ఓసీ రాకముందు నిర్వహణ రుసుం అడగరాదు

నిర్మాణంలో ఉండగానే ఎక్కువ మంది ఫ్లాట్‌/విల్లాలను కొనుగోలు చేస్తుంటారు. ఆరంభంలో ధర తక్కువ ఉంటుందని.. దశలవారీగా చెల్లించే సౌలభ్యం ఉంటుందని మొగ్గు చూపుతుంటారు.

Updated : 05 Feb 2022 04:50 IST

బిల్డర్‌కు జాతీయ వినియోగదారుల కమిషన్‌ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: నిర్మాణంలో ఉండగానే ఎక్కువ మంది ఫ్లాట్‌/విల్లాలను కొనుగోలు చేస్తుంటారు. ఆరంభంలో ధర తక్కువ ఉంటుందని.. దశలవారీగా చెల్లించే సౌలభ్యం ఉంటుందని మొగ్గు చూపుతుంటారు. గడువు లోపల నిర్మాణం పూర్తి చేసి స్థానిక సంస్థల నుంచి నివాస యోగ్య ధృవీకరణ పత్రం(ఓసీ) రాగానే ఆయా నివాసాలను కొనుగోలుదారులకు బిల్డర్‌ అప్పగించాలి. అయితే నిర్మాణం  ఆలస్యం కావడం, కొన్నిసార్లు ధృవీకరణ పత్రం పొందడంలో జాప్యం, ఇతరత్రా కారణాలతో అంతకంటే ముందే కొనుగోలుదారులు నివాసాల్లోకి దిగిపోతుంటారు. ఇక్కడే మెయింటనెన్స్‌ ఛార్జీల చెల్లింపుపై బిల్డర్‌, కొనుగోలుదారుల మధ్య వివాదాలు తలెత్తుతుంటాయి. ఓసీ వచ్చే వరకు ఆయా ఫ్లాట్లలో నివసించేవారిని నిర్వహణ రుసుం(మెయింటనెన్స్‌) చెల్లించాలని డిమాండ్‌ చేయరాదని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌(ఎన్‌సీడీఆర్‌సీ) తీర్పు చెప్పింది. బెంగళూరుకు చెందిన 15 మంది గృహ కొనుగోలుదారులు కమిషన్‌ను ఆశ్రయించడంతో ఈ మేరకు ఇటీవల ఆదేశాలు వెలువరించింది. ‘ఓసీ రాలేదంటే ప్రాజెక్ట్‌ ఇంకా పూర్తి కాలేదని.. వాగ్దానం చేసిన అన్ని సేవలు సమకూర్చలేదని అర్ధం. అలాంటప్పుడు నిర్వహణ ఛార్జీలు విధించకూడదు’ అని ఆదేశాల్లో పేర్కొంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని