మూడు పదులకే ముచ్చటైన గూడు
ఈనాడు, హైదరాబాద్: బాధ్యతలన్నీ తీరాక సొంతిల్లు కట్టుకుందాం.. ఇది ఒకప్పటి మాట.. ఉద్యోగంలో చేరగానే కోరుకున్న ఇంటిని సొంతం చేసుకుందాం అంటోంది ఈతరం. ఉన్నత చదువులు, ఐటీ, ఫార్మా రంగంలో ఉద్యోగావకాశాలు.. పెరిగిన ఆదాయాలతో హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో మదుపు చేసే సగటు వయసు 35 ఏళ్లకు తగ్గిందని..ఒకప్పుడు ఇది 50 ఏళ్లు ఉండేదని తెలంగాణ క్రెడాయ్ అంటోంది. అనరాక్ సంస్థతో కలిసి వేర్వేరు రంగాల పురోగతిపై రూపొందించిన నివేదికలో స్థిరాస్తి రంగం గురించి కూడా ప్రస్తావించింది. నివేదికలోని ప్రధాన అంశాలు..
* 2017కి ముందు హైదరాబాద్ మార్కెట్‌లో నిర్మాణాల పరంగా సరఫరా క్రమబద్ధంగా ఉండేది. ఎప్పుడూ ఇళ్లకు డిమాండ్ కన్పించేది. కొవిడ్ తర్వాత ఈ పోకడలో కొంత మార్పులు వచ్చాయి.
* కొవిడ్ తర్వాత సొంతింటి ప్రాధాన్యతను గుర్తించడం.. తక్కువ వడ్డీరేట్లు ఉండటం, అభివృద్ధిదారులు రాయితీలు ఇవ్వడంతో ఇళ్ల విక్రయాలు పెరిగాయి. దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ మార్కెట్ వేగంగా కోలుకుంది.
* ప్రత్యేకంగా ఆర్థిక కేంద్రాలుగా ఉన్న ప్రాంతాల్లో బహుళంతస్తుల నివాసాలకు డిమాండ్ పెరిగింది. పశ్చిమ, ఉత్తర నగరం వైపు నివాసానికి ఎక్కువగా మొగ్గు కన్పించింది. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం.
* 2020 నుంచి ఈ ఏడాది మూడో త్రైమాసికం వరకు పశ్చిమ హైదరాబాద్‌దే ఆధిపత్యం కన్పించింది. 60 శాతం సరఫరా, డిమాండ్ 62 శాతం వరకు ఉంది. ఉత్తరం సరఫరా, డిమాండ్ వాటా 34 శాతంగా ఉంది. సెంట్రల్‌లో ఒక శాతం డిమాండ్ ఉండగా.. తూర్పు వైపు 2 శాతం, దక్షిణం వైపు 3 శాతం సరఫరా, డిమాండ్ ఉంది.
* ఐటీ, ఐటీ ఆధారిత, ఫార్మా రంగాల నుంచి ఉపాధి అవకాశాలు, ఆదాయాలు బాగుండటంతో రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల లోపు ఇళ్లకు, రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్ల విలువైన ఇళ్లకు అధిక డిమాండ్ కన్పించింది. గత కొన్నేళ్లలో ఈ రెండు విభాగాల్లోనే 75 శాతం సరఫరా ఉంటోంది.
* శివార్లలో కొత్త పరిశ్రమలు వస్తుండటంతో చిన్న ఇళ్లు, అందుబాటు ధరలో ఇళ్ల అవసరం ఉంది. ఈ విభాగంలో నివాసాల కొరత కన్పిస్తోంది.
* ఆవాసాల ధరలు గత ఐదేళ్లుగా 5 శాతం నిలకడగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం చదరపు అడుగు సగటు ధర రూ.4240గా ఉంది. ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉన్నాయి. పశ్చిమ హైదరాబాద్‌లో సగటు కంటే ఎక్కువ ధరలు ఉండగా.. మిగతా ప్రాంతాల్లో తక్కువ ఉన్నాయి.
* 2020 మూడో త్రైమాసికంలో రూ.40 లక్షల లోపు ఇళ్ల సరఫరా 27 శాతం ఉంటే ఈ ఏడాది మూడో త్రైమాసికానికి వచ్చేసరికి 11 శాతానికి పడిపోయింది. రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల మధ్య ఉన్న ఇళ్ల సరఫరా 61 నుంచి 42 శాతానికి తగ్గింది. అదే సమయంలో రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర ధరల మధ్య ఇళ్ల సరఫరా 12 నుంచి 35 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రూ.కోటిన్నర నుంచి రూ.2.50 కోట్ల మధ్య ఉన్న ఇళ్ల సరఫరా 11 శాతం ఉండగా.. ఆపై ఇళ్ల వాటా 3 శాతంగా ఉంది.
Advertisement