సంపన్నులు వేటిలో పెట్టుబడి పెడుతున్నారు?

దేశంలో అత్యంత ధనవంతుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఏంటి వీరి సంపద రహస్యం? తమ ఆదాయాన్ని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు? మన దేశంలో వీరు ఇందుకు స్థిరాస్తి రంగాన్నే ఎంచుకుంటున్నారు. దాదాపు 60 శాతం ఆదాయాన్ని ఇళ్లు, వాణిజ్య, కార్యాలయాల భవనాలపై వెచ్చించి అధిక రాబడి పొందుతూ సంపదను మరింత పెంచుకుంటున్నారు.

Updated : 05 Mar 2022 06:37 IST

దేశంలో అత్యంత ధనవంతుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఏంటి వీరి సంపద రహస్యం? తమ ఆదాయాన్ని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు? మన దేశంలో వీరు ఇందుకు స్థిరాస్తి రంగాన్నే ఎంచుకుంటున్నారు. దాదాపు 60 శాతం ఆదాయాన్ని ఇళ్లు, వాణిజ్య, కార్యాలయాల భవనాలపై వెచ్చించి అధిక రాబడి పొందుతూ సంపదను మరింత పెంచుకుంటున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

దేశంలో ముంబయి తర్వాత అత్యంత శ్రీమంతులు ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది.  ఇక్కడ 2016లో 314 మంది శ్రీమంతులు ఉంటే 2021 నాటికి 467కి పెరిగింది. వీరి సంపద పెరగడానికి స్థిరాస్తుల్లో పెట్టుబడులే కారణం.  ఎక్కడ మార్కెట్‌ బాగుంటే అక్కడ మదుపు చేస్తుంటారు.

మదుపర్లు పెరిగారు..

ఎక్కడ మదుపు చేసినా రెట్టింపు కావడానికి ఏడెనిమిదేళ్లు పడుతోంది. స్టాక్స్‌లోనూ మంచి రాబడికి అవకాశం ఉన్నా వీటిపై అవగాహన లేకపోవడం, రిస్క్‌ అధికంగా ఉండటంతో మనవాళ్లు స్థిరాస్తులను నమ్ముకుంటున్నారు. ఇక్కడ కళ్లముందే స్థిరాస్తి కనబడుతుంది. పెట్టుబడి పెట్టిన అసలుకు ఢోకా లేదు. పైగా సగటున మూడేళ్లలో రెట్టింపుతో సంపద పెరుగుతోంది. ప్రాంతాన్ని బట్టి కొన్నిచోట్ల ఇంతకంటే ముందే పెరిగితే..మరికొన్నిచోట్ల కొంత ఎక్కువ కాలం పడుతోంది. పెరగడం మాత్రం కళ్ల ముందు కనబడటంతో ఒకర్ని చూసి ఒకరు ఇటువైపు పెట్టుబడి పెడుతున్నారు. మొదట్లో హైదరాబాద్‌ మార్కెట్‌లో 90 శాతం వరకు సొంతంగా ఉండేందుకు ఇళ్లు కొనేవారు. స్థలాలు కొని ఇళ్లు కట్టుకునేవారు. ఇప్పుడు పెట్టుబడి దృష్ట్యా కొనేవారి శాతం హైదరాబాద్‌లో పెరిగింది. వీరి సంఖ్య పాతిక శాతం పైనే ఉంటుందని రియల్టర్లు అంటున్నారు. ఆకాశహర్మ్యాల్లో  ఎక్కువగా ఇన్వెస్టర్లే కొనుగోలు చేస్తున్నారు. నాలుగేళ్లలో నిర్మాణం పూర్తయ్యేనాటికి పెట్టుబడి విలువ రెట్టింపు అవుతుంది అనేది వీరి అంచనా.  ఇదివరకే ఇళ్లు ఉన్నవారు రెండో ఇల్లు కొంటున్నారు. కొవిడ్‌ ముందుతో పోల్చితే తర్వాత అంచనాలకు మించి ఇళ్లు, స్థలాలు, భూముల ధరలు హైదరాబాద్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరిగాయి.

మూడేళ్లలో రెట్టింపు 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్‌, చుట్టుపక్కల రియల్‌ ఎస్టేట్‌ పుంజుకుంది. ఐదారేళ్లుగా మార్కెట్‌ వృద్ధి పథంలో పయనిస్తోంది. మధ్యలో కొవిడ్‌, ఇతరత్రా కొన్ని ఇబ్బందులతో నెమ్మదించినా వేగంగా పూర్వ స్థాయికి చేరుకుంది. దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే కొవిడ్‌ ఇబ్బందుల నుంచి రియల్‌ ఎస్టేట్‌ రంగం త్వరగా బయటపడింది. డబ్బులు ఉన్నవారంతా కొంతకాలంగా భూములపైనే పెట్టుబడులు పెడుతున్నారు. స్టాక్స్‌, బంగారంతో పాటూ స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణంగా కొన్నేళ్లుగా హైదరాబాద్‌ మార్కెట్‌లో క్రయ విక్రయాలు నిరాటంకంగా సాగుతున్నాయి. సగటున మూడేళ్లలోనే స్థిరాస్తుల విలువలు ఇక్కడ రెట్టింపు అవడంతో శ్రీమంతుల నుంచి సామాన్యుల వరకు అందరి దృష్టి కొంతకాలంగా స్థిరాస్తిపై పడింది. ప్రస్తుతం వ్యవసాయ భూముల లావాదేవీలు అధికంగా జరుగుతున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని