గృహ యోగం సాకారమిలా..!

అందుబాటు ధరలో ఉన్న ఇళ్లు ఒక పట్టాన నచ్చవు.. నచ్చే వాటి ధరలేమో అందుకునేలా ఉండవు.. ఆదాయం పెరిగాక చూద్దాంలే అనుకుంటే.. ఇళ్ల ధరలు అంతకంటే పైకెక్కి కూర్చుంటాయి. ఎప్పటికైనా సొంతిల్లు కొనగలమా....

Published : 26 Jun 2021 02:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: అందుబాటు ధరలో ఉన్న ఇళ్లు ఒక పట్టాన నచ్చవు.. నచ్చే వాటి ధరలేమో అందుకునేలా ఉండవు.. ఆదాయం పెరిగాక చూద్దాంలే అనుకుంటే.. ఇళ్ల ధరలు అంతకంటే పైకెక్కి కూర్చుంటాయి. ఎప్పటికైనా సొంతిల్లు కొనగలమా అనే సందేహం వేధిస్తుంటుంది. అదే సమయంలో తక్కువ ఆదాయంతోనూ సొంతింటి కలను నెరవేర్చుకున్నవారిని చూసినప్పుడు మనమూ కొనగలమని ధీమా వస్తుంది. ఒకే ఆదాయం ఉండి కొనగలిగిన వారిలో, కొనలేకపోతున్న వారిలో తేడాలను గమనించి..  పొరపాట్లను సరిచేసుకుంటే సొంతింటి కల సాకారం సాధ్యమే.

* ఇల్లు కొనడం అనేది అతిపెద్ద నిర్ణయం.. అందుకే ప్రాంతం, విస్తీర్ణం, వాస్తు ఇలా ప్రతిదీ అనుకూలంగా ఉంటేనే చాలామంది ముందడుగు వేస్తుంటారు. ఈ క్రమంలో ఎక్కువ మంది చేసే పొరపాటు ఏంటంటే తమ బడ్జెట్‌ను మించి చూడటం. ఎంతవరకు  ఇంటికోసం  పెట్టుబడి పెట్టగలరో అంతలోనే ఇంటిని వెతుక్కోవాలి. బడ్జెట్‌ వరకే పరిమితం అయితే ఇల్లు సొంతం అవుతుంది. కాకపోతే కోరుకున్న ప్రదేశంలో దొరకక పోవచ్చు.. దొరికితే విస్తీర్ణం తక్కువగా ఉండొచ్చు.. ఇలా ఏదో ఒక దాంట్లో రాజీ తప్పదు. నాణ్యత, నిబంధనలు, అనుమతుల విషయంలో రాజీ పడొద్దు. 

* ఇల్లు కొనాలనుకునే వారు చాలామంది ప్రస్తుతం వారు నివసిస్తున్న ప్రాంతంలో తీసుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. దొరికితే మంచిదే. కానీ అప్పటికే చాలా ఆలస్యం చేయడంతో ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెంది ధరలు పెరిగిపోయి ఉంటాయి. ఆరంభంలోనే కొంటే సరే.. లేదంటే తాము ఉంటున్న ప్రదేశానికి కాస్త దూరంగా.. వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటే బడ్జెట్‌లోనే కోరుకున్న విస్తీర్ణంలో స్థలం, వ్యక్తిగత ఇల్లు, ఫ్లాటు సొంతం అవుతుంది.

* ఇల్లు కొనాలనే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో మానొద్దు. మీ దృష్టికి వచ్చినా ప్రతిదాన్ని చూసి రండి. బడ్జెట్‌ ధరలో ఇళ్లు పరిమితంగా ఉంటాయి కాబట్టి చూడటం ఆపొద్దు. ఈక్రమంలో మీకు నచ్చిన ఇల్లు, మీ బడ్జెట్‌లో దొరుకుతుంది.

* దీని కోసం చూస్తున్నప్పుడు మంచి స్థలం దొరకొచ్చు. ఇల్లే కావాలని ఆ అవకాశాన్ని వదులుకోకండి.  అదే స్థలంలో ఇల్లు కట్టుకోవచ్చు. లేదంటే కొన్న స్థలం అమ్మితే కొన్నదానికంటే ఒకటి రెండు రెట్లు ఎక్కువే వస్తుంది. ఆ మొత్తంతో ఇంకా మంచి ఇల్లు కొనొచ్చు. ఫలానా దగ్గరే  కొంటాను అనే గిరి గీసుకోవద్దు. వృద్ధికి అవకాశం ఉన్న  ఏ ప్రాంతంలో ఉన్నా పెట్టుబడి విలువ పెరుగుతుంది.

* స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నంలో ఉన్నప్పుడు ఎంతోకొంత సొమ్ము అందుబాటులో ఉండాలి. నచ్చిన స్థిరాస్తి దొరకగానే అడ్వాన్స్‌గా ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది.  సొమ్ము అందుబాటులో ఉన్నప్పుడు ఆ మొత్తాన్ని ఎక్కడో ఒకచోట పెట్టుబడి పెట్టాలని బలంగా కోరుకుంటాం కాబట్టి ప్రయత్నం త్వరగా నెరవేరుతుంది అంటారు ఒక రియల్టరు.

* ఇల్లు కొనే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ఇతరత్రా అప్పులు చేయవద్దు. రుణం తీసుకుని కార్లు, ఖరీదైన మొబైల్స్‌, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు కొనేటప్పుడు ఇది గుర్తుంచుకోవాలి. ఇది గృహరుణ లభ్యతను తగ్గిస్తుందనే విషయం మర్చిపోవదు. ఏదైనా మంచి ఇల్లు అమ్మకానికి వస్తే చేతిలో తగినంత సొమ్ములేక చేజారే అవకాశం ఉంటుంది. అందుకే ఇంటి ప్రయత్నంలో ఉన్నవారు ఇతరత్రా ఈఎంఐల జోలికి వెళ్లక పోవడం మంచిది. 

* ఇంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు ఖర్చులను తగ్గించుకోగలిగితే పొదుపు పెరుగుతుంది. చిన్న మొత్తాలే కానీ దీర్ఘకాలంలో పెద్దమొత్తంగా జమవుతుంది. డౌన్‌పేమెంట్‌కు అవసరమైనంత సమకూర్చుకునేందుకు దోహదం చేస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని