మధ్యతరగతికి అనువైన ఇళ్లు కట్టండి

మధ్య, దిగువ మధ్యతరగతి ప్రజలకు అనువైన గృహ నిర్మాణాలపై దృష్టిసారించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్థిరాస్తి వ్యాపారులు, బిల్డర్లను కోరారు. స్థిరాస్తి రంగం సుస్థిరంగా ఉండాలంటే ఈ వర్గాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలను చేపట్టాలన్నారు. అందుకు ల్యాండ్‌ పూలింగ్‌ చేపట్టాలని నిర్మాణదారులు కోరుతున్నందున

Published : 14 Aug 2021 00:55 IST

క్రెడాయ్‌ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి
మాదాపూర్‌, న్యూస్‌టుడే

మధ్య, దిగువ మధ్యతరగతి ప్రజలకు అనువైన గృహ నిర్మాణాలపై దృష్టిసారించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్థిరాస్తి వ్యాపారులు, బిల్డర్లను కోరారు. స్థిరాస్తి రంగం సుస్థిరంగా ఉండాలంటే ఈ వర్గాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలను చేపట్టాలన్నారు. అందుకు ల్యాండ్‌ పూలింగ్‌ చేపట్టాలని నిర్మాణదారులు కోరుతున్నందున ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సాయం చేస్తామన్నారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(క్రెడాయ్‌) హైదరాబాద్‌ ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన స్థిరాస్తి ప్రదర్శనను మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి రాకముందు తానూ బిల్డర్‌నేనన్నారు. ధరణిలో సాఫ్ట్‌వేర్‌ సమస్య కారణంగా మిగిలి ఉన్న కొన్ని సమస్యలను సైతం పరిష్కరిస్తామన్నారు. విద్యుత్తు, జలమండలి, పర్యావరణ శాఖలకు సంబంధించిన భవన నిర్మాణ అనుమతులను సైతం టీఎస్‌బీపాస్‌ ద్వారా మంజూరు చేసేందుకు ఆయా విభాగాలను ఇందులోకి తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. రెరాకు కార్యాలయంతోపాటు ఛైర్మన్‌ నియామకం అంశం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందన్నారు. రిజినల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) అందుబాటులోకి వస్తే రియల్‌ఎస్టేట్‌ రంగం ఆకాశమే హద్దుగా దూసుకెళ్తుందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణలో భూములు నష్టపోయిన వారికి చెల్లించే నష్టపరిహారంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేందుకు నిర్ణయించిందన్నారు. 

ఆదివారం వరకు ప్రదర్శన

స్థిరాస్తి ప్రదర్శన ఆదివారం వరకు కొనసాగనుంది. 100 స్టాల్స్‌ వరకు ఏర్పాటు చేశారు. వేర్వేరు వర్గాల సొంతింటి అన్వేషణను సులభతరం చేసేలా ఫ్లాట్లు మొదలు ప్రీమియం, లగ్జరీ విలాల్ల వరకు 15000 పైగా ప్రాపర్టీలను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ప్రత్యేక కమిటీ వేయండి

పట్టణ ప్రాంతాలకు సంబంధించిన భూముల విషయంలో ధరణిలో చాలా సమస్యలు ఉన్నాయని క్రెడాయ్‌ హైదరాబాద్‌ అధ్యక్షులు పి.రామకృష్ణారావు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి వారం పది రోజుల్లో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ధరణిలో చట్టపరమైన వారసులకు సంబంధించిన ఆప్షన్‌ లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. రెరాకు శాశ్వత ఛైర్మన్‌ను నియమించాలని కోరారు.
* క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రధాన కార్యదర్శి వి.రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ క్రెడాయ్‌ ఆధ్వర్యంలో పదో సారి ఏర్పాటు చేస్తున్న ఈ ప్రదర్శనకు మంచి స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం భవన నిర్మాణాల ఫీజు చెల్లింపును నాలుగు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించడం బిల్డర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. కరోనా కాలంలో దేశవ్యాప్తంగా చేపట్టిన రియల్‌ వెంచర్లు, నిర్మాణాల్లో 40 శాతం హైదరాబాద్‌లోనే జరిగాయన్నారు. తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌పై రూపొందిస్తున్న ప్రత్యేక నివేదికను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రారంభోత్సవంలో క్రెడాయ్‌ జాతీయ ఉపాధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి, క్రెడాయ్‌ తెలంగాణ అధ్యక్షులు సీహెచ్‌ రాంచంద్రారెడ్డి, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ మురళీకృష్ణారెడ్డి, క్రెడాయ్‌ హైదరాబాద్‌ ఉపాధ్యక్షులు జి.ఆనంద్‌రెడ్డి, జైదీప్‌రెడ్డి, జగన్నాథ్‌రావు, కె.రాజేశ్వర్‌, కోశాధికారి ఆదిత్య గౌర, సంయుక్త కార్యదర్శులు కె.రాంబాబు, శివరాజ్‌ ఠాకూర్‌ తదితరులున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని