కొనుగోలుదారుల చూపు.. శంకర్‌పల్లి వైపు

నివాస ప్రాంతంగా శంకర్‌పల్లి వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఐటీ కారిడార్‌కు చేరువలో భవిష్యత్తు నివాస, పెట్టుబడులకు అనువైన స్థలంగా కొనుగోలుదారులు ఇటు వైపు చూస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణం, మెరుగైన రవాణా సదుపాయాలు, కోకాపేట నుంచి అరగంట ప్రయాణ దూరం కావడంతో పెట్టుబడిదారుల

Updated : 21 Aug 2021 03:39 IST

ఈనాడు, హైదరాబాద్‌

నివాస ప్రాంతంగా శంకర్‌పల్లి వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఐటీ కారిడార్‌కు చేరువలో భవిష్యత్తు నివాస, పెట్టుబడులకు అనువైన స్థలంగా కొనుగోలుదారులు ఇటు వైపు చూస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణం, మెరుగైన రవాణా సదుపాయాలు, కోకాపేట నుంచి అరగంట ప్రయాణ దూరం కావడంతో పెట్టుబడిదారుల దృష్టి ఇటు వైపు పడింది. కొవిడ్‌కు ముందు ధరలు అందుబాటులో ఉండటంతో లావాదేవీలు భారీగా జరిగాయి. కొవిడ్‌ అనంతరం మార్కెట్‌ కోలుకుంటోంది. ఈ ప్రాంతం మరింత వృద్ధి చెందే అవకాశం ఉందని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఐటీ కారిడార్‌ కోకాపేట వరకు విస్తరించడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు డిమాండ్‌ పెరిగింది.  గండిపేట నుంచి శంకర్‌పల్లి వెళ్లే మార్గంలో ఎడమవైపు జలాశయం ఉండటం, జీవో 111 పరిధితో.. కుడివైపున ఉన్న ప్రాంతాల్లో గత పదేళ్లలో పెద్ద ఎత్తున రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరిగింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లాకు చేరువలో ఉండటంతో మోఖిల్లా, కొండకల్‌,నాగులపల్లి, కొల్లూరు, ముత్తంగి, భానూరు, వెలిమల, నందిగామ, శంకర్‌పల్లి వరకు పెద్దఎత్తున లేఅవుట్లు వేసి రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు విక్రయించాయి. ప్రస్తుతం రీసేల్‌ నడుస్తున్నాయి. చదరపు గజం రూ.20వేల నుంచి చెబుతున్నారు. మోఖిల్లా లాంటి ప్రాంతాల్లో ధరలు ఇంకా ఎక్కువే. ఈ ప్రాంతాల్లోనూ కొంతకాలంగా అపార్ట్‌మెంట్ల నిర్మాణం మొదలైంది. విల్లా ప్రాజెక్టులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ ప్రాంతాలన్నీ గచ్చిబౌలికి 10నుంచి 20 కి.మీ.దూరంలో ఉన్నాయి. చాలాప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ల నిర్మాణం మొదలైంది. రూ.40 లక్షల నుంచి దొరుకుతున్నాయి. విల్లాలు రూ.కోటితో మొదలవుతున్నాయి.  ధరలు ఈ స్థాయిలో ఉన్నా పశ్చిమ హైదరాబాద్‌ కావడంతో ఇక్కడ మరింత వృద్ధికి అవకాశం ఉందంటున్నారు. 

దూరం వెళ్లాల్సిందే..
బడ్జెట్‌లో స్థలాలు కొనాలంటే మాత్రం శంకర్‌పల్లి దాటాల్సిందే అంటున్నారు రియల్టర్లు. ప్రస్తుతం స్థలాల లేఅవుట్లు శంకర్‌పల్లి దాటి వికారాబాద్‌ మార్గంలో ఐదు నుంచి పదికిలోమీటర్ల దూరం వెళితే తప్ప బడ్జెట్‌లో దొరకడం లేదు. మహాలింగాపురం, ధోబిపేట దాటి లక్ష్మారెడ్డిగూడ ప్రాంతంలో చదరపు గజం రూ.12వేల నుంచి 15వేల వరకు చెబుతున్నారు.  మన్‌సాన్‌పల్లి, మెహతాబాత్‌గూడెం వరకు.. చేవెళ్ల మార్గంలో రామంతాపూర్‌, పర్వేద-సంకేపల్లి మార్గం, ఇటు కంది, సంగారెడ్డి మార్గం వరకు లేఅవుట్లు వేశారు. ఫాంల్యాండ్లు అందుబాటులో ఉన్నాయి. దూరం వెళితే రూ.10వేల వరకు చదరపు గజం దొరుకుతున్నాయి. కొవిడ్‌కు ముందు ఇక్కడ ఆరేడు వేలకే విక్రయించినట్లు రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు చెబుతున్నారు.

కోకాపేట వేలం ప్రభావం..

కొవిడ్‌ అనంతరం  ఈప్రాంతంలోనూ ధరలు పెరిగాయి. కోకాపేటలో ప్రభుత్వం భూములను వేలం వేయడం, ఎకరా గరిష్ఠంగా రూ.60కోట్ల వరకు పలకడంతో ఈ ప్రభావం చుట్టుపక్కల భూములపై పడింది.  లక్షల్లో ఉన్న ఎకరా భూమి ధర అంతకుముందే కోటికి చేరగా.. ఇప్పుడదీ రెండు మూడు కోట్లకు పెరిగిందని స్థిరాస్తి వ్యాపారులు చెబుతున్నారు.  ప్రాంతీయ వలయ రహదారి వస్తుండటం వల్ల కూడా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. వికారాబాద్‌ మార్గం, కంది, సంగారెడ్డి వెళ్లే రహదారి, పటాన్‌చెరు వైపు అవుటర్‌ దారి, నేరుగా గండిపేట, కోకాపేట మార్గం ఉండటంతో రవాణా పరంగా ఈ ప్రాంతానికి చాలా సానుకూలతలు ఉన్నాయని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు చెబుతున్నాయి. 25 కిలోమీటర్ల దూరం ఉన్నా కోకాపేటకు ఇక్కడి నుంచి అరగంటే ప్రయాణం అంటున్నారు. స్థానికంగా రైల్వే స్టేషన్‌ ఉండటం,  కొండకల్‌లో రైల్వే కోచ్‌, భానూరులో బీడీఎల్‌ వంటి పరిశ్రమలు ఉండటం, భవిష్యత్తులో కొండకల్‌లో  ఐటీ పార్కు ప్రతిపాదన, పలువురు ప్రముఖుల నివాసాలు ఉండటం వంటివి శంకర్‌పల్లి రియల్‌ ఎస్టేట్‌ను నడిపిస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని