ఏ వయసులో ఇల్లు కొనడం కలిసొస్తుంది?

నగరంలో సొంతిల్లు ఉండాలని కోరుకోనివారు అరుదు. ఎవరి స్థాయిలో వారు కలల గృహాన్ని కట్టుకుంటుంటారు.. కట్టిన ఇళ్లు, ఫ్లాట్లు, విల్లాలను కొనుగోలు చేస్తుంటారు. ఏ వయసులో ఇల్లు కొనడం,

Published : 18 Sep 2021 02:34 IST

నగరంలో సొంతిల్లు ఉండాలని కోరుకోనివారు అరుదు. ఎవరి స్థాయిలో వారు కలల గృహాన్ని కట్టుకుంటుంటారు.. కట్టిన ఇళ్లు, ఫ్లాట్లు, విల్లాలను కొనుగోలు చేస్తుంటారు. ఏ వయసులో ఇల్లు కొనడం, కట్టడం సరైంది? అంతమేర పెట్టుబడి సమకూర్చుకోవడం సాధ్యమేనా?

ఈనాడు, హైదరాబాద్‌

చదువు పూర్తిచేసుకుని కోరుకున్న రంగంలో ఉద్యోగం సంపాదించి, కుదురుకునే సరికి వయసు పాతిక వచ్చేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయి. చదువు పూర్తికాగానే.. ఇంకా చెప్పాలంటే చివరి సంవత్సరంలో ఉండగానే 21 ఏళ్ల వయసులోనే కొలువులు సంపాదిస్తున్నారు కుర్రకారు.  భారీ వేతనాలను అందుకుంటున్నారు. ఇందులో కొంత సరదాలకు ఖర్చు చేసినా మిగతా మొత్తం పొదుపునకు ప్రాధాన్యం ఇస్తే నాలుగైదేళ్లలో ఇల్లు కొనేందుకు కావాల్సిన డౌన్‌ పేమెంట్‌ను సమకూర్చుకోవచ్చు. ఈ లోపు  మంచి ప్రదేశంలో స్థలాలు విక్రయానికి వస్తే ఆ సొమ్ముతో కొనుగోలు చేయవచ్చు. ఆ తర్వాత అక్కడే ఇల్లు కట్టుకోవచ్చు. లేదంటే అమ్మేసి నచ్చిన చోట ఇంటిని కొనుగోలు చేయవచ్చు.

విలువ పెరుగుతుంది..

చిన్న వయసులోనే ఇల్లు కొంటే దీర్ఘకాలంలో దాని విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది. హైదరాబాద్‌లో వృద్ధికి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని అక్కడ కొనుగోలు చేయవచ్చు.

దీర్ఘకాలానికి రుణాలు..

ఎంత పొదుపు చేసినా.. గృహరుణం తీసుకోకుండా ఇల్లు కొనడం ఎక్కువ మందికి సాధ్యం కాదు. చిన్నతనంలోనే కొనుగోలు చేస్తే దీర్ఘకాలానికి ఎక్కువ మొత్తం రుణంగా పొందవచ్చు. ఈఎంఐ భారం కాకుండా ఉంటుంది. ఇతర ముఖ్య విషయాల్లో రాజీ పడాల్సిన అవసరం ఉండదు.


ఓ అధ్యయనం మేరకు.. 

స్థిరాస్తుల్లో ఏ వయసు వారు ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారో ఇటీవల ఒక సంస్థ అధ్యయనం చేసింది. 23 నుంచి 38 ఏళ్ల మధ్యనున్న వయసు వాళ్లు ఇంటికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. వీరు 48 శాతంగా ఉన్నట్లు వెల్లడైంది.  21 ఏళ్లకు సంపాదన మొదలెడుతున్నా.. 23 ఏళ్ల తర్వాత స్థిరాస్తులు అంటున్నారు.  కేవలం 16 శాతం కుర్రకారే రియల్‌ ఎస్టేట్‌ వైపు చూస్తున్నారు. వీరు సైతం సంపాదన మొదలెట్టిన ప్రారంభంలో పెట్టుబడి పెట్టగలిగితే రిటైర్మెంట్‌ ప్రణాళికల కోసం ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఉండదని పర్సనల్‌ ఫైనాన్స్‌ నిపుణులు సూచిస్తున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని