Updated : 07 May 2022 05:56 IST

స్మార్ట్‌హోమ్స్‌పై మనసు పడుతున్నారు

నయా పోకడల వైపు నిర్మాణ సంస్థలు

ఈనాడు, హైదరాబాద్‌: హైటెక్‌ నగరిగా హైదరాబాద్‌కు పేరు.. టెక్నాలజీ హబ్‌గా రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి నగరంలో కట్టే ఇళ్లు సైతం అంతే హైటెక్‌గా ఉండాలని కోరుకుంటోంది నవతరం. వీరి ఆలోచనలకు తగ్గట్టుగా నిర్మాణ సంస్థలు సైతం కొత్త తరం ఇళ్లు కట్టిస్తున్నాయి. విదేశాల్లో అధ్యయనం చేసి మరీ సాంకేతికతను జోడించి స్మార్ట్‌ హోమ్స్‌గా తీర్చిదిద్దుతున్నాయి. బడా స్థిరాస్తి సంస్థలు ఇప్పటికే ఈ తరహాలో చేపట్టిన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి.

కొనుగోలుదారులను ఆకట్టుకోవాలన్నా.. మార్కెట్లో తమ ప్రత్యేకతను నిలబెట్టుకోవాలన్నా.. తాజా పోకడలను అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో నగరంలోని నిర్మాణ సంస్థలు ముందుంటున్నాయి. ప్రస్తుతం హరిత భవనాల నిర్మాణాల పోకడ నడుస్తోంది. ఐజీబీసీ నుంచి ప్లాటినం, గోల్డ్‌ రేటింగ్‌ పొందిన ఇళ్లను నిర్మిస్తున్నారు. మొదట్లో వ్యక్తిగతంగా మొదలైన ఈ తరహా ఇళ్ల నిర్మాణం.. ప్రాజెక్ట్‌ల్లోనూ విస్తరించింది. ప్రస్తుతం బడా సంస్థలన్నీ తమ కొత్త ప్రాజెక్ట్‌లను దాదాపుగా హరిత భవనాల కింద రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు ముందుకు వస్తున్నాయి. కొనుగోలుదారుల డిమాండ్‌కు అనుగుణంగా నిర్మాణదారులు మారుతున్నారు. ఇకపై స్మార్ట్‌హోమ్స్‌ పోకడ బాగా విస్తరిస్తుందని నిర్మాణదారులు అంచనా వేస్తున్నారు.

ప్రణాళిక దశలో సులువు
ప్రస్తుతం చూస్తే ఇంట్లోని ఇంటీరియర్‌కు కొనుగోలుదారులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. భారమైనా సరే తమ అభిరుచికి తగ్గట్టుగా డిజైన్‌ చేయించుకునేందుకు ఖర్చుకు సైతం వెనకాడటం లేదు. విలాసవంతమే కాదు సౌకర్యంగానూ తీర్చిదిద్దుకుంటున్నారు. ఇందుకు తగ్గట్టుగా ప్రాజెక్ట్‌ డిజైన్‌ దశ నుంచే నిర్మాణదారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఇంటీరియర్‌ నచ్చినట్లుగా చేయించుకునేందుకు వీలవుతుంది. ఇదే మాదిరి రాబోయే ఇల్లు స్మార్ట్‌గా పనిచేసేందుకు తగ్గట్టుగా ప్రణాళిక దశ నుంచే డిజైన్‌పై దృష్టిపెడుతున్నారు బిల్డర్లు. సవాల్‌గా తీసుకుని ప్రాజెక్ట్‌ మొత్తం ప్రయోగాత్మకంగా స్మార్ట్‌హోమ్స్‌గా నిర్మిస్తున్నారు.

పాత ఇళ్లలోనూ మార్చుకోవచ్చు
మార్కెట్లోనూ స్మార్ట్‌ పరికరాల అందుబాటు పెరగడం, ధరలు సైతం అందుకునే స్థాయిలో ఉండటంతో వీటిపై అవగాహన ఉన్నవారు, ఆసక్తి ఉన్నవారు, సాంకేతికతను స్వాగతించేవారు.  ఇప్పటికే తమ ఇళ్లను స్మార్ట్‌గా మార్చుకుని వాడుతున్నారు.  ఆపిల్‌ ఫోన్‌ అయితే సిరి, అండ్రాయిడ్‌ మొబైల్‌ అయితే గూగుల్‌ అసిస్టెంట్‌తో నగరంలో వ్యక్తిగతంగా కొంతమంది ఇళ్లలో ప్రస్తుతం స్మార్ట్‌గా ఉపయోగించుకుంటున్నారు.
* నగరమైనా శివార్లలో దొంగతనాల భయం వెంటాడుతుంటుంది.  పండగ సెలవుల్లో, ఎక్కడికైనా కొద్దిరోజుల పాటూ విహారానికి వెళితే ఇంటి భద్రతపైనే ఎక్కువమంది ఆందోళన చెందుతుంటారు. స్మార్ట్‌ హోమ్‌ సెక్యూరిటీ సిస్టమ్‌ ఉంటే భరోసాగా ఉండొచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలను ఇంట్లో ఒంటరిగా ఉంచినా ఆందోళన చెందాల్సిన పనిలేదనే భరోసా ఇస్తోంది ఈ పరికరం. వైఫై సెక్యూరిటీ కెమెరా ఇది. రాత్రిపూట కూడా పనిచేస్తుంది. అవసరమైన చోట దీన్ని బిగించుకుని యాప్‌ సహాయంతో అవసరమైనప్పుడు మొబైల్‌ నుంచే చూసుకోవచ్చు. ఇంటిని, పిల్లలను ఓ కంట కనిపెట్టవచ్చు.

* వైఫై ఆధారంగా పనిచేసే స్మార్ట్‌ స్విచ్చులు వచ్చాయి. టీవీలు ఏసీలు మాత్రమే కాదు ఇంట్లో బల్బులు, ఫ్యానులు, స్టీరియోలు రిమోట్‌తో నియంత్రించవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడే కాదు.. మొబైల్‌లోని యాప్‌ సహాయంతో ఎక్కడ ఉన్నా వీటిని ఆన్‌, ఆఫ్‌ చేయవచ్చు. ఏ సమయంలో నిద్రలేపాలో చెబితే ఆ వేళకు బిగ్‌బాస్‌ షో మాదిరి మ్యూజిక్‌ సిస్టమ్‌ నుంచి వచ్చే పాటతో నిద్ర లేపుతుంది.
* స్మార్ట్‌గా పనిచేసే ఎల్‌ఈడీ బల్బులు ఈ రోజుల్లో ఇంటికి ప్రధాన ఆకర్షణ. అలసిపోయి ఇంటికి వచ్చి సోఫాలో కూలబడి లైట్‌ వేయగానే సంగీతం కూడా వినపడితే అలసిన మనసుకు సాంత్వన కలుగుతుంది. ఈ తరహా స్మార్ట్‌ పరికరాలు మున్ముందు ప్రతి ఇంట్లో సాధారణం కాబోతున్నాయి.
* రోజువారీ, ముఖ్యంగా దీపావళి వంటి పండగల సమయంలో గృహిణులకు ఇంటిని శుభ్రం చేయడం పెద్దపని. తీరిక లేకుండా ఉండేవారికి ఇంటిని శుభ్రం చేసే స్మార్ట్‌ క్లీనింగ్‌ రోబోలు వచ్చాయి. వ్యాక్యూమ్‌ క్లీనర్‌ అనగానే ఎక్కడో అల్మారాలో దాచిన దాన్ని బయటకు తీసి శుభ్రం చేయమంటే బద్ధకిస్తుంటారు. చిన్న పరిమాణంలో వచ్చిన ఈ క్లీనింగ్‌ రోబో సులువుగా శుభ్రం చేస్తుంది. మూలలు, ఫర్నిచర్‌ అడుగుభాగం అన్నిచోట్లకు వెళుతుంది.  క్లీనింగ్‌ రోబోలతో ఏ రోజు, ఏ సమయంలో శుభ్రం చేయాలో ఆదేశాలు ఇస్తే చాలు దానంతట అది పనిచేసుకుంటూ పోతుంది.

ఎలా ఉంటాయంటే...
స్మార్ట్‌ హోమ్స్‌ అంటే ఇంట్లో ఉండేవారి పనిని తేలిగ్గా చేయడం. ఇంట్లోని ఉపకరణాలు, పరికరాలు వివేకంతో పనిచేయడం అన్నమాట. సాధారణంగా ఇంట్లో గదుల్లో మనుషులు ఉన్నా లేకున్నా విద్యుత్తు దీపాలన్నీ వెలుగుతుంటాయి. ఆర్పేయకపోతే అలాగే వెలుగుతుంటాయి. మర్చిపోవడం సహజం కదా.. దీంతో చాలా విద్యుత్తు వృథా అవుతోంది. అదే గదిలో వెళ్లగానే లైట్‌ వెలిగి.. బయటకు రాగానే ఆరిపోయేలా సెన్సర్లతో పనిచేసేలా ఏర్పాటు చేసుకుంటే ఆ ఇల్లు స్మార్ట్‌ అవుతుంది.
* గది ఉష్ణోగ్రతను బట్టి ఫ్యాను, ఏసీలు పనిచేయడం వరకు చాలా ఉన్నాయి. వేసవిలో బయటి నుంచి ఇంటికి రాగానే చాలా ఉక్కపోతగా ఉంటుంది. ఇంటికి చేరువలో ఉన్నప్పుడే మొబైల్‌ ఆధారంగా ఏసీని ఆన్‌ చేస్తే ఇంట్లో అడుగుపెట్టేసరికి చల్లదనం స్వాగతం పలుకుతుంది.
* ఇంట్లో పిల్లలు ఒంటరిగా ఉంటే వైఫై సెక్యూరిటీ కెమెరాతో మొబైల్‌ నుంచే వారిని ఓ కంట కనిపెట్టవచ్చు.


 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని