రేపటి సిరులు

భూముల విలువ పెరగడమే కానీ తగ్గడం ఉండదు. జనాభా పెరిగేకొద్దీ భూ లభ్యత తగ్గనుండటంతో భవిష్యత్తులో మరింత డిమాండ్‌ పెరుగుతుంది. ఈ కారణంగానే చాలామంది స్థిరాస్తిల వైపు చూస్తున్నారు. అందుకు తగ్గ ప్రతిఫలమూ అందుకుంటున్నారు.

Published : 20 Feb 2021 02:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: భూముల విలువ పెరగడమే కానీ తగ్గడం ఉండదు. జనాభా పెరిగేకొద్దీ భూ లభ్యత తగ్గనుండటంతో భవిష్యత్తులో మరింత డిమాండ్‌ పెరుగుతుంది. ఈ కారణంగానే చాలామంది స్థిరాస్తిల వైపు చూస్తున్నారు. అందుకు తగ్గ ప్రతిఫలమూ అందుకుంటున్నారు. ఒకరిని చూసి మిగతావారు కొనుగోలు చేస్తున్నారు. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడుల ద్వారా రాబడి వృద్ధి అధికంగా ఉండటంతో వ్యక్తిగత మదుపరులతో పాటు బడా సంస్థలు ఇందులో మదుపు చేస్తున్నాయి.
ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కొనుగోలు చేస్తున్నారా? భవిష్యత్తులో వృద్ధికి అవకాశం ఉన్న ప్రదేశంలోనా? పెట్టుబడి కోణంలో ఆలోచించేవారికి రెండోదే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. మౌలిక వసతులు పూర్తిగా ఉన్న ప్రాంతాల్లో సహజంగానే ధరలు అధికంగా ఉంటాయి. వచ్చే ఐదు, పదేళ్లలో అభివృద్ధి చెందే ప్రాంతాలను ఎంచుకుని అక్కడ కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి చోట్ల మంచి రాబడులకు అవకాశం ఉంది.

ఏ అవసరమైనా..
పెట్టుబడికి స్థలమా? ఇల్లు కొనడం మేలా అంటే అధికశాతం మంది మొదటి దానివైపే చూస్తున్నారు. పిల్లల వివాహం, పదవీ విరమణ తర్వాత విశ్రాంత జీవితం గడిపే ప్రణాళికలతో కొందరు దీర్ఘకాలానికి కొంటుంటే.. మరికొందరు మాత్రం ఆశించిన ధర రాగానే విక్రయించి అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇటీవల పెట్టుబడి దృష్ట్యా అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల కొనుగోళ్లు పెరిగాయి. ఇప్పటికే నగరంలో రెండు పడక గదుల ఫ్లాట్‌ ఉన్నవారు మరింత విశాలంగా ఉండే మూడు పడక గదులకు, శివార్లలో విల్లాలకు మారుతున్నారు.
వడ్డీ రేట్లు తగ్గడంతో..
గృహ రుణ వడ్డీ రేట్లు తగ్గడంతో సొంతింటి కలను గృహరుణం తీసుకుని సాకారం చేసుకుంటున్నారు. ప్రస్తుతం వడ్డీరేట్లు 6.90 శాతానికి దిగి వచ్చాయి. తమ బడ్జెట్‌లో దొరికే నివాసాలను ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్‌ ఉండటంతో 2021లో అందుబాటు ధరల్లో ఇళ్లు పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో ఈ ధరల్లో పూర్తయిన ఇళ్లు చాలావరకు అందుబాటులో ఉన్నాయి. కొత్తవి సైతం నిర్మాణంలో ఉన్నాయి. తమకు అనువైన ప్రాంతాల్లో వీటిని కొనుగోలు చేస్తున్నారు.
ముందే అయితే..
సిద్ధంగా ఉన్న ఇళ్ల కోసం ప్రస్తుతం ఎక్కువ మంది చూస్తున్నారు. మరికొందరు స్థలాలు, ఫ్లాట్లు, విల్లాలు, డూప్లెక్స్‌లైనా ప్రాజెక్ట్‌ ప్రారంభంలోనే కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. నచ్చిన దిక్కులో స్థిరాస్తిని ఎంచుకోవడానికి అపార అవకాశాలు ఉండటం..  నిర్వాహకులు ప్రీలాంచ్‌, సాఫ్ట్‌లాంచ్‌ ఆఫర్లు కొనుగోలుదారులను తొందరపడేలా చేస్తున్నాయి. బేరమాడినా ధరలు తగ్గించే వీలుండటంతో ఆరంభంలో కొనేందుకు సై అంటున్నారు. శివార్లలో ఆరంభంలో అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగు రూ.2700 అడుగులకు ఇస్తున్నారు. పూర్తయ్యేనాటికి రూ.4వేలకు పెరుగుతుందని చెబుతున్నారు.
ఏం చూడాలి?
* ఉపాధినిచ్చే సంస్థలు పెద్ద ఎత్తున ఎక్కడ కొలువైతే అక్కడ గృహాలకు డిమాండ్‌ ఉంటుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో స్థిరాస్తులను కొనుగోలు చేయవచ్చు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆహ్వానిస్తోంది. వేర్వేరు సంస్థలు ఇక్కడ తమ బ్రాంచీల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఏర్పాటు చేశాయి. కొత్తగా ఎక్కడ రాబోతున్నాయి వంటి విషయాలను ప్రభుత్వ ప్రకటనలను కొనుగోలుదారులు గమనిస్తుండాలి.
* ప్రభుత్వం ఐటీ రంగం విస్తరణకు గ్రిడ్‌ పాలసీని తీసుకొచ్చింది. వేర్వేరు ప్రాంతాల్లో ఐటీ పార్కుల ఏర్పాటు ప్రకటనలు చేసింది. కొనుగోలుదారులు ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తుండాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అదే సమమయంలో ప్రకటనలు ఎంతవరకు కార్యరూపం దాలుస్తున్నాయనే విషయాలను గమనిస్తుండటం ద్వారా అక్కడ కొనొచ్చా లేదా అనే అంచనాకు రావొచ్చు.
* అవుటర్‌ బయట కొత్త నగరాలు రాబోతున్నాయి. వీటిలో ఫార్మాసిటీ, నిమ్జ్‌ ఆచరణలోకి వస్తున్నాయి. భూసేకరణ దశలో ఉన్నాయి.
* బాహ్య వలయ రహదారి లోపల పలు ప్రాంతాలకు సరైన కనెక్టివిటీ లేదు. వీటిని కలుపుతూ గ్రిడ్‌ రోడ్లు, 100 అడుగుల రహదారులు పలు ప్రాంతాల్లో రాబోతున్నాయి.
* మెట్రోని రెండో దశలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ఆలోచనలు ఉన్నాయి.
* నగరం చుట్టూ ఉన్న జాతీయ రహదారుల విస్తరణ, ఆలయాల అభివృద్ధి, సమగ్ర రహదారుల అభివృద్ధి పథకంలో పలు ప్రాజెక్ట్‌లు వేర్వేరు ప్రాంతాల్లో రాబోతున్నాయి.
* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నగరం బయట లాజిస్టిక్‌ హబ్‌లు, రైల్వే టెర్మినల్స్‌ ఏర్పాటు ఆలోచనలు ఉన్నాయి.
* నగరం చుట్టుపక్కల పలు పట్టణాలు కొత్తగా జిల్లా కేంద్రాలు కాబోతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని