దిక్కులు మూలలు లేని స్థలంలో కట్టుకునేది ఎలా?

ప్రణాళికాబద్ధ అభివృద్ధిలో లేఅవుట్లు సైతం క్రమపద్ధతిలో ఉంటాయి. వాటిలో ప్లాట్ల విభజన సాధారణంగా వాస్తును దృష్టిలో పెట్టుకునే చేస్తుంటారు. దిక్కుల మూలలన్నీ చాలావరకు పక్కాగా ఉంటాయి. కానీ కొన్నిచోట్ల రహదారులు,

Updated : 06 Nov 2021 06:11 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రణాళికాబద్ధ అభివృద్ధిలో లేఅవుట్లు సైతం క్రమపద్ధతిలో ఉంటాయి. వాటిలో ప్లాట్ల విభజన సాధారణంగా వాస్తును దృష్టిలో పెట్టుకునే చేస్తుంటారు. దిక్కుల మూలలన్నీ చాలావరకు పక్కాగా ఉంటాయి. కానీ కొన్నిచోట్ల రహదారులు, భూమి సరిహద్దుల కారణంగా స్థలాల మూలల్లో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. దిక్కులు మూలలు లేని స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు వాస్తు అనుకూలిస్తుందా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? ఇలాంటి స్థలాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు ప్రముఖ వాస్తు నిపుణులు పి.కృష్ణాది శేషు.

దిక్కుల మూలలు సరిగ్గా ఉన్నాయో లేవో చూసే ఎక్కువ మంది స్థలాలు కొనుగోలు చేస్తుంటారు. ఒకవేళ హెచ్చుతగ్గులు ఉంటే లేఅవుట్‌లలో మూలలు సరిగ్గా ఉన్న విస్తీర్ణం మేరకు ధర కట్టి.. మిగతా స్థలాన్ని ఉచితంగానే అమ్ముతుంటారు.. కాకపోతే మొత్తం స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఈ కారణంగా కూడా ఇలాంటి స్థలాలను కొనుగోలు చేస్తుంటారు. మరికొన్ని సార్లు మొత్తం ప్లాట్‌ తక్కువ ధరకు వస్తుందని కొంటుంటారు. మూలలు సరి చేసి ఎక్కువ మంది ఇల్లు కడుతుంటారు. హెచ్చుతగ్గులు ఉన్న స్థలాన్ని వేర్వేరు అవసరాలకు వినియోగిస్తుంటారు. అన్నిసార్లు మూలలను సరిచేయలేని ప్రాంతాల్లో స్థలాలు ఉంటాయి.

మధ్యేమార్గాలు ఉన్నాయి..

తూర్పు,పడమర,ఉత్తర,దక్షిణ దిక్కులకు కాకుండా.. ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి మూలలకు కాకుండా కూడా అనేక స్థలాలు ఉంటాయి. హైదరాబాద్‌లో స్థలం దొరకడమే కష్టం అయితే వాస్తు ప్రకారం కట్టడం ఎంతవరకు సాధ్యం అని వాపోతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో శాస్త్రంలో కూడా కొన్ని మధ్యేమార్గాలు ఉన్నాయి.

స్థలం దిక్కులకు, మూలలకు ఉన్నా, లేకపోయినా ఇతర సదుపాయలు, సౌకర్యాల రీత్యా ఇళ్లు కట్టుకోవచ్చని కొన్ని వాస్తు గ్రంథాలలో ఉంది.

వాస్తు ప్రధాన ఉద్దేశం మనిషి సౌకర్యంగా, సుఖంగా బతకడానికి, ప్రాణాధారమైన పరిశుభ్రమైన గాలికి, నీటికి కొదవ లేకుండా ఉండాలనే. అవకాశం ఉన్నంతవరకు కట్టుకోవచ్చు. ఈ విషయంలో వాస్తు పండితుల సలహాలు తీసుకోవడం మేలు చేస్తుంది.

ఇంటి చుట్టూ ఖాళీ స్థలం వదలడంతో పాటూ ఇతర వాస్తు సూత్రాలకు అనుగుణంగా ఇల్లు కట్టుకోవచ్చు అని కొన్ని గ్రంథాల్లో సమరాంగణ సూత్రధారణగా చెప్పారు. దీనినే పంక్తిశోభ అంటారు. అంటే స్థలం ముందు ఉన్న రహదారికి అభిముఖంగా అన్నమాట. స్థలం దిక్కులకు లేకపోయినా ఈవిధంగా కట్టుకోవచ్చు. ఇది శాస్త్ర సమ్మతమేనని పెద్దలు, అనుభవజ్ఞుల మాట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని