వీధి పోటు అటుఇటు!

ఇంటికి వీధి పోటు ఎంత చేటు? కొన్ని దిక్కులలో ఉంటే మేలు జరుగుతుందా? మంచైనా, చెడైనా ఆ ప్రభావం ఏ మేరకు ఉంటుంది?

Updated : 28 Mar 2021 19:48 IST

ఈనాడు, హైదరాబాద్‌

ఇంటికి వీధి పోటు ఎంత చేటు? కొన్ని దిక్కులలో ఉంటే మేలు జరుగుతుందా? మంచైనా, చెడైనా ఆ ప్రభావం ఏ మేరకు ఉంటుంది? వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది?  వివరిస్తున్నారు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు పెంటపాటి.
కొన్ని దిక్కులలో వీధి పోటున్న ఇళ్లలో ఉంటున్నవారికి అపరిమితంగా మేలు జరుగుతుందని.. అందులో ఉత్తర ఈశాన్యంగానీ, తూర్పు ఈశాన్యంలో వీధి పోటున్న ఇళ్లు.. పడమర వాయువ్యం, దక్షిణ ఆగ్నేయం దిశలలో వీధి పోటున్న ఇళ్లవారికి అపరిమిత సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయనే విశ్వాసాలు సమాజంలో ఉన్నాయి. పడమర నైరుతి, దక్షిణ నైరుతి మూలల్లో వీధి పోటున్న ఇళ్లలో ఉంటున్నవారికి అనేక ఇబ్బందులు, అకాల మరణాలు సంభవిస్తాయనే అపోహలు, నమ్మకాలు ఉన్నాయి. వీధి పోటున్న ఇళ్ల ముందు ప్రహరికి బయటివైపు చిన్నగుడి, దేవుని బొమ్మలు పెట్టడంతో దోషం పోతుందని,  ఇదొక నివారణ మార్గమని విశ్వసిస్తుంటారు. వీధి పోటున్న ఇంటికి మంచి, చెడు ఎలా ఉన్నా.. పరుల దృష్టితో కొంత కీడు కలిగే ప్రమాదం ఉంటుందని మరికొందరి బలమైన నమ్మకం.

ప్రభావం ఎలా ఉంటుంది?
మన ఇంటి ముందున్న వీది కంటే ఎదురుగా ఉన్న వీధి వెడల్పు ఎక్కువగా ఉన్నా.. దూరం పోతున్నా వీధి పోటు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆయా వీధుల నుంచి ప్రయాణించే వాహనాలు, తిరిగే జనాలు ఎక్కువగా ఉంటారు. ఎదురు వీధి చిన్నగా ఉన్నా.. దూరం తక్కువగా ఉన్నా ప్రభావం వేరుగా ఉంటుంది. వీధి పోటుతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఇతరత్రా కష్టనష్టాలు కచ్చితంగా ఇంత జరుగుతుందని చెప్పలేం. జనం రాకపోకలు, వాహనాల రద్దీ, ప్రయాణించే వేగం నియంత్రణలపై ఆధారపడి ఉంటుంది.

వాటితో ప్రయోజనం ఉందా?
వీధి పోటున్న ఇంటి ముందు విగ్రహం, దేవుళ్ల బొమ్మల ఏర్పాటు కచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ముఖ్యంగా వాహనదారులు ప్రయాణించేటప్పుడు అక్కడున్న పరిస్థితులు, రద్దీకి అనుగుణంగా మలుపు తిప్పే తొందరలో వేగం పెంచడం, తగ్గించడం చేస్తుంటారు. నియంత్రణ లోపిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎదురుగా ఇంటి ముందున్న విగ్రహంపై దృష్టి పడినప్పుడు జాగ్రత్తతోపాటూ తనను తాను తెలియకుండానే నియంత్రించుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో తొందరలో ఎదురింటిలోకి చొచ్చుకుపోయే ప్రమాదం ఉంది. కొందరి దృష్టి హానికరంగా ఉంటుంది. వారి చూపు, మాట నష్టపరిచేదిగా ఉంటుంది. వారు ఆ ఇంటి గురించి, ఇంట్లోవారి గురించి చెడుగా ఆలోచన చేసే ప్రమాదం ఉంది. ఇంటి ముందు గోడకు విగ్రహం పెడితే దృష్టి మరల్చడంతో అలాంటి వారి నుంచి ఎలాంటి హాని కలుగకుండా బయటపడవచ్చు. 

ఒకే దిశలో ఉండవు..
వీధిపోటు ఉన్న ఇంటిలో నివసిస్తున్న వారందరికి వీధి పోటు ఫలితాలు ఒకేలా ఉంటాయని చెప్పలేం. దీనికి కారణం అన్ని దిక్కుల ఇళ్లకు ఒకే దిశలో వీధి పోట్లు ఉండవు. ఒకేలానూ ఉండవు. ఎదురుగా వచ్చే వీధి పోటు ఆయా ఇళ్లకు ఏ మూలో, మధ్యలో ఉండొచ్చు.. ఇల్లుకు పూర్తిగా, సగం ఇల్లు వీధి పోటుకు గురికావొచ్చు. తదనుగుణంగానే ఇంట్లో ఉండేవారిపై ప్రభావం మారుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు