కొంపల్లి వైపు చూద్దాం..!

క్యాలండర్‌ మారగానే ఎక్కువ మంది ఆలోచనలు కలల గృహం చుట్టూ తిరుగుతుంటాయి. స్థలాల ధరలు ఎప్పటికప్పుడు అధికంగా పెరుగుతుంటే ఈ ఏడాదైనా ఇల్లు కొనగలమా లేదా అని ఎక్కువమంది నిరాశ చెందుతుంటారు. ప్రస్తుతం మార్కెట్లో స్థలాల ధరలు నిలకడగా ఉన్నాయి. చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో తగ్గాయి. కొనేందుకు ఇదే సరైన సమయం అంటున్నారు ఈ

Published : 08 Feb 2020 01:13 IST

ఈనాడు, హైదరాబాద్‌

క్యాలండర్‌ మారగానే ఎక్కువ మంది ఆలోచనలు కలల గృహం చుట్టూ తిరుగుతుంటాయి. స్థలాల ధరలు ఎప్పటికప్పుడు అధికంగా పెరుగుతుంటే ఈ ఏడాదైనా ఇల్లు కొనగలమా లేదా అని ఎక్కువమంది నిరాశ చెందుతుంటారు. ప్రస్తుతం మార్కెట్లో స్థలాల ధరలు నిలకడగా ఉన్నాయి. చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో తగ్గాయి. కొనేందుకు ఇదే సరైన సమయం అంటున్నారు ఈ రంగంలోని నిపుణులు. ప్రస్తుతం నగరంలోని రియాల్టీని చాలావరకు ఐటీ రంగమే నడిపిస్తోంది. ప్రభుత్వం ఇటీవల ఐటీ సంస్థలను నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ నెలకొల్పుతున్నట్లు ప్రకటించింది. పేట్‌బషీరాబాద్‌, కొంపల్లిలో ఐటీ సంస్థలను నెలకొల్పబోతున్నట్లు చెప్పింది. పచ్చదనంతో నిండిన పరిసరాలు.. మెరుగైన రవాణా సదుపాయాలు.. స్థిరమైన అభివృద్ధితో దూసుకెళుతున్న ఈ ప్రాంతానికి ఐటీ సంస్థలు వస్తే మార్కెట్‌ ఇక్కడ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ ఇక్కడ సామాన్య, మధ్యతరగతి వాసులకు ఇళ్లు అందుబాటు ధరల్లో ఉన్నాయి.

హైదరాబాద్‌ ఉత్తరంగా చెప్పుకొనే కొంపల్లి మార్గంలో పేరున్న సంస్థలు ఇక్కడ ప్రాజెక్ట్‌లు చేపట్టడానికి ముందుకు వస్తున్నాయి. గేటెడ్‌ కమ్యూనిటీల నుంచి రిసార్ట్‌ల వరకు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సరికొత్త నిర్మాణాలు.. ఆధునిక వెంచర్లు అయినా అందుబాటులో ధరల్లో ఆవాసాలు ఉండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు.

* రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉంటే సహజంగానే ఆ ప్రాంతం స్థిరంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ ప్రాంతానికి ఆరు లేన్ల జాతీయ రహదారి ఉంది. దీనికి అటుఇటుగా ఈ ప్రాంతం క్రమంగా విస్తరించుకుంటూ వెళుతోంది.
* ఒక ప్రాంతంలో నివాసం ఉండాలంటే రవాణా సదుపాయాలతో పాటూ విద్యా, వినోద కేంద్రాలు కూడా ముఖ్యమే. ఈ రెండు కూడా ఈ ప్రాంతంలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయ స్కూళ్లు, జాతీయ స్థాయి కళాశాలలు, ఇంజినీరింగ్‌, వైద్య కళాశాలలు ఉన్నాయి. వారాంతాల్లో వినోదాలు, విందుల కోసం రిసార్ట్‌లు, దాబాలు, స్టార్‌ హోటళ్లు, మల్టీఫ్లెక్స్‌లు అందుబాటులో ఉన్నాయి.
* కొంపల్లి తర్వాత జాతీయ రహదారిపై గుండ్లపోచంపల్లి నుంచి మేడ్చల్‌ వరకు అభివృద్ధి విస్తరించింది. ఇక్కడ అవుటర్‌ రింగ్‌రోడ్డు కూడలి, ఐటీ సెజ్‌తో భవిష్యత్తులో ఈ ప్రాంతం రూపురేఖలు మారడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని డెవలపర్స్‌ అంటున్నారు.
* నివాసాలకు డిమాండ్‌ ఏర్పడాలంటే ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండాలి. ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో శామీర్‌పేటవైపు ఫార్మా కంపెనీలు, పరిశోధన సంస్థలు అంతర్జాతీయంగా పేరుగాంచిన జీనోమ్‌వ్యాలీ, మేడ్చల్‌ ప్రాంతంలో నాలుగైదు వందల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉపాధిని అందిస్తున్నాయి. భవిష్యత్తులో ఇవి మరింత విస్తరించనున్నాయి. మరింత ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలను కల్పించనున్నాయి. ఇవన్నీ కూడా స్థిరాస్తికి డిమాండ్‌ పెంచేవే.
* ఈ ప్రాంతాల నుంచి అవుటర్‌ మీదుగా గచ్చిబౌలిని నిమిషాల్లోనే చేరుకునే సౌలభ్యం ఉండడం వల్ల కూడా ఎక్కువమందిని ఈ ప్రాంతం ఆకర్షిస్తోంది. ముఖ్యంగా గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఉండాలనుకునేవారు ఇటువైపు చూస్తున్నారు.
* జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మెట్రో ప్రారంభం కావడం వల్ల కూడా ఈ ప్రాంతంలో ఉండేవారికి రవాణా పరంగా సౌకర్యాలు మెరుగయ్యాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని