ధర తక్కువ.. సౌకర్యం ఎక్కువ

ఇళ్ల నిర్మాణంలో కొత్త పోకడలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ధరలు పెరగడం మాత్రమే చూస్తుండగా, ఈసారి తగ్గేలా ఉండటం కొనుగోలుదారుల్లో ఆసక్తిని పెంచుతోంది. తక్కువ ధరలో ఇళ్లు అందించేందుకు కామన్‌ ఫ్లోర్‌

Updated : 19 Feb 2022 04:39 IST

నగరంలో కామన్‌ ఫ్లోర్‌ ఇళ్ల విధానం

ఈనాడు, హైదరాబాద్‌: ఇళ్ల నిర్మాణంలో కొత్త పోకడలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ధరలు పెరగడం మాత్రమే చూస్తుండగా, ఈసారి తగ్గేలా ఉండటం కొనుగోలుదారుల్లో ఆసక్తిని పెంచుతోంది. తక్కువ ధరలో ఇళ్లు అందించేందుకు కామన్‌ ఫ్లోర్‌ ఇళ్ల నిర్మాణానికి బిల్డర్లు శ్రీకారం చుట్టారు. నగరంలో సొంతిల్లు ఇప్పటికీ ఎంతోమంది కల. పెరిగిన భూముల ధరలతో కొనగలమో లేదోననే ఆందోళన సామాన్య, మధ్యతరగతి వాసుల్లో రోజురోజుకు పెరుగుతోంది. రెండు పడక గదుల ఇల్లు కావాలంటే నగరంలో రూ.కోటి, శివార్లలో రూ.50 లక్షల వరకు పెట్టాల్సిందే. విల్లాలు రూ.కోటికి తక్కువ ఎక్కడ విక్రయించడం లేదు. వార్షికాదాయం రూ.8 లక్షలు ఉంటే తప్ప ఇల్లు కొనలేని పరిస్థితి. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని కొందరు బిల్డర్లు కామన్‌ ఫ్లోర్‌ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. అవుటర్‌ బయట ఈ ఇళ్లను కడుతున్నారు.

ఎలా ఉంటుంది?

శివార్లలో 200 గజాల్లో వ్యక్తిగత ఇల్లు కొనాలన్నా రూ.కోటి అవుతోంది. ఇదే స్థలంలో నాలుగు భాగాలు(పోర్షన్లు) వచ్చేలా కడితే? రూ.25 లక్షలకే ఒకటి వస్తుంది. చెప్పాలంటే ప్రభుత్వ క్వార్టర్లలోని ఇళ్ల మాదిరి. 200-300 గజాల విస్తీర్ణంలో రెండంతస్తుల కడతారు. మధ్యలో మెట్లు ఉంటాయి. మొదటి అంతస్తులో రెండు ఫ్లాట్లు, రెండో అంతస్తులో రెండు ఫ్లాట్లు ఉంటాయి. కింద పార్కింగ్‌ సదుపాయం కల్పిస్తారు. కేవలం రెండంతస్తులు మాత్రమే వేస్తారు. ఒక్కోటి 800 చదరపు అడుగుల విస్తీర్ణం లోపే ఉంటుంది. భూమి విస్తీర్ణం పెరిగే కొద్దీ ఇంటి ధర పెరుగుతుంది. జి+1 కడితే మరింత తక్కువ ధరకే వస్తుంది. వీటినే కామన్‌ ఫ్లోర్‌ ఇళ్లు అని, ఇండిపెండెంట్‌ ఫ్లోర్‌ ఇళ్లు అని పిలుస్తున్నారు.

అటుపైకి.. ఇటు కిందకు..

నగరంలో భూముల ధరలు పెరగడంతో బిల్డర్లు అంతస్తులు మీద అంతస్తులు పెంచి కడుతున్నారు. సిటీలో 50 అంతస్తుల గృహ నిర్మాణాలు ప్రస్తుతం వస్తున్నాయి. వీటిలో ధరలు రూ.కోట్లలోనే పలుకుతున్నాయి. దీనికి పూర్తి భిన్నంగా ఒకట్రెండు అంతస్తుల్లోనే నాలుగు పోర్షన్లు కట్టే పోకడ నగరంలో మొదలైంది.

మొగ్గు  ఉంటుందా?

కొనుగోలుదారుల నుంచి వీటికి స్పందన ఉంటుందా? చాలామంది అపార్ట్‌మెంట్లలో కొనేందుకు కొంత విముఖత చూపిస్తుంటారు. వ్యక్తిగత ఇళ్ల కోసమే చూస్తుంటారు. వీటి ధరలు పెరగడంతో కామన్‌ ఫ్లోర్‌ ఇళ్ల వైపు చూస్తున్నారు. కొందరు విడిగా ఒక్కోటి తీసుకుంటే మరికొందరు కింద పైన కలిపి డూప్లెక్స్‌ మాదిరి కట్టించుకుంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని