ఆధునిక జీవన శైలికి చిరునామా

అవుటర్‌ రింగ్‌ రోడ్డు లోపల.. ఐటీ కారిడార్‌లోని కార్యాలయాలకు అత్యంత చేరువ.. రహదారుల అభివృద్ధి వంటి మౌలిక ప్రాజెక్టులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం..  క్రమంగా మెరుగవుతున్న సోషల్‌ ఇన్‌ఫ్రా..  చేరువలో అంతర్జాతీయ స్థాయిలో పలు పాఠశాలు.

Published : 04 Sep 2021 02:27 IST

ఈనాడు, హైదరాబాద్‌

అవుటర్‌ రింగ్‌ రోడ్డు లోపల.. ఐటీ కారిడార్‌లోని కార్యాలయాలకు అత్యంత చేరువ.. రహదారుల అభివృద్ధి వంటి మౌలిక ప్రాజెక్టులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం..  క్రమంగా మెరుగవుతున్న సోషల్‌ ఇన్‌ఫ్రా..  చేరువలో అంతర్జాతీయ స్థాయిలో పలు పాఠశాలు.. భవిష్యత్తులో మరింత వృద్ధికి అవకాశం ఉండడంతో గోపన్‌పల్లి, ఉస్మాన్‌నగర్‌, కొల్లూరు, తెల్లాపూర్‌ ప్రాంతాలు ఖరీదైన నివాస కేంద్రాలుగా కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
నగరంలో పెద్ద ఎత్తున ప్రీమియం విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు ఐటీ కారిడార్‌ చుట్టుపక్కలనే వస్తున్నాయి. పదేళ్ల క్రితం ఈ ప్రాంతాలన్నీ గ్రామాలుగా ఉండేవి. నిర్మాణాలతో ఇప్పుడు రూపురేఖలే మారిపోయాయి. మాదాపూర్‌, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కి చేరువలో ఉండటంతో క్రమంగా సమీప ప్రాంతాలన్నీ నివాస కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. ఇంకా పెద్ద ఎత్తున విల్లాలు, అపార్ట్‌మెంట్ల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. 20 నుంచి 30 అంతస్తుల ఆకాశహర్మ్యాలను చేపడుతున్నారు.

ప్రణాళికాబద్ధమైన..

ఇక్కడ బడా సంస్థలు 20 నుంచి 70 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టులు చేపడుతున్నాయి. దీంతో మాస్టర్‌ ప్లాన్‌కు తగ్గట్టుగా ఈప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి అవకాశం లభించనుందని బిల్డర్‌ ఒకరు తెలిపారు. దీంతో ఇక్కడ ప్రణాళికబద్ధమైన అభివృద్ధి ఎక్కువ కనిపిస్తుందని విశ్లేషించారు. ఈ కారణంగానే ఇక్కడ ఎక్కువ ప్రీమియం ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పారు.

సకల హంగులతో...

ఇక్కడ చేపట్టినవన్నీ గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టులే కావడం మరో చెప్పుకోతగ్గ అంశం. సౌకర్యాల కల్పనలో నిర్మాణ సంస్థలు ఒకదానితో మరోటి పోటీ పడుతున్నాయి. కొనుగోలుదారుల అవసరాలన్నీ కమ్యూనిటీలోనే తీరేలా సకల హంగులను కల్పిస్తున్నాయి. క్లబ్‌ హౌస్‌, ఇండోర్‌ క్రీడా స్థలాలు, జాగింగ్‌ ట్రాక్‌, ఈతకొలను, గ్రంథాలయం, విద్యుత్తు ఛార్జింగ్‌ పాయింట్లు, అతిథుల గదులు, క్లినికల్‌ వరకు సకలం కమ్యూనిటీ లోపల ఉండేలా నిర్మాణాలు చేపడుతున్నారు. ఆధునిక జీవనశైలిని కోరుకునే వారంతా వీటిని చూసే మొగ్గు చూపుతున్నారు. ఒకవైపు నిర్మాణాలు జోరుగా జరుగుతున్నా.. మరోవైపు జీవో 111 తో పచ్చదనం మెరుగ్గా ఉండటంతో వాతావరణం సమతుల్యంగా ఉంది. ఇది కూడా కొందర్ని ఇటువైపు చూసేలా చేస్తోంది. అవుటర్‌ రింగు రోడ్డు లోపలే ఈ ప్రాంతాలు ఉండటంతో నగరంలోనే ఉన్నామనే భావన కూడా మరికొందరు తమ నివాసాలకు అనువైన ప్రాంతంగా దీనిని ఎంపిక చేసుకోవడానికి కారణంగా కనబడుతోంది.

రవాణాపరంగా..

కొత్తగా వస్తున్న నిర్మాణాలు, అక్కడ ఉండే జనావాసాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతుల పెంపుపై సర్కారు దృష్టిపెట్టింది. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి కొల్లూరు వరకు విశాలమైన రహదారి దాదాపుగా పూర్తయింది. అక్కడక్కడ కొన్ని లింక్‌లను కలపాల్సి ఉంది. నార్సింగి నుంచి కొల్లూరు వరకు అవుటర్‌ సర్వీసు రోడ్లను నాలుగు వరసల దారిగా విస్తరించే పనులు జరుగుతున్నాయి. తెల్లాపూర్‌లో ఎంఎంటీఎస్‌ స్టేషన్‌, ఈదుల నాగులపల్లిలో రైల్వే స్టేషన్‌, పక్క నుంచే ఓఆర్‌ఆర్‌ వెళుతుండటంతో రవాణా అనుసంధానం ఇటీవల కాలంలో గణనీయంగా మెరుగైంది. అరగంట వ్యవధిలో ఐటీ కారిడార్‌కు చేరుకునే అవకాశం ఉండటంతో ఎక్కువగా ఐటీ రంగంలోని వారు కొనుగోళ్లు చేస్తున్నారు. వ్యాపార, వైద్య, ఇతర వర్గాలు సైతం ఆసక్తి చూపిస్తున్నాయని మరో బిల్డర్‌ తెలిపారు.

భవిష్యత్తులో మరింతగా..

ఇప్పటికే ఇక్కడ ధరలు బాగా పెరిగాయి. విల్లా ప్రాజెక్టుల్లో చదరపు అడుగు రూ.10వేల పైనే చెబుతున్నారు. ప్రదేశాన్ని, చుట్టుపక్కల ఉండే మౌలిక వసతులను బట్టి రూ.18వేల వరకు ఇక్కడ విక్రయిస్తున్నారు. రెండు, మూడు అంతస్తుల విల్లాలే ఎక్కువ. గేటెడ్‌ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగు రూ.5వేల నుంచి మొదలవుతోంది. రెండు నుంచి మూడు, నాలుగు పడక గదుల ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత వృద్ధికి అవకాశం ఉందని నిర్మాణదారులు చెబుతున్నారు. కోకాపేటలో ప్రభుత్వం ఇటీవల భూములను వేలం వేయడంతో కొనుగోలు చేసినవాళ్లు ఇక్కడ నిర్మాణాలు ప్రారంభించే అవకాశం ఉంది.  ఇక్కడ మరిన్నీ పెద్ద ఐటీ కంపెనీలు రాబోతున్నాయి. వీటితో సమీపంలోని నివాసాలకు గిరాకీ పెరుగుతుందని చెబుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని