతుంది. వాణిజ్యంతో పాటూ కార్యాలయాలకు పనికొచ్చేలా 3 లక్షలకుపైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు రాబోతున్నాయి.
* రాయదుర్గంలో 24 అంతస్తుల వాణిజ్య భవనానికి అనుమతి తీసుకున్నారు. 11లక్షలకు పైగా చ.అ. బిల్టప్‌ ఏరియా రాబోతుంది.
* ఐటీ కార్యాలయాల కోసం ఒక్కోటి 21 అంతస్తుల చొప్పున 3 టవర్లకు రాయదుర్గంలో అనుమతి పొందారు. ఇక్కడ 27 లక్షల చ.అ.పైగా ఆఫీస్‌ స్పేస్‌ రాబోతుంది.
* నానక్‌రాంగూడలోనే ఒక్కోటి 21 అంతస్తుల్లో 2 కార్యాలయ భవనాలు రాబోతున్నాయి. 14.5 లక్షల చ.అ.విస్తీర్ణంలో ఇవి రానున్నాయి.
* గచ్చిబౌలిలో ఒకటి 19 అంతస్తులు, మరోటి 20 అంతస్తుల్లో ఐటీ కార్యాలయాలు రాబోతున్నాయి. 27 లక్షల చ.అ. విస్తీర్ణంలో ఉండబోతున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని