చుట్టూ చూస్తున్నారు!
తక్కువ స్థలంతో ఎక్కువ కేంద్రాలు..
ఆఫీస్ స్పేస్ కోసం సంస్థల వెతుకులాట
పరిష్కారంగా ‘హబ్ అండ్ స్పోక్’ విధానం
ఈనాడు డిజిటల్, హైదరాబాద్
ఓ పెద్ద ప్రాంగణం.. అద్దాల అంతస్తుల మేడలు.. అంగరంగ వైభవంగా కనిపించే కార్యాలయ వాతావరణం. ఇదంతా కొవిడ్‌కి ముందు.. మరి ఇప్పుడు..? చిన్న కార్యాలయం.. తక్కువ ప్రాంతం.. ఎక్కువ కేంద్రాలు.. అదీ ఒక్క చోట కాదు నగరం చుట్టూరా. కొవిడ్ తర్వాత దాదాపు అన్ని ఎంఎన్‌సీలు, చిన్న తరహా సంస్థలు ఇదే ధోరణిలో ఆలోచిస్తున్నాయి. తీరా కార్యాలయ స్థలం దొరక్క ఆగిపోతున్నాయి. ఇది ఇప్పుడు హైదరాబాద్ ఆఫీస్ స్పేస్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తోన్న అంశమని స్థిరాస్తి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కార్యాలయం ఏర్పాటు చేసుకునే వాతావరణం కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడంతో సంస్థల లక్ష్యం నెరవేరట్లేదని.. 2022 కొత్త ఏడాదిలోనైనా ఆఫీస్ స్పేస్ అభివృద్ధిపై దృష్టి సారిస్తే ఎక్కువ కార్యాలయాల ఏర్పాటుతో పాటు దానిపై ఆధారిత ఉపాధి పెరగడం, నగరం నలుదిక్కుల ప్రగతి లక్ష్యాన్నీ చేరుకోవచ్చని చెబుతున్నారు.
ఎలా అంటే..? : ఉదాహరణకు గచ్చిబౌలి, హైటెక్‌సిటీ లాంటి ప్రాంతాల్లో గతంలో 10లక్షల చదరపు అడుగుల్లో ఓ సంస్థ ఉందనుకుంటే.. ఇప్పుడు ఆ సంస్థను అక్కడి నుంచి తరలించి ఉప్పల్‌లో 2లక్షల చదరపు అడుగులు, కొంపల్లి వద్ద 2 లక్షల చదరపు అడుగులు.. ఇలా మరో నాలుగు ఇతర చోట్ల చిన్నచిన్న కేంద్రాల్ని ఏర్పాటు చేసేందుకు సంస్థలు యోచిస్తున్నాయి. తద్వారా ఖర్చు తగ్గడంతో పాటు, ప్రస్తుతం కొవిడ్ ప్రభావంతో నిర్వహిస్తోన్న హైబ్రిడ్ మోడల్ పనులకూ ఇది దోహదపడుతుందంటున్నారు. ‘హబ్ అండ్ స్పోక్’ మోడల్‌గా చెప్పుకొనే ఈ విధానం ద్వారా పెద్ద సంస్థలతో పాటు చిన్న సంస్థలకూ పొదుపు కలిసొస్తుంది. దానికి తోడు నగరం నలువైపులా అభివృద్ధి కావడంతో నగరంలో ప్రధాన సమస్య ట్రాఫిక్‌కు మోక్షం లభిస్తుంది. విశ్వనగర లక్ష్యమూ నెరవేరనుందని నిపుణుల అభిప్రాయం.
Advertisement