స్టీల్‌ ధరల పెంపుపై భగ్గుమన్న క్రెడాయ్‌

స్టీల్‌ ధరలను అనూహ్యంగా పెంచడంపై కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా(కెడ్రాయ్‌) ఉత్పత్తిదారులపై భగ్గుమంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం బూచిగా చూపి ఇన్‌ఫుట్‌ కాస్ట్‌

Updated : 12 Mar 2022 06:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: స్టీల్‌ ధరలను అనూహ్యంగా పెంచడంపై కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా(కెడ్రాయ్‌) ఉత్పత్తిదారులపై భగ్గుమంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం బూచిగా చూపి ఇన్‌ఫుట్‌ కాస్ట్‌ కంటే అధికంగా ధరలు పెంచడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. శంషాబాద్‌ నొవాటెల్‌ హోటల్‌లో శుక్రవారం జరిగిన క్రెడాయ్‌ టెక్‌కాన్‌22 తొలి సదస్సు సందర్భంగా క్రెడాయ్‌ జాతీయ ఉపాధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి మాట్లాడుతూ.. ముడిసరుకు ధరలు మరలా పెరగడం రియల్‌ ఎస్టేట్‌ రంగానికి పెద్ద గుదిబండ అన్నారు. కొవిడ్‌ నుంచి కోలుకుని, ధరల పెరుగుదలను తట్టుకుని నిలబడుతున్న ఈ సమయంలో ముడిసరకుల ధరలు మళ్లీ పెరగడమంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైందన్నారు. ‘రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం అనంతరం  ధరలు అనూహ్యంగా పెరిగాయి. నిజానికి అంత ఇన్‌పుట్‌ కాస్ట్‌ పెరిగిందా అని ఉత్పత్తిదారులు ఆలోచించాలి.. స్టీల్‌ కిలో రూ.50-60 మధ్యలో ఉన్న ధర రూ.90 వరకు చేరడంతో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం ఉంది. ధరలు ఇంకా పెరుగుతాయనే సంకేతాలు వస్తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌లో ముందు చెప్పిన ధరకే ఫ్లాట్‌ విక్రయించాలి. ముడిసరుకుల ధరలు పెరిగాయని విక్రయ ధర పెంచడానికి అవకాశం లేదు. రెరాలో ఎస్కలేషన్‌ నిబంధన చేర్చాలని క్రెడాయ్‌ తరఫున కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించాం. శుక్రవారం ఇందుకోసం అత్యవసరంగా సమావేశమవుతున్నాం’ అని రాంరెడ్డి అన్నారు.

200 మంది బిల్డర్లు హాజరు

తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించిన క్రెడాయ్‌ టెక్‌కాన్‌22కి దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 200 మంది బిల్డర్లు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచే 120 మంది పాల్గొన్నారని తెలిపారు. చిన్న బిల్డర్లకు సాంకేతిక తోడ్పాటు అందించేందుకు సదస్సు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కొత్తతరం నిర్మాణ సాంకేతికతలు, ఆధునిక మార్కెటింగ్‌ పద్ధతులు, ప్రాజెక్ట్‌ నిర్వహణలో టెక్నాలజీ  వినియోగం తదితర అంశాలపై వక్తలు మాట్లాడారు. కార్యక్రమంలో క్రెడాయ్‌ జాతీయ ఉపాధ్యక్షుడు నరేంద్ర కుమార్‌, జోనల్‌ కార్యదర్శి ధర్మేంద్ర, తెలంగాణ క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ ప్రేంసాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని