ఇల్లు కొనడమా.. అద్దెకు ఉండడమా..

ఇల్లు కొనడమా? అద్దెకు ఉండడమా? నగరవాసులు కొంతమంది ఏటూ తేల్చుకోలేక తర్జనభర్జన పడుతుంటారు. ఇన్నాళ్లు అద్దె ఇల్లే అర్థికంగా కలిసి వస్తుందని లెక్కలు వేసుకున్నవారు సైతం గృహరుణ రేట్లు తగ్గడంతో కొనడమే మేలని భావిస్తున్నారు.

Updated : 18 Dec 2021 05:51 IST

కొనుగోలుదారుల్లో తర్జనభర్జన

ఈనాడు, హైదరాబాద్‌

ఇల్లు కొనడమా? అద్దెకు ఉండడమా? నగరవాసులు కొంతమంది ఏటూ తేల్చుకోలేక తర్జనభర్జన పడుతుంటారు. ఇన్నాళ్లు అద్దె ఇల్లే అర్థికంగా కలిసి వస్తుందని లెక్కలు వేసుకున్నవారు సైతం గృహరుణ రేట్లు తగ్గడంతో కొనడమే మేలని భావిస్తున్నారు. మరికొందరు అద్దె కట్టే బదులు కాస్త ఎక్కువ అయినా ఈఎంఐ చెల్లిస్తే సొంతింట్లో ఉన్నామనే భరోసా ఉంటుందని కొనుగోలు చేస్తున్నారు. మిగతా నగరాలతో చూస్తే ఇక్కడ ఇళ్ల అద్దెలు, ఈఎంఐ దాదాపుగా సమానంగా ఉండటం వల్ల కూడా కొనేందుకు మొగ్గుచూపుతున్నారు.
హైదరాబాద్‌లో మంచి ఇల్లు కొనుగోలు చేయాలంటే కుటుంబ వార్షికాదాయం ఎంత ఉండాలి? రూ.8లక్షలు ఉంటే రుణం ద్వారా ఈఎంఐ చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఇంతకంటే తక్కువ ఆదాయం ఉన్నవారు సైతం కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. అయితే ఇంటి విస్తీర్ణం, నివాస ప్రాంతంపై రాజీ పడాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు కచ్చితంగా ఇల్లు కొనుగోలు చేయవచ్చు. వీరు ఆలోచించే పనే లేదంటున్నారు నిపుణులు.

ఏ ధరల్లో ఉన్నాయ్‌

వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇంటి కొనుగోలు ధర, అద్దె చెల్లింపును పరిగణనలోకి తీసుకుంటే..సగటు ఇంటి కొనుగోలు ధర హైదరాబాద్‌లో అటుఇటుగా రూ.50 లక్షల వరకు ఉంది. సగటు అద్దెలు చూస్తే హైదరాబాద్‌లో రెండు పడక గదులకు రూ.15వేలుగా ఉంది. దీనికి మరో రూ.ఐదు వేలు జోడిస్తే ఈఎంఐ చెల్లించవచ్చు. కాకపోతే పని ప్రదేశానికి కాస్త దూరంగా ఉండాల్సి వస్తుంది.

ఎన్నేళ్లు పొదుపు చేయాలి

ఇల్లు కొనుగోలు చేయాలంటే బ్యాంకులు వందశాతం రుణాలు ఇవ్వవు. ఆ ఇంటి విలువలో కనీసం 20 శాతమైనా సొంతంగా సమకూర్చుకోవాలి. డౌన్‌ పేమెంట్‌ కింద చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ మొత్తాన్ని వేర్వేరు రూపాల్లో పొదుపు చేసి మదుపు చేస్తుంటారు. కుటుంబ వార్షికాదాయంలో 25 శాతం పొదుపు చేస్తే హైదరాబాద్‌లో ఇల్లు కొనుగోలుకు కావాల్సిన డౌన్‌ పేమెంట్‌ కోసం మూడున్నరేళ్లు చాలు.

భారమైతే..

కొనుగోలు చేసిన తర్వాత కుటుంబ అవసరాలు పెరిగి ఈఎంఐ చెల్లించడం భారమైతే.. ఇంటిని విక్రయించి భారం దించుకోవచ్చు. మొదటి ఐదేళ్ల పాటూ ఇంటికి ధర పెరగడమే తప్ప తగ్గడం సిటీలో లేదు. మంచి రేటుకే విక్రయించి.. మరోచోట తక్కువ ధరలో వచ్చే ఇంటిని, స్థలాన్ని కొనుగోలు చేయవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని