మున్ముందు ఎలా ఉంటుంది?

కొవిడ్‌ రెండో ఉద్ధృతితో ఈ ఏడాది ప్రథమార్థంలో స్థిరాస్తి రంగం తీవ్రంగా దెబ్బతింది. లాక్‌డౌన్‌ ఎత్తివేయడం, రవాణా ఆంక్షలు తొలగిపోవడం, కార్యాలయాలు క్రమంగా తెరచుకోవడంతో ద్వితీయార్థంపై మార్కెట్‌ వర్గాలు భరోసాతో ఉన్నాయి.

Published : 07 Aug 2021 00:53 IST

స్థిరాస్తి రంగంపై సెంటిమెంట్‌ ఇండెక్స్‌ తాజా సర్వే

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ రెండో ఉద్ధృతితో ఈ ఏడాది ప్రథమార్థంలో స్థిరాస్తి రంగం తీవ్రంగా దెబ్బతింది. లాక్‌డౌన్‌ ఎత్తివేయడం, రవాణా ఆంక్షలు తొలగిపోవడం, కార్యాలయాలు క్రమంగా తెరచుకోవడంతో ద్వితీయార్థంపై మార్కెట్‌ వర్గాలు భరోసాతో ఉన్నాయి. నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (నరెడ్కో), ఫిక్కి, నైట్‌ఫ్రాంక్‌ సంయుక్తంగా చేపట్టిన సెంటిమెంట్‌ ఇండెక్స్‌ తాజా సర్వేలో డెవలపర్లు, కొనుగోలుదారులు ఇదే విషయాన్ని వెల్లడించారు. కొవిడ్‌ అనంతరం సొంతింటి అవసరం పెరగడమే మార్కెట్లు త్వరగా కోలుకోవడానికి కారణమని బిల్డర్లు పేర్కొంటున్నారు. గత ఏడాది అనుభవమే పునరావృతం అవుతుందని, రానున్న ఐదు నెలలల్లో విక్రయాలు పెరుగుతాయని, కొత్త ప్రాజెక్టులు మొదలయ్యే అవకాశం ఉందని 64 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

కార్యాలయాలకు లీజు..

ఐటీ ఉద్యోగులు ప్రస్తుతం చాలా వరకు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. కొవిడ్‌ భయం తొలగిపోగానే, తిరిగి కార్యాలయాల బాట పట్టనున్నారు. ఈ మేరకు ఇప్పటికే కంపెనీలు ఉద్యోగులకు సంకేతాలు ఇస్తున్నాయి. హైదరాబాద్‌లో పలు కంపెనీలు కొత్తగా కార్యాలయాలను తెరిచేందుకు ముందుకొస్తున్నాయి. పెద్ద ఎత్తున డాటా కేంద్రాలు రాబోతున్నాయి. ఇందుకోసం అవసరమైన కార్యాలయ భవనాలను ఆయా సంస్థలు లీజుకు తీసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా కార్యాలయాల లీజింగ్‌ వచ్చే నెలల్లో పెరుగుతుందని స్థిరాస్తి వ్యాపార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. లీజింగ్‌ డిమాండ్‌ ఎక్కువగా ఉందని సర్వేలో 40 శాతం మంది తెలిపారు.

ధరల దిద్దుబాటు...

రాబోయే నెలలో ఇళ్ల ధరలపై సర్వేలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఇప్పుడున్న ధరలే కొనసాగే అవకాశం ఉందని.. నిలకడగా ఉంటాయని 47 శాతం మంది అభిప్రాయపడ్డారు. ధరలు పెరుగుతాయని 45 శాతం మంది అంచనా వేస్తున్నారు. కార్యాలయాల అద్దెలు పెరగొచ్చని 15 శాతం మంది, నిలకడగా ఉంటాయని 40 శాతం మంది బిల్డర్లు పేర్కొంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని