ఇల్లు చూడు.. ఇంటి అందం చూడు

కొత్త ఇల్లు కొనగానే తమ అభిరుచికి తగ్గట్టుగా గృహాలంకరణ చేయించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న పోకడలకు తగ్గట్టుగా కలల గృహాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. ఇంటి వ్యయానికి సమంగా ఇంటీరియర్స్‌కు ఖర్చు అవుతోంది. హైదరాబాద్‌లో సగటున రూ.6.24 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు వెచ్చిస్తున్నారు.

Published : 29 Feb 2020 01:20 IST

ఈనాడు, హైదరాబాద్‌

కొత్త ఇల్లు కొనగానే తమ అభిరుచికి తగ్గట్టుగా గృహాలంకరణ చేయించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న పోకడలకు తగ్గట్టుగా కలల గృహాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. ఇంటి వ్యయానికి సమంగా ఇంటీరియర్స్‌కు ఖర్చు అవుతోంది. హైదరాబాద్‌లో సగటున రూ.6.24 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు వెచ్చిస్తున్నారు.

ఇంటి నిర్మాణంలో వచ్చిన మార్పులతో కొనుగోలుదారుడికి అదనపు భారమైంది. నిర్మాణదారులు ఖాళీ గోడలతో ఫ్లాట్స్‌ను అప్పగిస్తున్నారు. బిల్డర్‌తోనే ఒప్పందం చేసుకుంటే ఇంటీరియర్స్‌ సైతం చేయించి ఇస్తున్నారు. దీనికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. చాలామంది వారే సొంతంగా తమకు నచ్చినట్లుగా రూపుదిద్దుకునేందుకు డిజైనర్లను ఆశ్రయిస్తున్నారు. మొదట్లో కార్పెంటర్‌తో ఇంట్లో స్థిరంగా ఉండేలా కదపడానికి వీల్లేకుండా ఫర్నిచర్‌ చేయించేవాళ్లు. ఇప్పటికీ ఇది కొనసాగుతున్నా.. ఇల్లు మరింత అందంగా కనిపించేందుకు వార్డ్‌రోబ్స్‌ మొదలు మంచాలు, టీవీ స్టాండ్ల వరకు ఫ్యాక్టరీలో తయారైన వాటివైపు క్రమంగా మొగ్గు చూపుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు నగరంలోకి అడుగు పెట్టడంతో ఇంటి అవసరాలకు తగ్గ ఇంటీరియర్స్‌ ఎంపిక మరింత సులభతరం కావడంతో.. రోజుల వ్యవధిలోనే వీటితో ఇంటిని అలంకరించుకుంటున్నారు. హైదరాబాద్‌తో సహా దేశంలోని అన్నినగరాల్లోనూ ఇప్పుడు ఇదే పోకడ. ఆయా నగరాల్లో ఇందుకోసం ఎంత వ్యయం చేస్తున్నారనే దానిపై సులేఖ సంస్థ నివేదికలో వెల్లడించింది.

హైదరాబాద్‌ మూడో స్థానంలో..
ఇంటి ఇంటీరియర్స్‌ కోసం ఎక్కువ వ్యయం చేస్తున్న నగరాల్లో బెంగళూరు, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌ ముందువరసలో ఉన్నాయి. బెంగళూరులో అత్యధికంగా రూ.10 లక్షల వరకు ఇంటి హంగులకు ఖర్చు చేస్తున్నారు. అహ్మదాబాద్‌లో సగటు రూ.6.71 లక్షలుగా ఉంటే హైదరాబాద్‌ రూ.6.24 లక్షలతో మూడో స్థానంలో నిల్చింది. గరిష్ఠంగా రూ.60 లక్షల వరకు  వెచ్చిస్తున్న వారూ ఉన్నారు. నోయిడా(రూ.6.03 లక్షలు), కోల్‌కతా(రూ.5.68 లక్షలు), ముంబయి (రూ.5.40 లక్షలు), పుణె(రూ.4.60 లక్షలు), చెన్నై(రూ.3.67లక్షలు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

రంగుల హంగులు..
ఎంతో ఖర్చు చేసి అలంకరణ చేయించినా.. సరైన రంగులు లేకపోతే ఇల్లు అంతగా ఆకట్టుకోలేదు. బయట వేసే రంగులే కాదు గదికో రంగులతో ఇప్పుడు ఇంటిని హరివిల్లుగా మార్చుకుంటున్నారు. ఈ విషయంలో ముంబయి అత్యధికంగా ఖర్చుచేస్తుండగా హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది.
* ముంబయిలో ఇంటి రంగుల కోసం సగటున రూ.13.89 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.1.50కోట్ల వరకు వ్యయం చేస్తున్నారు.
* హైదరాబాద్‌ వాసులు సగటున రూ.1.35 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వ్యయం చేసేందుకు సిద్ధమంటున్నారు. బెంగళూరువాసులు రూ.46వేల నుంచి రూ.1.5 లక్షల వరకు రంగులకు వెచ్చిస్తామంటున్నారు.

మన సంస్కృతిలో ఇంటి అలంకరణ ఓ భాగం..
‘ఇంటి అలంకరణ ఎప్పటి నుంచో భారతీయ సంస్కృతిలో ఒక భాగం. దేశంలోని వేర్వేరు నగరాలను గమనించినప్పుడు విభిన్న వ్యయ పోకడలు చాలా ఆసక్తికరంగా అనిపించాయి. ముంబయిలో ఇంటి అలంకరణకు తక్కువ ఖర్చుచేస్తుండగా కార్యాలయాలు, వాణిజ్య ఇంటీరియర్స్‌ కోసం భారీగా వ్యయం చేస్తున్నారు. ఈ ఖర్చు రియల్‌ఎస్టేట్‌ వ్యయంతో సమానంగా ఉంటుంది. మెట్రోనగరాల్లో ఇప్పటికీ వీటికి అధిక ప్రాధాన్యం ఇస్తుండగా.. ద్వితీయ శ్రేణి నగరాలు ఈ ధోరణని వేగంగా ఆకర్షిస్తున్నాయి’ అని సులేఖ సీఈవో సత్యప్రభాకర్‌ అన్నారు.


కార్యాలయాల్లోనూ..

* ఇంటీరియర్స్‌లో ఆఫీసు, కమర్షియల్‌కు మొదటి నుంచి డిమాండ్‌ ఎక్కువ. ఇటీవల ఇది మరింత విస్తరించింది. ముంబయి, హైదరాబాద్‌, గుర్గావ్‌లో కార్యాలయ అలంకరణకు ఎక్కువ వెచ్చిస్తున్నారు.
* ముంబయిలో అత్యధికంగా సగటున రూ.5.75 కోట్ల వరకు ఇందుకు సంస్థలు ఖర్చు చేస్తున్నాయి ఆర్థిక రాజధాని కావడంతో ఇక్కడ గరిష్ఠంగా రూ.40కోట్ల వరకు వెనకాడటం లేదు.
* హైదరాబాద్‌లో కార్యాలయాల ఏర్పాటులో ఇటీవల కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. ఇందులో ఇంటీరియర్స్‌ కీలకం. సగటున ఇక్కడ రూ.63 లక్షల నుంచి రూ.10కోట్ల వరకు సంస్థలు వెచ్చిస్తున్నాయి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని