విల్లాలు అదరహో!

ఆహ్లాదకర పరిసరాలు.. ప్రశాంత వాతావరణం.. చుట్టూ పచ్చదనం.. మెరిసిపోయే రహదారులు.. వ్

Published : 25 Jan 2020 02:31 IST

ఈనాడు, హైదరాబాద్‌

ఆహ్లాదకర పరిసరాలు.. ప్రశాంత వాతావరణం.. చుట్టూ పచ్చదనం.. మెరిసిపోయే రహదారులు.. వ్యాయామం చేసేందుకు జాకింగ్‌ ట్రాక్‌.. వేసవిలో సేదతీరేందుకు ఈతకొలను.. వారాంతాల్లో ఆడేందుకు ఆట స్థలాలు.. విందులు, వేడుకలకు వేదికలు.. అన్నింటికీ మించి పిల్లలు పెద్దలకు తోడు, మూడంచెల రక్షణ, అత్యవసర వైద్యసేవలు.. ఉంటే ఇలాంటి చోట నివాసం ఉండాలనిపిస్తోందా? ఇక్కడ ఇల్లు బాగా ఖరీదేమో అంటారా? నగరంలో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఫ్లాట్‌ ధరలకే శివార్లలో ఇలాంటి సకల సౌకర్యాలు, హంగులతో చేపట్టిన విల్లాలు అందుబాటులో ఉన్నాయి.

అపార్ట్‌మెంట్లలో ఉండేందుకు ఇష్టపడని వారు.. ప్రశాంత వాతావరణంలో నివసించాలనుకునేవారు విల్లాలవైపు మొగ్గు చూపుతున్నారు. కార్పొరేట్‌ సంస్థలు సైతం తమ సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ ఉద్యోగులకు ఇలాంటి విల్లా ప్రాజెక్ట్‌లలో బస ఏర్పాటు చేస్తున్నాయి. కొందరు ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటే.. మరికొంతమంది వారాంతాల్లో కుటుంబంతో గడిపేందుకు, అభిరుచులను కొనసాగించేందుకు కొనుగోలు చేస్తున్నారు. భవిష్యత్తు దృష్ట్యా పెట్టుబడిపరంగా కొనుగోలు చేసేవారు ఉన్నారు. తమకంటూ కొంత స్థలం ఉంటుంది అనేది వారి భావన.

భద్రతకు పెద్దపీట..

 

విల్లా ప్రాజెక్ట్‌లో నిర్మాణ సంస్థలు భద్రతకు అత్యంత పెద్దపీట వేస్తున్నాయి. అత్యాధునిక రక్షణ,  కమ్యూనికేషన్‌ వ్యవస్థలను సమాచారం కోసం ఉపయోగిస్తున్నాయి. చుట్టూ సౌర కంచె ఏర్పాటు చేస్తున్నారు. అపరిచిత వ్యక్తులు లోపలికి ప్రవేశించే అవకాశం ఉండదు. శివారు ప్రాంతాలే అయినా భద్రతా సిబ్బంది కాపలా కాస్తుంటారు కాబట్టి ఇక్కడ భరోసాతో ఉండొచ్చు అనే ధీమా ఉంటుంది.

ప్రత్యేక ఆకర్షణగా హంగులు..

 

విల్లాల్లో ఎప్పటికప్పుడు నిర్మాణ సంస్థలు కొత్త పోకడలను పరిచయం చేస్తున్నాయి.
* ఇంటికి ఇంటికి మధ్య గోడలు ఉండవు కాబట్టి ఆరుబయట ఖాళీ ప్రదేశం ఎక్కువ అందుబాటులో ఉంటుంది. రెండు మూడు వాహనాలు పార్క్‌ చేసుకోవచ్చు. అతిథుల కోసం ప్రత్యేక పార్కింగ్‌ సదుపాయం కల్పిస్తున్నారు.
* ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వారి కోసం ప్రత్యేకంగా సహాయకులు ఉంటున్నారు. వీరి కోసం విల్లాలోనే విడిగా గది కట్టిస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ పని చేసుకోవచ్చు. వీరు పిల్లలను, పెద్దలను  చూసుకోవచ్చు.
* విశాలమైన విల్లాల్లో విద్యుత్తు వినియోగం ఎక్కువే. సౌరపలకల ఏర్పాటుతో చాలావరకు విద్యుత్తు అవసరాలు తీరేలా ఏర్పాట్లు చేస్తున్నారు.పరిమితంగా సౌర విద్యుత్తు ఉత్పాదన చేస్తూ స్వీయ అవసరాలకు వినియోగిస్తున్నారు. గ్రిడ్‌కు అనుసంధానం చేయడం ద్వారా మిగిలిన విద్యుత్తును డిస్కంకు విక్రయించేలా చూస్తున్నారు.
* నివాస ప్రదేశాల్లో వైద్యమూ ముఖ్యమైందే. పెద్దలు, పిల్లలను దృష్టిలో పెట్టుకుని విల్లాల్లో ప్రత్యేకంగా అత్యవసర వైద్యసేవలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని వైద్యులు ఎక్కడున్నా.. ఇక్కడ సేవలందేలా టెలీవైద్యాన్ని అందిస్తున్నారు.
* సహజంగా విల్లాల్లో ప్రశాంతంగా ఉంటుందని ఇష్టపడుతుంటారు. శబ ్ధకాలుష్యం లేకుండా వాహనాల హరన్‌ను నిషేధించడంతో పాటూ కొన్నిచోట్ల బ్యాటరీ కార్లను ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
* ఆహారం కోసం బయటికి వెళ్లాల్సిన పనిలేదు. ఇక్కడ ఉండే ఫుడ్‌కోర్టుల్లో అందుబాటులో ఉంటాయి. అన్నిరకాల ఆటలతో సేదతీరేందుకు గోల్ఫ్‌తో సహా క్రికెట్‌ పిచ్‌లు, ఫుట్‌బాల్‌ మైదానాల వంటి అవుట్‌డోర్‌పాటూ ఇండోర్‌ సదుపాయాలు విల్లాల ప్రత్యేకం.

ఎక్కడెక్కడంటే..

 

శివార్లలో కొంపల్లి, పటాన్‌చెరు, శ్రీశైలం రహదారి, షాద్‌నగర్‌, ఘట్‌కేసర్‌ వైపు విల్లా ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. 25 నుంచి 50 ఎకరాల విశాలమైన స్థలాల్లో వీటిని నిర్మిస్తున్నారు. ఒక్కో విల్లా రెండు వందల గజాలు మొదలు వెయ్యి గజాల విస్తీర్ణంలో కడుతున్నారు. తక్కువ విస్తీర్ణమైతే జి+2 వరకు నిర్మిస్తున్నారు. నిర్మించే విస్తీర్ణం, ప్రాంతం, కల్పించే సదుపాయాలను బట్టి ధరలు ఉన్నాయి. రూ.యాభై లక్షల నుంచి రూ.2.5 కోట్ల వరకు విల్లాలు అదరహో అనిపిస్తున్నాయి.


కుటుంబంతో ఎంచక్కా..

అపార్ట్‌మెంట్లలో భార్యాపిల్లల వరకు ఫర్వాలేదు. తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నప్పుడు ఇల్లు చాలడం లేదని.. ఇరుకుగా మారిందనే భావన ఎక్కువ మందిది. పైగా అపార్ట్‌మెంట్లలో నాలుగు గోడల మధ్య తల్లిదండ్రులు ఒంటరితనంతో ఇబ్బంది పడడం చూసినవారు.. శివార్లలో విల్లాల్లో ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇరుగుపొరుగు విల్లాల్లోనూ పెద్దలు ఉండడంతో కాలక్షేపానికి ఢోకా ఉండదని భావిస్తున్నారు. గ్రంథాలయం ఉండడంతో పెద్దవాళ్లకు చక్కని కాలక్షేపం కూడా. అత్యవసరాల్లో అక్కడే వైద్య సదుపాయాలు లభిస్తుండడంతో విల్లాల వైపు మొగ్గు చూపుతున్నారు. పిల్లలు సైతం స్వేచ్ఛగా సైకిల్‌ తొక్కవచ్చు. తోటి పిల్లలతో కలిసి ఆడుకోవచ్చు.


మెరుగైన రవాణా..

విల్లా ప్రాజెక్ట్‌లంటే రవాణా సదుపాయాలు సక్రమంగా ఉండవనే భయాలు ఉండేవి. అవుటర్‌ రింగ్‌రోడ్డు అందుబాటులోకి రావడంతో నగరానికి అనుసంధానం మెరుగైంది. గతంలో కంటే రహదారుల పరిస్థితి మెరుగుపడింది.. కొన్ని రహదారులను విస్తరించారు. మరికొన్ని ప్రణాళికలో ఉన్నాయి. ఏ మూలన కొనుగోలు చేసినా మరోమూలకు వేగంగా చేరుకునే సౌలభ్యం ఉండడంతో విల్లాల్లో నివసించేవారు దూరమైనా లెక్కచేయడం లేదు. ఎక్కడ ఉంటున్నా తమ సొంత వాహనాల్లో ఐటీ కారిడార్‌కు అరగంటలో చేరుకుంటున్నారు.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని