Updated : 19 Mar 2022 04:55 IST

భూమి చిట్టా చెప్పేస్తారు

అంకుర సంస్థ ‘ల్యాండ్‌ డాక్టర్‌’ సరికొత్త ప్రయత్నం

కమల్‌ శంషాబాద్‌లో ఒక స్థలం చూశారు. అక్కడ విల్లా కట్టుకోవాలనేది ఆయన ఆలోచన. కొనబోయే భూమి ఏ జోన్‌లో ఉందో తెలియదు. ప్రయత్నిస్తే తెలుసుకోవచ్చు. కాకపోతే ఎంత సమయం పడుతుందో తెలియదు. అప్పుడే ఠక్కున ‘ల్యాండ్‌ డాక్టర్‌’ గుర్తుకొచ్చాడు. వెంటనే గూగుల్‌ లొకేషన్‌ వివరాలను పంపిస్తే.. పదిహేను నిమిషాల్లో పూర్తి నివేదిక అరచేతిలోకి వచ్చింది. కొనబోయే భూమి కన్జర్వేషన్‌ జోన్‌ పరిధిలో ఉందని.. అక్కడ వ్యవసాయం తప్ప నిర్మాణాలు చేపట్టరాదని తెలుసుకుని వెనక్కితగ్గారు.

ఈనాడు, హైదరాబాద్‌

భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ప్రతి రోజూ వేలల్లోనే లావాదేవీలు జరుగుతుంటాయి. భూయాజమాని, మధ్యవర్తి చెప్పే మాటల మీద విశ్వాసంతో ఎక్కువమంది ముందడుగు వేస్తుంటారు. కొనబోయే స్థిరాస్తికి సంబంధించి ముందే విచారిస్తే వాస్తవాలు తెలిసే అవకాశం ఉన్నా.. అందుకు రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. శ్రమకోర్చి కొందరు సేకరిస్తుంటారు. మరికొంతమంది అమ్మేవారి మాటలను విశ్వసించి కొనుగోలు చేస్తుంటారు. బయానా సొమ్ము ఇచ్చిన తర్వాత, కొన్న తర్వాత అసలు విషయం తెలిసి చాలామంది బాధపడుతున్నారు. ఆర్థికంగా నష్టపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. బఫర్‌ జోన్‌లో ఉన్న స్థలాలను, ట్రిఫుల్‌ వన్‌లో ఉన్న స్థలాలను, హెచ్‌ఎండీఏ/డీటీసీపీ అనుమతి ఉందని చెప్పి లేని లేఅవుట్‌లో ప్లాట్‌ అమ్మడం వరకు వాస్తవాలను దాచి విక్రయిస్తుంటారు. ఇవేకాకుండా మరెన్నో వివాదాలు భూముల చుట్టూ తిరుగుతుంటాయి. కోర్టు కేసుల్లో నలుగుతుంటాయి. హైదరాబాద్‌లో అయితే ఇనామ్‌ భూములని, సీలింగ్‌ భూములని.. రకరకాల పేర్లతో ఉన్నాయి. వీటి గురించి తరచూ లావాదేవీలు నిర్వహించే డెవలపర్లకు తప్ప జీవితంలో ఒకటి రెండుసార్లు స్థిరాస్తులు కొనే సామాన్యులకు అవగాహన ఉండదు. ఇక్కడే కొందరు మోసం చేస్తున్నారు. కొనబోయే భూమికి సంబంధించి సమస్త సమాచారం అందుబాటులో ఉంటే ఈ తరహా మోసాలకు చెక్‌పెట్టొచ్చు అంటున్నారు ల్యాండ్‌ డాక్టర్‌ వ్యవస్థాపకులు కార్తీక్‌రెడ్డి.


తెలిస్తేనే కదా అడుగుతారు

మార్కెట్లో ఇప్పటివరకు రకరకాల అగ్రిగేటర్లను చూశాం. తొలిసారి రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలకు సంబంధించి అగ్రిగేటర్‌ అందుబాటులోకి వచ్చింది. కొనబోయే స్థిరాస్తికి సంబంధించి ప్రభుత్వ రికార్డుల్లో ఏం సమాచారం ఉందో అది ఈ సంస్థ నిమిషాల్లో అందజేస్తుంది. గూగుల్‌ లొకేషన్‌ పంపిస్తే చాలు. ఆ భూమి ఉన్న సర్వే నంబరు, ఏ జోన్‌లో ఉంది,  ఎవరి పేరున ఉంది? కోర్టు కేసులేమైనా ఉన్నాయా? మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదిత 100 అడుగుల రోడ్డు వెళుతుందా? ప్రభుత్వ మార్కెట్‌ విలువ ఎంత ఉంది? ఇలా సమగ్ర సమాచారంతో పదిహేను నిమిషాల్లోనే నివేదిక అందజేస్తాం అంటున్నారు నిర్వాహకులు.  ఫలితంగా అన్నీ పక్కాగా ఉంటే కొనుగోలు చేసుకోవచ్చు. ఏవైనా అనుమానాలు ఉంటే అమ్మేవారిని అడిగి నిర్ధారించుకోవచ్చు.


ఇదే మొదటిది..

- కొరుపోలు కార్తీక్‌రెడ్డి, ల్యాండ్‌ డాక్టర్‌

‘‘పదహారు ఏళ్లుగా స్థిరాస్తి కన్సల్టెన్సీ సేవల్లో ఉన్నాం. సామాన్యులు ఎదుర్కొనే ఇబ్బందులు గమనించాం. చాలామంది తమ జీవితంలో ఒకటి, రెండుసార్లకు మించి స్థిరాస్తులను కొనుగోలు చేయరు. సహజంగానే వీరికి అవగాహన తక్కువ. వీరికి సైతం సులభంగా తక్కువ వ్యయంతో స్థిరాస్తికి సంబంధించి పూర్తి సమాచారం అందజేయగలిగితే? ఇదే ఆలోచనతో 2016లో పరిశోధన మొదలెట్టాం. ఆరునెలల క్రితం ల్యాండ్‌ డాక్టర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. 22 మంది సభ్యుల బృందం దీనిపై పనిచేస్తోంది. భూమి వివరాలు ఇస్తే దుర్వినియోగం అవుతుందేమోననే సందేహాలు అక్కర్లేదు. అందుకే పట్టాదారు పాసుపుస్తకం, సేల్‌డీడ్‌ అడగడం లేదు. భూమి ఉండే గూగుల్‌ లొకేషన్‌ వివరాలు మాత్రమే పంపించమని అడుగుతున్నాం. ఈ తరహా సేవలు అందిస్తున్న మొట్టమొదటి సంస్థ కూడా మాదే. ఇప్పటివరకు 250 మంది మా సేవలను వినియోగించుకున్నారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని