నిర్మాణంలో ఉన్న ఇళ్లకు ఊతం

నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లను మనవాళ్లు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. తక్కువ ధరకు, నచ్చిన అంతస్తులో, కావాల్సిన ఫ్లాట్‌ను నిర్మాణం ప్రారంభంలోనే బుక్‌

Updated : 18 Jan 2020 01:35 IST

ఈనాడు, హైదరాబాద్‌

 నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లను మనవాళ్లు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. తక్కువ ధరకు, నచ్చిన అంతస్తులో, కావాల్సిన ఫ్లాట్‌ను నిర్మాణం ప్రారంభంలోనే బుక్‌ చేయడమే కాదు.. ప్రాజెక్ట్‌ పూర్తయ్యే వరకు దశలవారీగా చెల్లింపులకు వెలుసుబాటు ఉంటుందనే కొనుగోలుదారుడి ఆలోచన. అయితే వేర్వేరు కారణాలతో బహుళ అంతస్తుల నివాస సముదాయాలు మధ్యలో ఆగిపోవడం, మరికొన్నింటిలో తీవ్ర జాప్యంతో కొనుగోలుదారులు కలవరపడుతున్నారు. ప్రాజెక్ట్‌ నిర్మాణ ఆలస్యంతో ఉన్న ఇంటికి అద్దె కడుతూ.. పూర్తికానీ ఇంటికి గృహరుణ ఈఎంఐ చెల్లించడం భారంగా భావిస్తున్నారు. ఇలాంటివారికి ఊరటనిచ్చే గృహరుణ పథకాన్ని ఒకటి ఎస్‌బీఐ ఇటీవల కొత్తగా ప్రకటించింది. ‘రెసిడెన్షియల్‌ బిల్డర్‌ ఫైనాన్స్‌ విత్‌ బయ్యర్‌ గ్యారంటీ(ఆర్‌బీబీజీ)’ పేరుతో తీసుకొచ్చింది. ఒకవేళ చెప్పిన సమయానికి ఇంటికి కొనుగోలుదారుకు నిర్మాణదారు అందజేయకపోతే వారు తీసుకున్న గృహరుణ మొత్తానికి తాము గ్యారంటీ అంటోంది బ్యాంకు. ప్రారంభంలో చెల్లించే మార్జిన్‌మనీతో సహా మొత్తం వెనక్కి ఇస్తామని హామీ ఇస్తోంది. పథకం బాగానే ఉన్నా చాలా షరతులు ఉండటంతో ఏమేరకు మనకు ఉపయోగకరం అనేది అమల్లోకి వచ్చాక తెలుస్తుందని నిర్మాణదారులు అంటున్నారు.

* వడ్డీరేటు ఇప్పుడు కొత్త గృహరుణాలకు వసూలు చేస్తున్న 7.90 శాతం ఉంటుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంటుంది. కొనుగోలుదారు సొమ్ముకు భరోసా ఇస్తోంది కాబట్టి వడ్డీ రేట్లు కొంచెం అధికంగా ఉండే అవకాశం లేకపోలేదని బ్యాంకింగ్‌ వర్గాలు అంటున్నాయి.
* ఎప్పటివరకు ప్రాజెక్ట్‌ను పూర్తిచేస్తాం అనే వివరాలను కొత్త నిబంధనల ప్రకారం రెరాకు నిర్మాణదారులు సమర్పిస్తున్నారు. వీరు సమర్పించే పత్రాల్లో ప్రాజెక్ట్‌ పూర్తిచేసే తేదీని తప్పనిసరిగా పేర్కొనాలి. బ్యాంకు దీన్నే పరిగణనలోకి తీసుకుంటుంది. అయితే 500 చ.మీ. విస్తీర్ణంలోపు, 8 యూనిట్లకంటే తక్కువ కట్టే ఇళ్లకు రెరాలో ప్రాజెక్ట్‌ నమోదు చేయాలనే నిబంధన సడలింపు ఉంది. అంటే చిన్న బిల్డర్లు కట్టే ప్రాజెక్ట్‌లకు కొత్త గృహరుణ పథకం వర్తించే అవకాశం లేదు.
* ముందుగా నిర్మాణ సంస్థలతో ఎస్‌బీఐ ఒప్పందం చేసుకున్న ప్రాజెక్ట్‌లకే ఇది వర్తిస్తుంది.
* గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లకే తప్ప వాణిజ్య నిర్మాణాలకు ఇది వర్తించదు.
* రెండున్నర కోట్ల రూపాయల గరిష్ఠ పరిమితి ఉంది.

కొత్త గృహరుణ పథకంతో..
కొత్త గృహరుణ పథకం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లకు ఊతంగా నిలవనుంది. జీఎస్టీ వచ్చాక ఆ భారం తగ్గించుకునేందుకు కొంతకాలం పూర్తైన ఇళ్లవైపు మొగ్గారు. ఇప్పుడు క్రమంగా నిర్మాణంలో ఉన్న ఇళ్లవైపు చూస్తున్నారు.
* కొనుగోలుదారు సొమ్ముకు హామీ ఇస్తున్న ఎస్‌బీఐతో ఒప్పందం చేసుకున్న ప్రాజెక్ట్‌ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని