అయిననూ కొనగలరు..!

నగరంలో ఇళ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వృద్ధి స్థిరంగా ఉంటే.. మరికొన్నిచోట్ల అనూహ్యంగా

Published : 25 Jan 2020 02:31 IST

కొనుగోలుదారుల ఆదాయం, ఇంటి ధర నిష్పత్తి అంతరం తగ్గుదల
దశాబ్దకాలంలో పెరిగిన స్థోమత
ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో ఇళ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వృద్ధి స్థిరంగా ఉంటే.. మరికొన్నిచోట్ల అనూహ్యంగా పెరుగుదల ఉంది. ఐదేళ్లుగా పెరగడమే తప్ప తగ్గింది ఎక్కడా లేదు. ఇదివరకే ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేసిన వారు ధరల్లో వృద్ధితో స్థిరాస్తి విలువ పెరిగిందని సంతోషంగా ఉండగా.. సొంతిల్లు లేనివారు మాత్రం ధరలు ఎప్పుడు దిగి వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశమే ఉందని స్థిరాస్తి వర్గాలు అంటున్నాయి. ఇళ్ల ధరలు పెరిగాయని ఆందోళన అక్కర్లేదు.. ఎప్పటికైనా సొంతిల్లు కొనగలమా లేదా అని నిరాశ చెందాల్సిన పనిలేదు. ఒకవైపు ఇళ్ల ధరలు పెరుగుతున్నా.. ఆదాయాలు పెరుగుతుండడంతో కొనుగోలు సామర్థ్యం పెరిగిందంటున్నాయి స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థలు. దశాబ్దకాలంలో ఇళ్లను కొనగలిగే స్థోమత పెరిగిందని చెబుతున్నాయి.
కొనే ఇంటి ధరకు, సంపాదనకు లంకె కుదిరితేనే ఇల్లు సొంతం చేసుకోగలం. హైదరాబాద్‌ లాంటి నగరాల్లో వ్యక్తిగత ఆదాయం, కొనుగోలు చేసే ఇంటివిలువ నిష్పత్తి ప్రామాణికం 4.5 శాతంగా ఉంది. అంటే ఒక వ్యక్తి తన సంపాదనకు నాలుగున్నరరెట్ల స్థాయిలో ఇంటి విలువ ఉంటే ధరలు అందుబాటులో ఉన్నట్లు లెక్క. అంతకంటే ఎక్కువ ఉండేకొద్దీ కొనలేని పరిస్థితులు ఉంటాయి. తక్కువకే దొరికితే ఇంకా ఎక్కువమంది సొంతింటి వారవుతారు. నైట్‌ఫ్రాంక్‌ సంస్థ ఇండెక్స్‌ ప్రకారం ఆదాయం, ఇంటి ధర నిష్పత్తి 2010లో 5.7 శాతంగా ఉండేది. 2017 నాటికి ఇది 5 శాతానికి తగ్గింది. 2018 నాటికి 4.5 శాతం తగ్గింది. 2019 ఆఖరి నాటికి దాదాపు ఇదే స్థాయిలో ఉంది.

ఇవీ చూడాలి..
* ఇంటి కొనుగోలులో రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీ, జీఎస్‌టీ సామాన్య, మధ్యతరగతి వాసులకు భారంగా ఉన్నాయి. రూ.21 లక్షల విక్రయ విలువకు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నా ఇతరత్రా అన్ని వ్యయాలు కలుపుకొని రూ.1.40 లక్షలు వ్యయం అవుతోంది. కొంతమంది ఇల్లు కొన్నా.. సొమ్ములు లేక ఒకటి రెండేళ్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకోకుండా వాయిదా వేసుకునే వారు ఉన్నారని బిల్డర్లు అంటున్నారు.
* మారిన పోకడలతో ఇప్పుడు అపార్ట్‌మెంట్లలో ఇంటీరియర్‌ చేయించుకోవడం తప్పనిసరి అయింది. సాదాసీదా అయినా రూ.రెండు మూడు లక్షల వ్యయం చేయాల్సి వస్తోందని సామాన్యులు వాపోతున్నారు. ఇక కోరుకున్నట్లుగా ఇంటీరియర్‌ ఉండాలంటే రూ.5 లక్షల నుంచి రూ.పది లక్షల వరకు వ్యయం చేయక తప్పడం లేదు.

ఇలా చేస్తే సరి..
* కోరుకున్న చోట మన బడ్జెట్‌లో ఇల్లు రాకపోతే అక్కడి నుంచి కొంచెం దూరం వెళితే మన బడ్జెట్‌లో దొరికే అవకాశం ఉంది.
* ఇప్పటికే మౌలిక వసతులు మెరుగ్గా ఉన్న చోట భూముల ధరలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంటి ధర ఎక్కువే ఉంటుంది. వచ్చే మూడు నాలుగేళ్లలో అభివృద్ధి అయ్యే అవకాశం ఉన్న ప్రాంతంలో అయితే మన బడ్జెట్‌లో దొరుకుతుంది.
* నిర్మాణం పూర్తయిన ఇళ్లలో ఇంటి ధర ఎక్కువే ఉంటుంది. ప్రారంభ దశలో ఉన్న ఇంటిని కొనడం ఆర్థికంగా కలిసి వస్తుంది. చెల్లింపులకు కొంత సమయం లభిస్తుంది. 


పదేళ్లలో..

గత పదేళ్లలో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి.. స్థలాలు, వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు.. ఇలా అన్నింటిలోనూ ధరల్లో వృద్ధి కనబడింది. అదే స్థాయిలో ఆదాయాలు పెరగడంతో సొంతింటి కలను నెరవేర్చుకోగలుగుతున్నారు. ఉదాహరణకు రూ.ఏడు లక్షల వార్షిక ఆదాయం కలిగిన కుటుంబం రూ.35 లక్షల ఖరీదైన ఇంటిని కొనుగోలు చేయడం ఆర్థికంగా పెద్దగా భారం అనిపించదు. కొంత సొమ్ము డౌన్‌పేమెంట్‌ చెల్లించి మిగతా మొత్తానికి గృహరుణం తీసుకోవచ్చు. ఇతరత్రా పొదుపు చేసిన రాబడితో కలిపి ఇంటి ధర కాస్త ఎక్కువైనా సరే కొత్త ఇంటిని సొంతం చేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో నచ్చిన ఇళ్లు దొరకాలంటే రూ.45 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఈ ధరకు ఇంటిని కొనుగోలు చేసినా ఈఎంఐ భారం కాకుండా ప్రధానమంత్రి అవాస్‌ యోజన కింద రూ.2.67 లక్షల వరకు వడ్డీపై సబ్సిడీ కేంద్రం ఇస్తుండటంతో కొనుగోలుదారులకు ఆర్థికంగా కొంత ఊరట ఉంటోంది. పీఎంఏవై గృహరుణ వడ్డీరేట్లు తగ్గడం కూడా సొంతింటివైపు అడుగులు వేసేలా చేస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని