ట్రైబ్యునల్‌ వచ్చేనా?

అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసే మున్సిపల్‌ బిల్డింగ్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. ఏళ్లనాటి ప్రతిపాదనను రాష్ట్ర శాసనసభ ఆరేళ్ల క్రితమే ఆమోదించింది. అవసరమైనట్లు జీహెచ్‌ఎంసీ చట్టంలో సవరణలు జరిగాయి.

Updated : 19 Mar 2022 04:49 IST

ఆరేళ్ల క్రితం అసెంబ్లీలో చట్టసవరణ పూర్తి
తాజాగా ఆరు వారాల్లో ఏర్పాటు చేయాలన్న హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు గవర్నర్‌ సైతం పచ్చజెండా ఊపారు. అక్కడి నుంచి ప్రభుత్వానికి వెళ్లిన దస్త్రంపై.. ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదు. ఇటు జీహెచ్‌ఎంసీ, అటు సర్కారు నోరు మెదపట్లేదు. నగరంలో ఇష్టానుసారం అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తుంటే.. ట్రైబ్యునల్‌ ఏర్పాటును ఎన్నేళ్లు నాన్చుతారంటూ తాజాగా సుపరిపాలన వేదిక హైకోర్టును ఆశ్రయించడంతో.. న్యాయమూర్తులు ఆరు వారాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. కనీసం ఇప్పుడైనా ఏర్పాటుకు ఆమోద ముద్ర పడుతుందా అనే ప్రశ్నరేకెత్తుతోంది.

పెరుగుతోన్న కోర్టు కేసులు..
అనుమతి లేని నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం, వివాదాస్పద భూముల్లోని నిర్మాణాలు, ఇతరత్రా నిర్మాణ సంబంధిత కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. వేర్వేరు న్యాయస్థానాల్లో టౌన్‌ప్లానింగ్‌కు సంబంధించి ప్రస్తుతం 8వేలకు పైగా కోర్టు కేసులు పెండింగులో ఉన్నాయి. అవన్నీ పరిష్కారమయ్యేనాటికి అంతకు పదింతల కేసులు కొత్తగా పుట్టుకొస్తాయి. అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టి, బల్దియా చర్యలు తీసుకోకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకునేవారు చాలా మంది ఉంటారు. కొత్తగా వచ్చిన టీఎస్‌బీపాస్‌ విధానంతో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు మార్గం సుగమమైంది. అధికారులకు నోటీసులు లేకుండా కూల్చే అధికారం వచ్చింది. కానీ.. కూల్చివేతలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ బృందాలు విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. వీటన్నింటికీ ట్రైబ్యునల్‌ ఏర్పాటుతోనే పరిష్కారం లభిస్తుందని సుపరిపాలన వేదిక ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఏమిటీ వ్యవస్థ..
జిల్లా స్థాయి విశ్రాంత న్యాయమూర్తులు, డీటీసీపీ, టౌన్‌ప్లానింగ్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారులతో ట్రైబ్యునల్‌ ఏర్పాటవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది బెంచీలు ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక. అందులో జీహెచ్‌ఎంసీకి సంబంధించి ఓ బెంచి ఉంటుంది. భవన నిర్మాణాలకు సంబంధించిన కేసుల విచారణ, తీర్పుల వెల్లడి అక్కడే జరగనుంది. జీహెచ్‌ఎంసీలో ఏర్పాటయ్యే బెంచీలో ఇద్దరు లేదా అంతకు మించి సభ్యులు, ఓ ఛైర్‌పర్సన్‌ను నియమించాలనేది ప్రణాళిక. ప్రతిపాదన దస్త్రంపై ముఖ్యమంత్రి ఆమోదముద్ర పడితే.. 15 రోజుల్లో నియామకం పూర్తవనుంది. ట్యాంక్‌బండ్‌ సమీపంలోని బుద్ధభవన్‌లో దీనిని ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ ఎప్పట్నుంచో ఎదురు చూస్తోంది.

ప్రణాళిక లేకుండా నిర్మాణాలు..
నగరంలో కనీసం రోడ్డు వెడల్పు 30అడుగులు ఉండాలి. ఇప్పటికీ 15, 20 అడుగుల రోడ్లతో కాలనీలు ఏర్పాటవుతున్నాయి. మురుగు, వరదనీటి వ్యవస్థ లేకుండా రాత్రికి రాత్రి పుట్టుకొస్తున్నాయి. వివాదాస్పద భూముల్లో, చెరువుల ఎఫ్‌టీఎల్‌ భూముల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా వెలుస్తున్నాయి. ప్రధాన నగరంలోనూ ప్రణాళిక లేకుండా కాలనీలు వెలుస్తున్నాయంటే.. ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధి ఎప్పుడు సాధ్యమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని