నలు దిక్కుల నిర్మాణాలు..పెరిగిన కొనుగోళ్లు

సరూర్‌నగర్‌లో ఉండే రాధమ్మ తనయుడు యూకేలో స్థిరపడ్డాడు. హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఉండేందుకు, అంతకుమించి అమ్మ కోసం రూ.60 లక్షల...

Published : 10 Oct 2020 07:03 IST

ఈనాడు, హైదరాబాద్‌

* సరూర్‌నగర్‌లో ఉండే రాధమ్మ తనయుడు యూకేలో స్థిరపడ్డాడు. హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఉండేందుకు, అంతకుమించి అమ్మ కోసం రూ.60 లక్షల బడ్జెట్‌లో ఇల్లు కొనేందుకు చూస్తున్నారు.
* యూఎస్‌లో ఉండే సందీప్‌ హైదరాబాద్‌లోని వాణిజ్య నిర్మాణాల్లో రూ.కోటి వరకు పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారు. చాలామంది ఎన్‌ఆర్‌ఐల చూపు ఇటే ఉంది.
* పాలమూరు జిల్లాకు చెందిన ఒక కుటుంబం నగరంలో స్థిరపడాలనే యోచనలో ఉంది. రూ.40 లక్షల లోపు దొరికే ఇంటికి అన్వేషిస్తున్నారు.
నగరవాసులే కాదు ఇతర జిల్లాల వాసులు, ఇతర రాష్ట్రాల వాళ్లు, ప్రవాస భారతీయులు సైతం హైదరాబాద్‌లో స్థిరాస్తులపై పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. కొవిడ్‌ భయాలతో ఇన్నాళ్లు నిర్ణయాలను వాయిదా వేసుకున్నా.. తమ బడ్జెట్‌లో ఇల్లు, ఫ్లాట్‌, విల్లా, స్థలాల కోసం ఇటీవల అన్వేషణ ప్రారంభించారని స్థిరాస్తి సంఘాల ప్రతినిధులు అంటున్నారు. అన్‌లాక్‌ తర్వాత జులై, ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో కొనుగోళ్లు పెరిగాయని అధ్యయనాలూ చెబుతున్నాయి.

ఎన్నికల తర్వాత..

ప్రస్తుతం నిలకడగా ఉన్న మార్కెట్‌ కొత్త సంవత్సరంలో దూకుడు ప్రదర్శించే అవకాశాలున్నాయి. అప్పటికి కొవిడ్‌ వ్యాప్తి తగ్గుతుందనే ఆశాభావం, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సైతం పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో త్రైమాసికంలో లావాదేవీలు పెరిగాయి. 40 శాతానికి చేరుకున్నాయి. 2019 త్రైమాసికం సగటు ఇళ్ల విక్రయాలు హైదరాబాద్‌లో 4067 ఉండగా... ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 3808 ఇళ్లు విక్రయించారు. ఏప్రిల్‌, మే నెలలో పూర్తిగా లాక్‌డౌన్‌ కావడం, జూన్‌లో అన్‌లాక్‌తో కేవలం 974 ఇళ్లు మాత్రమే విక్రయించారు. క్రితం త్రైమాసికంలో ఈ సంఖ్య 1609కి పెరిగింది. రాబోయేది పండగ కాలం కావడంతో ఈ మూడు నెలల్లో రెట్టింపు విక్రయాలు ఉంటాయనే అంచనాల్లో సంబంధిత వర్గాలు ఉన్నాయి.


ఎటు చూసినా..

* శ్రీశైలం రహదారి ప్రతిపాదిత ఔషధ నగరితో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో జోష్‌ నెలకొంది. తుక్కుగూడ, కందుకూరు, కడ్తాల్‌, ఆమన్‌గల్‌, కల్వకుర్తి వరకు స్థిరాస్తి మార్కెట్‌ విస్తరించింది.
* బెంగళూరు జాతీయరహదారిలో శంషాబాద్‌ విమానాశ్రయం విస్తరణ, మెట్రో, ప్రైవేటు టౌన్‌షిప్పుల ప్రతిపాదనల వంటి అంశాలు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కొత్తూరు, షాద్‌నగర్‌ దాటి బాలానగర్‌, జడ్చర్ల వరకు విస్తరించింది.
* నాగార్జునసాగర్‌ హైవే మార్గంలో ఏరో సెజ్‌లు ఉండటం.. అక్కడ కొత్త కంపెనీలు విస్తరణ, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌తో పాటూ చేరువలో ఔషధనగరి వస్తుండటం వంటి అంశాలు ఈ ప్రాంతం వృద్ధికి అవకాశం ఉంటుందని కొనుగోలుదారులు ఇటువైపు చూస్తున్నారు..
* వరంగల్‌ హైవే మార్గంలో ప్రభుత్వం యాదాద్రి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టడం.. ఐటీ కంపెనీలు విస్తరణ చేపడుతుండటంతో ప్రస్తుతం ఎక్కువమందిని ఈ మార్గం ఆకర్షిస్తోంది. ఘట్‌కేసర్‌, భువనగిరి, యాదాద్రి కేంద్రంగా విస్తరించింది.  
* వికారాబాద్‌, పరిగి మార్గంలో మెయినాబాద్‌ నుంచి అంతర్జాతీయ పాఠశాలలు, వైద్యకళాశాలుల, రిసార్ట్స్‌లు, వినోద కేంద్రాలతో వారాంతపు నివాస కేంద్రాలకు అనువుగా ఈ ప్రాంతంవైపు కొనుగోలుదారులు చూస్తున్నారు.  
* పటాన్‌చెరు దాటి సంగారెడ్డి వరకు మార్కెట్‌ విస్తరించింది. ఐటీకి చేరువగా ఉండటం కలిసొచ్చే అంశం. ఒకవైపు కొల్లూరు, శంకర్‌పల్లి వైపు, మరోవైపు కంది వరకు స్థలాలపై పెట్టుబడులు పెడుతున్నారు.  
* విజయవాడ జాతీయ రహదారి రెండు తెలుగు రాష్ట్రాల అనుసంధానం చేసే రహదారి కావడం, ఇండస్ట్రియల్‌ పార్క్‌ల ఏర్పాటుతో ఇటువైపు దృష్టిపడింది. పెద్ద అంబర్‌పేట్‌ తర్వాత నుంచి స్థలాలు కొనుగోలు చేస్తున్నారు.
* మేడ్చల్‌ మార్గంలోనూ ఫార్మా కంపెనీలు, పరిశోధన సంస్థలతో ఉపాధి అవకాశాలు ఉండటంతో వృద్ధికి అవకాశం ఉంటుందని పెట్టుబడిదారులు ఇటువైపు చూస్తున్నారు. ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన వారు ఇటువైపు స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు. వీరే కాదు ఆయా జిల్లాలకు అనుసంధానంగా ఉన్న జాతీయ రహదారుల వెంట హైదరాబాద్‌కు చేరువలో పెట్టుబడులకు మొగ్గుచూపిస్తున్నారు.

అద్దెల్లో పెరుగుదల

 

హైదరాబాద్‌లో స్థిరాస్తుల్లో పెట్టుబడులకు పలు సానుకూల అంశాలున్నాయి. కొవిడ్‌ సమయంలో కార్యాలయాల అద్దెల్లో వృద్ధి నమోదవడం విశేషం. దిల్లీ, ముంబయి, కోల్‌కతా వంటి మహానగరాల్లో 2020 మూడో త్రైమాసికంలో అద్దెల వృద్ధి ప్రతికూలంగా ఉండగా బెంగళూరు, హైదరాబాద్‌ మాత్రమే పాజిటివ్‌ వృద్ధిని నమోదు చేశాయి. బెంగళూరులో 4 శాతం అద్దెలు పెరగ్గా.. హైదరాబాద్‌లో రెండు శాతం పెరిగాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నివేదిక వెల్లడించింది.


వృద్ధికి అవకాశాలు ఎక్కువ..

దేశంలో మిగతా నగరాలతో పోలిస్తే చాలా ఆలస్యంగా హైదరాబాద్‌ స్థిరాస్తి రంగంలో కార్యకలాపాలు మొదలయ్యాయి. ఆయా నగరాలతో పోలిస్తే మన మార్కెట్‌ చిన్నది. వ్యవస్థీకృత రంగంలో దిల్లీలో ఏటా సగటున 42 వేల ఇళ్ల నిర్మాణాలు చేపడితే ముంబయిలో 60 వేలు, బెంగళూరులో 48 వేలు, పుణెలో 32 వేలు చేపడితే హైదరాబాద్‌లో 16 వేలపైన ఉన్నాయి. ఇక్కడ మరింత వృద్ధికి అవకాశం ఉందని నిర్మాణదారులు అంటున్నారు. మహానగరాలను మున్ముందు హైదరాబాద్‌ వెనక్కినెట్టే అవకాశం ఉంది. అనుకూల వాతావరణం, ఓఆర్‌ఆర్‌ వంటి మౌలిక వసతులు, ఐటీ, ఫార్మా కేంద్రాలుగా ఉండటంతో అభివృద్ధికి మరింత అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఓఆర్‌ఆర్‌ వరకు విస్తరించిన నగరంలో భవిష్యత్తు దృష్ట్యా నలువైపుల 60-80 కి.మీ. వరకు ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. జాతీయ రహదారులు, ఆ ప్రాంతాల్లో వస్తున్న పరిశ్రమలు, ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లతో మరిన్ని ఆశలు రేకిత్తిస్తున్నాయి. స్థలాలు, విల్లాలు, వ్యవసాయ క్షేత్రాలపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇల్లులేనివారు ప్రధాన నగరంలో వారికి అనువైన ప్రాంతంలో అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు కొంటున్నారు. వ్యక్తిగత ఇళ్ల కోసం శివారు ప్రాంతాలవైపు చూస్తున్నారు. అవుటర్‌ లోపల నివాసాలకు, అవుటర్‌ బయట భవిష్యత్తు దృష్ట్యా స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని