ఆగ్నేయం వైపు పెరగకూడదా?

జన్మరాశి ప్రకారం ఏ మొక్కలు నాటుకోవాలి? ఆగ్నేయంలో నాలుగు అడుగులు పెరగడం మంచిది కాదా? ఇలాంటి సందేహాలను నివృత్తి చేశారు ప్రముఖ వాస్తు నిపుణులు పి.కృష్ణాది శేషు.  

Updated : 25 Sep 2021 06:50 IST

జన్మరాశి ప్రకారం ఏ మొక్కలు నాటుకోవాలి? ఆగ్నేయంలో నాలుగు అడుగులు పెరగడం మంచిది కాదా? ఇలాంటి సందేహాలను నివృత్తి చేశారు ప్రముఖ వాస్తు నిపుణులు పి.కృష్ణాది శేషు.  

* వాస్తురీత్యా ఇంటి చుట్టూరా జన్మ రాశి ప్రకారం ఎలాంటి మొక్కలు పెంచుకోవాలి?  

        - వేముల సరస్వతి, కూకట్‌పల్లి

జాతక రీత్యా 27 జన్మ నక్షత్రాలు. నక్షత్రం ప్రకారం మొక్కలు ఎంపిక చేసుకోవాలి.  అశ్వని- కుచల, జీడిమామిడి; భరణి-ఉసిరి; కృత్తిక-మేడి, అత్తి; రోహిణి-నేరేడు; మృగశిర-రేగు, మారేడు; ఆరుద్ర-కృష్ణకమల, చింత; పునర్వసు-తుమ్మ, వెదురు, గన్నేరు; పుష్యమి-రావి, పిప్పలి; ఆశ్లేష-చెంపక, సంపంగి; మఖ- మర్రి; పుబ్బ-మోదుగు, అశోక; ఉత్తర-జువ్వి; హస్త-మల్లె, సన్నజాజి, కుంకుడు; చిత్త-బిల్వ, మారేడు, తాళ; స్వాతి-మద్ది; విశాఖ- వెలగ, మొగలి; అనురాధ-పొగడ; జ్యేష్ట- వేప; మూల-బిల్వ; పుర్వాషాడ-జిల్లేడు, నిమ్మ, అశోక; ఉత్తరాషాడ-కదంబ, పనస; శ్రవణ-జిల్లేడు; ధనిష్ట- కొబ్బరి, జమ్మి; శతభిషం- మామిడి, అరటి; పూర్వభాద్ర- కదంబ, మామిడి; ఉత్తరాభాద్ర- గోరింట, వేప; రేవతి- రేగు, విప్ప.


* మేం ఈ మధ్యనే ఇంటి స్థలం కొన్నాం. ఆగ్నేయంలో సుమారు నాలుగు అడుగులు పెరిగింది. ఇలాంటివి కొనకూడదని ఒక పెద్దాయన అన్నారు. ఇప్పుడేం చేయలో తోచడం లేదు. సలహా ఇస్తారా?  

- వి.లింగరాజు, చైతన్యపురి

పెరిగిన స్థలం వేరుచేస్తూ గోడ కట్టుకోండి. ఆ స్థలంలో చెట్లు పెంచడం, ఇంకుడు గుంత ఏర్పాటు వంటివి చేసుకోవచ్చు. మీకే కాదు ఇరుగుపొరుగు వారికి కూడా మేలు జరుగుతుంది.

* వాస్తు ప్రకారం బ్రహ్మ స్థానం గురించి చెబుతారా?

- రాంనారాయణరెడ్డి, విజయవాడ

బ్రహ్మస్థానం అనేది కట్టిన ఇంటికి నాలుగు మూలలు కలుపుతూ మధ్యలో వచ్చే స్థానమే. ఇక్కడ గోడలు, స్తంభాలు రాకూడదు. ఈ స్థానం వాడుకోవడానికి వీలుగా ఉండాలి.
 

* పిశాచస్థానం ఇంటికా? స్థలానికా? దేనికి వర్తిస్తుంది?

- గెల్లి వసంతకుమార్‌, ముషీరాబాద్‌

ఇంటికి, ప్రహరీకి మధ్యలో ఇంటి చుట్టూరా ఉన్న ఖాళీ స్థలం పిశాచస్థానం అంటారు. నిర్మాణ భాషలో చెప్పాలంటే సెట్‌బ్యాక్‌గా వ్యవహరిస్తున్నారు. శాస్త్రీయంగా చూస్తే దీనితో ప్రయోజనాలు ఉన్నాయి.
 

*చాలా రకాల తులసి మొక్కలు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇంట్లో ఏరకమైనది పెంచుకోవాలి?

- ఉప్పల రామలక్ష్మి, దోమలగూడ

ప్రతీ ఇంట్లో విధిగా తులసి మొక్క పెంచుకోవాలి. పదిహేను నుంచి 18 రకాలు ఉన్నా ఇంటి ఆవరణలో మాత్రం లక్ష్మీ తులసి, విష్ణు తులసి, కృష్ణ తులసి మొక్కలను పూజిస్తుంటారు. ఇది శాస్త్ర సమ్మతం కూడా.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని