ఇల్లు కొనగలరని సూచీస్తుంది!

ఇళ్ల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. భూముల, నిర్మాణ సామగ్రి వ్యయం పెరగడంతో

Updated : 15 Oct 2021 17:28 IST

ఈనాడు, హైదరాబాద్‌ : ఇళ్ల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. భూముల, నిర్మాణ సామగ్రి వ్యయం పెరగడంతో  ఆ మేరకు కొత్త ఇంటి ధరలకు సైతం రెక్కలొస్తున్నాయి. శివార్లలో అపార్ట్‌మెంట్‌లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాట్‌ కావాలన్నా ఎంత లేదన్నా రూ.40-50 లక్షలు కావాల్సిందే. ఈ రీతిలో పెరుగుతున్నా... గత దశాబ్దంతో పోలిస్తే ఇల్లు కొనుగోలు స్థోమత ఇప్పుడు ఇంకా మెరుగైంది అంటున్నాయి స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థలు. అదెలాగో చూద్దాం..

జేఎల్‌ఎల్‌ హోమ్‌ పర్చేజ్‌ అఫర్డబిలిటీ ఇండెక్స్‌(హెచ్‌పీఏఐ) 2021 ప్రకారం మూడు ప్రధానమైన కారణాలతో కొనుగోలు స్థోమత పెరిగిందని విశ్లేషించింది. 

* పదేళ్ల క్రితంతో పోలిస్తే గృహ ఆదాయం పెరగడం ప్రధానంగా ఉంది. గతంలో ఆదాయాలు తక్కువగా ఉండేవి. ఉపాధి అవకాశాలు ముఖ్యంగా సేవారంగంలో పెరగడం, మెరుగైన వేతనాలు, ఇంట్లో భార్యాభర్త ఉద్యోగాలు చేస్తుండటంతో కుటుంబ ఆదాయం పెరిగింది. 2020తో పోలిస్తే  ప్రస్తుత సంవత్సరంలో హైదరాబాద్‌తో సహా పలు నగరాల్లో కుటుంబ ఆదాయం 7 నుంచి 9 శాతం పెరిగిందని నివేదికలో పేర్కొంది. 

గృహరుణ వడ్డీరేట్లు 15 ఏళ్ల కనిష్ఠ స్థాయిలో ప్రస్తుతం లభిస్తున్నాయి. ఒకప్పుడు 13 నుంచి 14 శాతం మధ్య ఉన్న గృహరుణాలు ఇప్పుడు తక్కువలో తక్కువ 6.70 వడ్డీకి ఇస్తున్నాయి. దాదాపుగా సగానికి వడ్డీరేట్లు తగ్గాయి. ఫలితంగా ఈఎంఐ భారం తగ్గింది. దీంతో ఎక్కువ మంది గృహరుణం తీసుకుని సొంతిల్లు కొనుగోలు చేస్తున్నారు. 

స్థిరాస్తుల ధరలు హైదరాబాద్‌ మినహా మిగతా నగరాల్లో స్థిరంగా ఉండటం కూడా కలిసి వచ్చింది. హైదరాబాద్‌లో ధరలు పెరుగుతున్నా.. వేర్వేరు వర్గాలకు తగ్గట్టుగా నిర్మాణాలు అందుబాటులో ఉన్నాయి. ధరలు పెరిగేకొద్దీ సిటీ నుంచి దూరం వెళుతున్నారు. అక్కడ కొంటున్నారు. కొందరు గతంలో కొనుగోలు చేసిన స్థలంలో  ఇల్లు కట్టుకుంటుండగా.. మరికొందరు ఆ స్థలాన్ని విక్రయించి నచ్చిన చోట కట్టిన ఇళ్లను కొంటున్నారు. ఇవన్నీ కలిసి పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇల్లు కొనే స్థోమత పెరిగిందని నివేదికలో విశ్లేషించారు. 

సూచీ వంద ఉంటే... వెయ్యి చ.అ. విస్తీర్ణం కలిగిన ఇల్లు కొనుగోలు చేసేందుకు అవసరమైన గృహ రుణం పొందేందుకు సరిపడా ఆదాయం ఉన్నట్లు.

హైదరాబాద్‌ సూచీ ప్రస్తుతం 203 వద్ద ఉంది. చాలామందిలో గృహరుణం పొందేందుకు అవసరమైన ఆదాయం కంటే రెట్టింపు ఉంది. ఫలితంగా  ఆయా వర్గాలు సులువుగా రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేస్తున్నారు. 

కొసమెరపు:  ఇల్లు కొనే స్థోమత పెరగడం అంటే ఇళ్ల అమ్మకాలు పెరిగాయని అర్థం కాదని నివేదిక పేర్కొంది.  ప్రస్తుత ఉపాధి అవకాశాలు.. భవిష్యత్తు ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఇల్లు కొనడానికి ముందుకు వస్తారని పేర్కొంది.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు