సాటిలేని ఐటీ సౌధాలు

కొవిడ్‌తో కార్యాలయాల నిర్మాణాలు, లీజింగ్‌పై ప్రభావం పడినా.. భవిష్యత్తు దృష్ట్యా మున్ముందు డిమాండ్‌ ఉంటుందని అంచనాలు వాస్తవంలోకి వస్తున్నాయి. మూడేళ్ల పరిస్థితులను

Published : 18 Sep 2021 02:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌తో కార్యాలయాల నిర్మాణాలు, లీజింగ్‌పై ప్రభావం పడినా.. భవిష్యత్తు దృష్ట్యా మున్ముందు డిమాండ్‌ ఉంటుందని అంచనాలు వాస్తవంలోకి వస్తున్నాయి. మూడేళ్ల పరిస్థితులను విశ్లేషించిన రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ ప్రత్యేకించి దక్షిణాదిలో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలో కార్యాలయాల పరంగా తమ ఉనికిని మరింత పెంచుకున్నాయని చెబుతోంది. గత సంవత్సరం మూడింట రెండో వంతు ఇక్కడి కార్యాలయాల నిర్మాణాలు, లీజింగ్‌లు జరిగాయని అనరాక్‌ సంస్థ వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం 2021-26వరకు ప్రకటించిన నూతన ఐటీ విధానంతో భవిష్యత్తులో కార్యాలయాల భవనాలకు మరింత డిమాండ్‌ ఉంటుందని స్థిరాస్తి సంస్థలు అంచనా వేస్తున్నాయి.

దేశంలో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబయి, పుణె, దిల్లీ రాజధాని ప్రాంతంలో ఎక్కువగా ఐటీ కార్యాలయాలు విస్తరించాయి. వీటినే ఉత్తరాది, దక్షిణాది, పశ్చిమ ప్రాంతాలుగా చూస్తున్నారు.

* 2017-18లో అన్ని నగరాల్లో కలిపి 31.15 మిలియన్‌ చదరపు అడుగుల కార్యాలయాలను లీజింగ్‌కు ఇస్తే అందులో దక్షిణాది వాటా 47 శాతంగా ఉంది. పశ్చిమ రీజియన్‌ 33 శాతం, ఉత్తరాదిన 17 శాతం వాటా ఉండేది.

* 2021 నాటికి దక్షిణాది వాటా 66 శాతానికి పెరిగింది. దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో కలిపి 21.32 మిలియన్‌ చదరపు అడుగుల కార్యాలయాల లీజింగ్‌ జరిగితే.. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై కలిపే 14.06 మిలియన్‌ చ.అ. ఉండటం  విశేషం.

కొత్త సంస్థల రాకతో..

కార్యాలయాల లీజింగ్‌లో అత్యధిక శాతం ఐటీ నుంచే డిమాండ్‌. కొవిడ్‌తో ప్రస్తుతం ఉద్యోగులు 90 శాతం వరకు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. పెద్ద సంస్థలు క్రమంగా ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. మరో ఆరునెలల్లోనూ పూర్తి స్థాయిలో కార్యాలయాలు పనిచేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిస్థితిని ఎంతో ముందుగానే ఊహించిన అంతర్జాతీయ సంస్థలు ఎక్కువ విస్తీర్ణం కల్గిన కార్యాలయాలను లీజింగ్‌కు ముందే ఒప్పందాలు చేసుకున్నాయి. హైదరాబాద్‌లో ఇటీవలే పలు పెద్ద సంస్థలు  తమ కొత్త కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయి. ముందస్తు ఒప్పందాల మేరకు వాటి పనులు పూర్తిచేసి ఐటీ సంస్థలకు అప్పగించే పనుల్లో నిర్మాణ సంస్థలు ఉన్నాయి. రాబోయే ఐదేళ్లలో 3 లక్షల కోట్ల ఐటీ ఎగుమతుల లక్ష్యంగా తెలంగాణ సర్కారు ముందుకు వెళుతుండటంతో మున్ముందు ఇక్కడ మరిన్ని కంపెనీలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఐటీ సంస్థలతో పాటూ ఫైనాన్షియల్‌, ఇతర రంగాల కార్యాలయాలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున అంకుర సంస్థలు వస్తున్నాయి. వీటి వాటా క్రమేణా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా విదేశీ సంస్థలు స్థానిక సంస్థలతో కలిసి కార్యాలయాల నిర్మాణాలపై రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి.

అద్దెల్లో రెండంకెల వృద్ధి..

* హైదరాబాద్‌లో కార్యాలయాల సగటు అద్దె చదరపు అడుగుకు 2018లో రూ.51 ఉండగా..  2021 నాటికి రూ.57కి పెరిగింది. దాదాపు 12 శాతానికి ఇది సమానం. పశ్చిమ హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లోనే అద్దెలు. సిటీలోని ఇతర ప్రాంతాల్లో సగటు కంటే తక్కువ అద్దెకు కార్యాలయాలు లభిస్తున్నాయి. ఏ గ్రేడ్‌ కార్యాలయాల అద్దెలు సగటు కంటే ఎక్కువగా ఉన్నాయి.

* బెంగళూరులో చదరపు అడుగు అద్దె మూడేళ్ల క్రితం రూ.67 ఉండగా.. 2021 నాటికి రూ.77కి పెరిగింది. దాదాపు 15 శాతం పెరిగాయి.

* చెన్నైలో మూడేళ్లలో అద్దెలు 11 శాతం పెరిగాయి. 2018లో చదరపు అడుగు కార్యాలయ సగటు అద్దె రూ.54 ఉండగా ప్రస్తుతం రూ.60 వరకు ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని