గచ్చు.. మెచ్చేలా అచ్చు
అందంతో పాటు మన్నిక కోసం స్టాంప్డ్ కాంక్రీట్ వినియోగం
ఈనాడు, హైదరాబాద్
గచ్చు అనగానే ప్రస్తుతం ఎక్కువగా టైల్స్‌నే ఉపయోగిస్తున్నారు. అన్నిచోట్లా ఇవి అనుకూలం కాదు. ముఖ్యంగా వాహనాలు తిరిగే మార్గం, ర్యాంపులు, సెల్లార్లు, ఈతకొలను పక్కన, ఎండకు ఎండి, వానకు తడిసే ప్రదేశాల్లో టైల్స్ త్వరగా పాడయ్యే వీలుంది. ఇలాంటిచోట ప్రస్తుతం స్టాంప్డ్ కాంక్రీట్ వినియోగిస్తున్నారు. మన్నికతో పాటూ మనకు కావాల్సినట్టుగా డిజైన్ చేసుకునే వీలుండటం ఇందులో ప్రత్యేకత.
విదేశాల్లో స్టాంప్డ్ కాంక్రీట్‌ను విరివిగా ఉపయోగిస్తుంటారు. పాదబాటల్లో సైతం వేస్తుంటారు. అక్కడి నుంచి మన దగ్గరికి వచ్చి దశాబ్దాలు అవుతున్నా ఇటీవలే వినియోగం పెరిగింది. వాణిజ్య భవనాలు, హోటళ్ల ప్రాంగణాల ముందుభాగంలో, ర్యాంపుల్లో స్టాంప్డ్ కాంక్రీట్ వేయిస్తున్నారు. గృహ సముదాయాల్లో వేయించుకునేందుకు క్రమంగా మొగ్గుచూపుతున్నారు.
ఇలా వేస్తారు... : నిర్ణీత మందం మేరకు మొదట రెడీ మిక్స్ కాంక్రీట్ వేస్తారు. దానిపైన ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్(పీసీసీ)తో కావాల్సినట్టుగా అచ్చు పోస్తారు. రాతి మాదిరి, టైల్ మాదిరి ఎలా కావాలంటే అలా అచ్చుపోస్తారు. వారం తర్వాత లిక్విడ్ ఫోమ్ బ్రష్ చేస్తారు. సీలర్ కోటింగ్‌తో మంచి మెరుపు వస్తుంది. కావాల్సిన రంగుల్లోనూ డిజైన్ చేయించుకోవచ్చు. ఫ్లోరింగ్ కంటే తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తి చేయవచ్చు. ప్రత్యేక పద్ధతిలో అచ్చు వేసే విధానంతో సాధారణం కంటే మరింత దృఢత్వం వస్తుందని ఎంతోకాలంగా స్టాంప్డ్ కాంక్రీట్ పనులు చేస్తున్న శ్యామ్ ‘ఈనాడు’తో అన్నారు.
టెర్రస్ పైన కూడా.. : ఈ మధ్య టెర్రస్‌ను అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఇందుకోసం సైతం స్టాంప్డ్ కాంక్రీట్ ఉపయోగిస్తున్నారు. టెర్రస్‌పై కాబట్టి స్లాబ్‌పై ఎక్కువ బారం పడకుండా 35 ఎంఎం మందంలో ఫ్లోరింగ్ చేస్తున్నారు. అదే రహదారి, పార్కింగ్, సెల్లార్, ర్యాంపులకు 60 ఎంఎం మందంతో పని పూర్తి చేస్తున్నారు.
Advertisement