Published : 02 Apr 2022 03:33 IST

నిర్మాణాల దూకుడు

2021-22లో పరుగులు పెట్టిన రియల్‌ రంగం

ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో నిర్మాణ రంగం పరుగు తీస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల వారూ హైదరాబాద్‌లో సొంతిల్లు ఉండాలని కోరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా అన్ని మెట్రో నగరాలతో పోలిస్తే.. రాజధానిలో పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ఉపాధి అవకాశాలు, సుస్థిర అభివృద్ధి, మంచి వాతావరణం, మౌలిక సౌకర్యాల కల్పన, ఇతరత్రా అంశాల్లోనూ హైదరాబాద్‌ ముందుంటోంది. ఆయా కారణాలతో నిర్మాణ రంగం అంతకంతకూ విస్తరిస్తోందని జీహెచ్‌ఎంసీ ప్రణాళిక విభాగం విడుదల చేసిన తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 2021-22లో అనుమతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 17,572 నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది. శివార్లలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కలిపితే పాతికవేలు దాటుతుంది. అనుమతుల రుసుము రూపేణా 73శాతం వృద్ధి నమోదైంది. ఏకంగా రూ.1144.08 కోట్ల అనుమతుల రుసుము రూపంలో వచ్చింది.

దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోని స్థిరాస్తి రంగం 2020, 2021 సంవత్సరాల్లో చతికిలబడింది. తెలంగాణలో ఆ ప్రభావం నామమాత్రంగా కనిపించింది. వృద్ధి లేకపోయినప్పటికీ, స్థిరంగా కొనసాగడం వల్ల కొనుగోలుదారులు, వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. కొవిడ్‌ అనంతరం ఘనమైన వృద్ధి నమోదు కావడానికి అదే కారణమని జీహెచ్‌ఎంసీ ప్రణాళిక విభాగం గుర్తుచేసింది. అదే సమయంలో రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తీసుకున్న నిర్ణయాలు.. నగరాన్ని పరుగులు పెట్టించాయి. రహదారుల అనుసంధానం కోసం లింకు రోడ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. కూడళ్లలో పైవంతెనలు, అండర్‌పాస్‌లు నిర్మాణమవుతున్నాయి. ప్రజారవాణ వ్యవస్థ కోసం కొత్త వ్యవస్థలను రంగంలోకి దించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కూడళ్ల విస్తరణతో ట్రాఫిక్‌ సమస్య తగ్గుతోంది. పార్కుల అభివృద్ధి, శ్మశానవాటికల ఆధునికీకరణ, రక్షిత మంచినీరు, నిరంతర విద్యుత్తు సరఫరా వంటి కార్యక్రమాలు పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయి. దీంతో నగరంలో ఇల్లు కొనేందుకు ఇతర రాష్ట్రాలవారూ ఆసక్తి చూపుతున్నారు.

టీఎస్‌బీపాస్‌ విధానంతో..

నిర్మాణ అనుమతులను సులభతరం చేస్తూ పురపాలకశాఖ తెచ్చిన టీఎస్‌బీపాస్‌ చట్టంతో పౌరులకు ఇబ్బందులు తొలిగాయి. 75గజాల వరకు స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు సత్వర నమోదు (ఇన్‌స్టాంట్‌ రిజిస్ట్రేషన్‌) విధానం బాగా ఉపయోగపడుతోంది. రూ.1 రుసుముతో పౌరులు నిమిషాల్లో అనుమతి పొందుతున్నారు. 75-600 చ.గ విస్తీర్ణం లోపు భూమిలో కట్టే నిర్మాణాలకు సత్వర అనుమతులు లభిస్తున్నాయి. అంతకు మించిన విస్తీర్ణంలో చేపట్టే భవనాలకు ఏకగవాక్ష విధానం ద్వారా వేగంగా అందుతున్నాయి. నివాసయోగ్య పత్రం(ఓసీ) జారీలోనూ పారదర్శకత పెరిగింది. రోజుల తరబడి దరఖాస్తులను తొక్కిపెట్టకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన నిబంధనలు పెట్టడంతో అవినీతికి అడ్డుకట్ట పడినట్లయింది. ఈవిధానంలో ఇన్‌స్టాంట్‌ రిజిస్ట్రేషన్లు 746, ఇన్‌స్టాంట్‌ అప్రూవల్స్‌ 10793, సింగిల్‌విండో 6033, ఓసీలు 1550 జారీ అయ్యాయి.

ఖానామెట్‌లో 41 అంతస్తుల భవనం..

30 అంతస్తులు, అంతకు మించి ఎత్తైన భవనాల్లో ఐదు వాణిజ్య కేటగిరీ, 8 నివాస వినియోగం కింద అనుమతి పొందాయి. అత్యధికంగా 41 అంతస్తుల (128 మీటర్లు) భవనం ఖానామెట్‌ నుంచి అనుమతి తీసుకుంది. మియాపూర్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, లింగంపల్లి, కూకట్‌పల్లి, మూసాపేట, తదితర ప్రాంతాల్లో ఆకాశహర్మ్యాల సంస్కృతి పెరుగుతోందని, కొనుగోలుదారులు పైఅంతస్తుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారని బిల్డర్లు స్పష్టం చేస్తున్నారు. మొత్తం అనుమతుల్లో 83 ఆకాశహర్మ్యాల ప్రాజెక్టులే ఉన్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరంలో 44 అంతస్తుల భవనానికి బల్దియా అనుమతివ్వడం తెలిసిందే.
ఎల్బీనగర్‌ జోన్‌లో మల్టీప్లెక్స్‌లు.. ఎల్బీనగర్‌ వరకు మెట్రో రైలు సేవలు ఉండటం, కూడలి చుట్టూ జీహెచ్‌ఎంసీ రూ.600కోట్ల వ్యయంతో పదుల కొద్దీ పైవంతెనలు నిర్మించడం, విమానాశ్రయం మార్గాన్ని అభివృద్ధి చేయడం వంటి పలు కారణాలతో చుట్టుపక్కల స్థిరాస్తి రంగం విస్తరిస్తోంది.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని