పెట్టుబడులకు హైదరాబాద్‌ అనువైన నగరం

హైదరాబాద్‌ పెట్టుబడులకు అనువైన నగరమని సినీనటుడు నాగశౌర్య అన్నారు. ఇక్కడ స్థిరాస్తి రంగంలో మదుపు చేస్తే అనతి కాలంలోనే అది రెట్టింపు అవుతుందన్నారు. తాను సంపాదించిన దాంట్లో 90 శాతం స్థిరాస్తిలోనే పెడతానని ఆయన అన్నారు.

Published : 02 Oct 2021 01:41 IST

సినీనటుడు నాగశౌర్య

మాదాపూర్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ పెట్టుబడులకు అనువైన నగరమని సినీనటుడు నాగశౌర్య అన్నారు. ఇక్కడ స్థిరాస్తి రంగంలో మదుపు చేస్తే అనతి కాలంలోనే అది రెట్టింపు అవుతుందన్నారు. తాను సంపాదించిన దాంట్లో 90 శాతం స్థిరాస్తిలోనే పెడతానని ఆయన అన్నారు. తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ (ట్రెడా) ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం స్థిరాస్తి ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ నెల 3 వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనను నాగశౌర్య ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఐకియా లాంటి సంస్థ ఇక్కడికి రావడం హర్షణీయమన్నారు. నగరంలో పేరొందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, నిర్మాణ సంస్థలు ఒకే వేదిక మీదకు వచ్చే విధంగా ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునే వారు వేర్వేరు ప్రాంతాలు తిరగాల్సిన పనిలేకుండా ఆయా నిర్మాణదారులు చేపడుతున్న ప్రాజెక్టుల గురించి ఒక్కచోట తెలుసుకునే అవకాశం ఈ ప్రదర్శన ద్వారా దక్కుతుందన్నారు. డబ్బులు పొదుపు చేయడంలో మహిళలు ముందు ఉంటారని, తాను సంపాదించిన ప్రతి పైసా తన తల్లికే ఇస్తానని నాగశౌర్య పేర్కొన్నారు. తన తల్లి దానిని ఖర్చు చేయకుండా స్థిరాస్తి కొనుగోలుకు వెచ్చిస్తారన్నారు.

భూముల ధరలు నియంత్రించాలి..

హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందని ట్రెడా అధ్యక్షులు చలపతిరావు పేర్కొన్నారు. ఇక్కడ భూముల ధరలు పంచకళ్యాణి గుర్రంలా వేగంగా పరుగెత్తుతున్నాయన్నారు. వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సర్కారు భూములు వేలం వేయకుండా డెవలప్‌మెంట్‌కు ఇస్తే బాగుంటుందన్నారు. నగరంలో మౌలిక వసతులు ఎంతో మెరుగవుతున్నాయని వివరించారు. ప్రతి ఒక్కరు ఇక్కడే స్థిరపడాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు. ధరణిలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం  చర్యలు తీసుకోవాలని కోరారు. ధరణి కారణంగా చాలా వరకు భూసమస్యలు పరిష్కారమైనప్పటికీ ఇంకా కొన్ని జటిలమైన ఇబ్బందులు ఉన్నాయన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న వారికి తగిన న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెడా ప్రధాన కార్యదర్శి సునీల్‌ చంద్రారెడ్డి, కోశాధికారి శ్రీధర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు విజయ్‌సాయి తదితరులున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని