కొలువుండే చోటులో హైదరాబాద్‌ టాప్‌

కొవిడ్‌తో ఐటీ కార్యాలయాలు అత్యధికం ఇంటి నుంచి పనికి అవకాశం కల్పించాయి. రెండేళ్లుగా ఇవి చాలా వరకు ఖాళీగా ఉంటున్నాయి. కొత్త రకం వైరస్‌ ఒమిక్రాన్‌తో ఎంతకాలం ఈ పరిస్థితి ఉంటుందో ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. మూడో వేవ్‌ తగ్గాక

Updated : 15 Jan 2022 02:19 IST

ఈనాడు, హైదరాబాద్‌  

కొవిడ్‌తో ఐటీ కార్యాలయాలు అత్యధికం ఇంటి నుంచి పనికి అవకాశం కల్పించాయి. రెండేళ్లుగా ఇవి చాలా వరకు ఖాళీగా ఉంటున్నాయి. కొత్త రకం వైరస్‌ ఒమిక్రాన్‌తో ఎంతకాలం ఈ పరిస్థితి ఉంటుందో ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. మూడో వేవ్‌ తగ్గాక కార్యాలయాలు హైబ్రిడ్‌ విధానంలో తెరుచుకునే అవకాశం ఉంది. వారంలో సగం రోజులు కార్యాలయంలో పనిచేస్తే.. మిగతా సగం రోజులు ఇంటి నుంచి పనికి అవకాశం కల్పించే సూచనలు ఉన్నాయని ఈ రంగంలోని నిపుణులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ దేశవ్యాప్తంగా గత ఏడాది కార్యాలయాల నిర్మాణాల సరఫరా వార్షికంగా 18 శాతం వృద్ధి కనిపించడం చెప్పుకోదగ్గ పరిణామం. లీజింగ్‌ సైతం 16 శాతం వృద్ధి చెందిందని సీబీఆర్‌ఈ నివేదికలో పేర్కొంది.
దేశంలోకి కొవిడ్‌ ప్రవేశించిన 2020లో లాక్‌డౌన్‌, ఆంక్షల నేపథ్యంలో 35.4 మిలియన్‌ చ.అ. లీజింగ్‌ మాత్రమే జరిగింది. దీన్నుంచి తెరుకుని 2021లో 41 మిలియన్‌ చ.అ.వరకు పెరిగింది. హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీ వాటానే 70 శాతంగా ఉంది.

ఎవరు తీసుకుంటున్నారు?

కొవిడ్‌తో డిజిటలైజేషన్‌ ప్రక్రియ వేగవంతం కావడంతో ఐటీ సేవలకు డిమాండ్‌ పెరిగింది. పలు సంస్థలు హైదరాబాద్‌తో పాటూ వేర్వేరు నగరాల్లో డెవలప్‌మెంట్‌, డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. టెక్నాలజీ కార్పొరేట్లే 30 శాతం కార్యాలయాలను లీజు తీసుకుంటున్నాయి. ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌ ఆపరేటర్స్‌ 15 శాతం,  ఇంజినీరింగ్‌, మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీలు 14 శాతం, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) సంస్థలు 13 శాతం, లైఫ్‌ సైన్సెస్‌ సంస్థలు 6 శాతం భవనాలను లీజుకు తీసుకున్నాయి.

హైదరాబాద్‌లో ఇలా..

నగరంలో కొవిడ్‌ ముందు 2019లో రికార్డు స్థాయిలో కోటి చ.అ. పైన కార్యాలయాల భవనాల నిర్మాణాలు చేపట్టారు. 2020లో లాక్‌డౌన్‌తో చాలా వరకు తగ్గినా.. 2021లో బాగా పుంజుకుంది. ఇప్పటి వరకు సిటీలో కార్యాలయాల భవనాల విస్తీర్ణం 95 మిలియన్‌ చ.అ.కు చేరుకుంది.
ఇందులో సెజ్‌ల వాటానే 59 శాతంగా ఉంది. ఇందులో ఐటీ భవనాల వాటా 29 శాతం. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌, ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌ ఆపరేటర్స్‌, టెక్నాలజీ సంస్థలు పెద్ద ఎత్తున కార్యాలయాల భవనాలను లీజుకు తీసుకుంటున్నాయి.

రూ.10వేల కోట్లకు పైగా పెట్టుబడులు

దేశంలో కార్యాలయ భవనాలకు డిమాండ్‌ ఉండటంతో ఈ విభాగంలో సంస్థాగత మదుపర్లతో పాటూ డెవలపర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. గత ఏడాది రూ.10,378 కోట్లు మూల ధన పెట్టుబడులు పెట్టారు.  ఇందులో 40 శాతం వరకు ముంబయికి వెళ్లగా.. మిగతా మొత్తం బెంగళూరు, హైదరాబాద్‌, దిల్లీలోని కార్యాలయాల భవనాలపై పెట్టుబడి పెట్టారు. వాణిజ్యానికి ఉపయోగపడే భూములు, కార్యాలయాల భవనాలపైనే పెట్టుబడి పెట్టారు.

తక్కువ విస్తీర్ణంలో..  

సాధారణంగా చిన్న కంపెనీలు 10వేల చ.అ. లోపు కార్యాలయం ఉంటే చాలంటాయి. మధ్య తరహా సంస్థలైతే 50వేల చ.అ. వరకు వెళతాయి. 2021లో ఈ రెండింటి వాటానే 85 శాతం ఉండటం గమనించదగ్గ విషయం. అంతక్రితం సంవత్సరం వీటి వాటా 81 శాతం మాత్రమే.

లక్ష చ.అ.పైన విస్తీర్ణాన్ని పెద్ద సంస్థలు కోరుకుంటాయి. కొవిడ్‌తో విస్తీర్ణాన్ని తగ్గించుకునేందుకు మొగ్గు చూపడంతో  ఈ విభాగంలో లీజులు తగ్గాయి. 2020లో 9 శాతం ఉంటే 2021 నాటికి 7 శాతానికి పడిపోయాయి.

ఎక్కువ విస్తీర్ణంలో కార్యాలయాల లీజింగ్‌లు బెంగళూరు, హైదరాబాద్‌, దిల్లీ, పుణె నగరాలు ఆధిపత్యం కనబరిచాయి.

సరఫరా పెరిగింది..

కొవిడ్‌తో నిర్మాణాలు ఆగిపోవడంతో 2020లో 42.1 మిలియన్‌ చ.అ. సరఫరా మాత్రమే  ఉంది. 2021లో పూర్తి కావడంతో సరఫరా కాస్తా 50 మిలియన్‌ చ.అ.కు పెరిగింది. గత ఏడాది చివరి త్రైమాసికంలో 15.5 మిలియన్‌ చ.అ. భవనాలు పూర్తైతే అందులో హైదరాబాద్‌, పుణె, బెంగళూరు నగరాల్లోని భవనాల వాటానే 70 శాతంగా ఉంది. మొత్తంగా  ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కార్యాలయాల భవనాల విస్తీర్ణం 773 మిలియన్‌ చ.అ.లకు చేరుకుంది.

మనం ఎక్కడ ఉన్నాం?

2021 ముగింపు నాటికి కార్యాలయాల భవనాల పరంగా బెంగళూరు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత దిల్లీ, ముంబయి నగరాలు ఉన్నాయి. హైదరాబాద్‌ నాలుగో స్థానంలో ఉంది. విస్తీర్ణం పరంగా బెంగళూరుతో పోలిస్తే నగరంలో ఇప్పటివరకు నిర్మించిన కార్యాలయాల భవనాలు సగం మాత్రమే. ఈ విభాగంలో ఇక్కడ నిర్మాణాలకు డిమాండ్‌ ఉంది. ఇప్పటివరకు నగరాల వారీగా మొత్తం ఆఫీస్‌ స్టాక్‌ను చూస్తే..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని