Updated : 30 Apr 2022 05:43 IST

సిటీ చుట్టూ ఆవాసాలు రావాలంటే..

ఈనాడు, హైదరాబాద్‌

నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఎంతో తోడ్పాటు అందిస్తోందని.. ప్రస్తుతం కొన్ని అంశాలు పరిశ్రమను ఇబ్బంది పెడుతున్నాయని వాటిని సైతం పరిష్కరించాలని కోరింది. సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల్లో కొన్నింటిపైనే పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు.

పర్యావరణ నిబంధనలు చేర్చండి:  పి.రామకృష్ణారావు, అధ్యక్షుడు, క్రెడాయ్‌ హైదరాబాద్‌
* రాష్ట్రంలో టీఎస్‌ బీపాస్‌లో 21 రోజుల్లోనే అనుమతులు వచ్చేలా చర్యలు చేపట్టినా.. పర్యావరణ కమిటీ నుంచి అనుమతుల కోసం మూడు నెలలు ఎదురు చూడాల్సి వస్తోంది. నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ను అనుసరించి అగ్నిమాపక, ఇతర నిబంధనలను చేర్చినట్లే.. పర్యావరణ నిబంధనలను ఇందులోనే చేర్చాలి. ఫలితంగా ఆలస్యాన్ని నివారించొచ్చు. విద్యుత్తు, నీటి కనెక్షన్లను ఇందులో చేర్చి గడువు నిర్దేశించాలి.

* చెరువుల సమీపంలో పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. ఇక్కడ పర్యావరణహితంగా ఉండే ఏకో టూరిజం ప్రాజెక్టులకు అనుమతించాలి. ఈ ప్రతిపాదన చాలారోజులుగా ప్రభుత్వం వద్ద ఉంది. ఇతర నగరాల్లో ఉన్న ఈ తరహా ప్రాజెక్టులు హైదరాబాద్‌లోనూ రావాలి. ఫలితంగా కేరళ తర్వాత పర్యాటకంగా హైదరాబాద్‌ ఆకర్షణీయ ప్రాంతం అయ్యేందుకు అవకాశం ఉంది.

* క్రషర్స్‌ సమ్మెతో పదిరోజులుగా కంకర సరఫరా ఆగిపోయింది. రెడీమిక్స్‌ లేక నిర్మాణాలన్నీ నిలిచిపోయాయి.  ఇప్పటికే కూలీలు ఖాళీగా ఉంటున్నారు.  ఎక్కువ రోజులు పనిలేకపోతే ఊరెళ్లిపోతారు. వర్షకాలం వస్తే పని నెమ్మదిస్తుంది. ఈ సమస్యకు త్వరగా పరిస్కారం చూపగలరు.

* ప్రస్తుత మాస్టర్‌ ప్లాన్లు తప్పులతడకగా రూపొందాయి. 5వేల తప్పులు ఉన్నాయి. హైదరాబాద్‌లో చూస్తే 15 ఏళ్లలో రావాల్సిన అభివృద్ధి ఎనిమిదేళ్లలో జరిగింది. కొత్త మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పనకు వెంటనే పూనుకోకపోతే సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

* జీవో 111 పరిధిలో ప్రపంచంలోనే ఉత్తమైన ల్యాండ్‌మార్క్‌ ప్రాజెక్టులు ఉండేలా చూడాలి. ముఖ్యంగా పెరి అర్బన్‌ జోన్‌ విషయంలో 10 శాతం నిర్మాణాలే అంటే ఉల్లంఘనలకు ఆస్కారం ఉంటుంది.  భూభాగం అధికంగా ఉండే కెనడాలో తప్ప పెరి అర్బన్‌ ఎక్కడ విజయవంతం కాలేదు. మనదగ్గర 50 శాతం స్థలంలో కట్టుకోవడానికి అవకాశం ఉండాలి. అపార్ట్‌మెంట్లకు అవకాశం లేకుండా.. మూడు అంతస్తుల వరకే అనుమతి ఇచ్చేలా చూడాలి.


మూడునెలలైనా రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు తగ్గించాలి
- వి.రాజశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి, క్రెడాయ్‌ హైదరాబాద్‌

* పశ్చిమ హైదరాబాద్‌తో పోలిస్తే ఇతర ప్రాంతాల్లో సామాజిక మౌలిక వసతులు తక్కువగా ఉన్నాయి. గ్రిడ్‌పాలసీ వచ్చినా అంతగా స్పందన రావడం లేదు. మేడ్చల్‌లో ఐటీ పార్క్‌ మాదిరి ఇతర ప్రాంతాల్లో వీటిని విస్తరించేలా చేస్తే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.

* ఐటీతో పాటూ ఉత్పత్తిరంగం హైదరాబాద్‌లో పురోగమిస్తోంది. పెద్ద ఎత్తున ఉపాధి రాబోతుంది. వీరికి గృహాలు 50-60 లక్షల ధరల శ్రేణిలో నిర్మించాల్సి ఉంటుంది. శివార్లలో ఐదు క్లస్టర్లుగా విభజించి భూమిని ప్రభుత్వం కేటాయిస్తే అక్కడ గృహ నిర్మాణానికి బిల్డర్లు ముందుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 30 శాతం మంది అవసరాలు మాత్రమే తీరుతున్నాయని చెప్పారు.

* కొవిడ్‌ మొదటి, రెండో వేవ్‌ సమయంలో ఇచ్చిన మాదిరి వెసులుబాటు కల్పించాలి. మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు తగ్గించాలి. అందుబాటు ధరల ఇళ్లకు, మహిళల పేరుతో రిజిస్ట్రేషన్‌ ఛార్జీల్లో 1 శాతమైనా తగ్గించాలి.

* ధరణిలో నాలా మార్పిడి కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. నాకు తెలిసిన ఒక ప్రాజెక్ట్‌ పూర్తైనా  నాలా మార్పిడి లేక ఓసీ రావడం లేదు. దరఖాస్తు చేసుకున్నప్పుడు నాలా ఫీజులు రూ.75 లక్షలు ఉంటే.. ఇప్పుడు రూ.3కోట్లకు పెరిగింది. అయినా కట్టడానికి బిల్డర్లు సిద్ధంగా ఉన్నా ధరణి కారణంగా ఆగిపోయింది. ధరణి సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలి.


అమ్ముడుపోని ఇళ్లుగా చూడొద్దు

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదని క్రెడాయ్‌ సంఘాలు తెలిపాయి. 2017 నుంచి 2022 మార్చి వరకు 2 లక్షలకు పైగా ప్రాజెక్టులు రెరాలో రిజిస్టర్‌ అయ్యాయని.. 2025 నాటికి దశలవారీగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. గతంలో పెద్ద ప్రాజెక్టులు దశలవారీగా అనుమతులు తీసుకునేవని.. కొవిడ్‌ అనంతరం ప్రభుత్వం ఫీజులను వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పించడంతో ఒకేసారి అనుమతులు తీసుకున్నారని తెలిపారు. క్రమంగా వీరు నిర్మాణం చేపడతారని చెప్పారు. ముడి పదార్థాల ధరలు గణనీయంగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లోనూ హైదరాబాద్‌ మార్కెట్‌ స్థిరంగా వృద్ధి చెందుతోందని అన్నారు. మరో పది నుంచి పదిహేను సంవత్సరాల పాటు హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి ఢోకా ఉండదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నైట్‌ఫ్రాంక్‌ సంస్థ వెల్లడించిన గణాంకాలను ఉదాహరించారు.Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని