చిన్న బడ్జెట్‌.. సొంత గూడు

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: స్థలం ఉంది.. ఇల్లు కట్టుకోవాలి.. తక్కువలో తక్కువ పది లక్షల రూపాయలు నిర్మాణానికి ఖర్చు చేయాల్సి వస్తోంది. రూ.2.34 లక్షల్లోనే చిన్న ఇంటిని నిర్మించుకోగలిగితే.. చాలామందికి ఉపయుక్తం. రాజేంద్రనగర్‌ ఎన్‌ఐఆర్‌డీలోని గ్రామీణ

Updated : 02 Jul 2022 07:11 IST

రూ.2.34 లక్షల్లోనే ఎలా కట్టారంటే..

ఈనాడు, హైదరాబాద్‌ - రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: స్థలం ఉంది.. ఇల్లు కట్టుకోవాలి.. తక్కువలో తక్కువ పది లక్షల రూపాయలు నిర్మాణానికి ఖర్చు చేయాల్సి వస్తోంది. రూ.2.34 లక్షల్లోనే చిన్న ఇంటిని నిర్మించుకోగలిగితే.. చాలామందికి ఉపయుక్తం. రాజేంద్రనగర్‌ ఎన్‌ఐఆర్‌డీలోని గ్రామీణ సాంకేతిక పార్కులో తక్కువ వ్యయంతో నమూనా గృహాన్ని నిర్మించారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద గ్రామీణ ప్రాంత ప్రజల కోసం నమూనా ఇంటిని సిద్ధం చేసినా...  తక్కువ ఖర్చు కావడంతో నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ఊర్లలో తమ పాత ఇళ్ల స్థానంలో, వ్యవసాయ క్షేత్రాల్లో ఇంటి నిర్మాణం కోసం చౌక ఇళ్లపై ఆసక్తి చూపిస్తున్నారు.

* జాతీయ గ్రామీణాభివృద్ధి, పంజాయతీరాజ్‌ సంస్థ పరిశోధనలు చేపట్టి తక్కువ ఖర్చులో సుస్థిరమైన గృహ సాంకేతికతలను అభివృద్ధి చేసింది.

* ఒక పడక గదిని 342 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. హాల్‌, పడకగది, వంటగది, స్నానాల గది ఉంటుంది. అవసరమైనవారు మరింత పెద్దగా ఇంటిని నిర్మించుకోవచ్చు.

* పునాదుల దశ నుంచే స్థానికంగా దొరికే నిర్మాణ సామగ్రి ఉపయోగించేలా డిజైన్‌ చేశారు.

* పాత రోజుల్లో మాదిరి రాళ్లతో పునాది నిర్మాణం చేపట్టారు.

* గోడలను ర్యాట్‌ ట్రాప్‌ బాండ్‌ పద్ధతిలో చేపట్టారు. ఇటుకలు, సిమెంట్‌ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. 1970లో అర్కిటెక్ట్‌ లారీ బేకర్‌ కేరళలో ఈ తరహా నిర్మాణాన్ని మొదటిసారి చేపట్టారు. అప్పటి నుంచి ఆయన పేరుతో ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది.  

* ఇందులో ఇటుకల ఎంపిక కీలకం. ఇదివరకు మట్టి ఇటుకలు వాడేవారు. ఖర్చు తగ్గించేందుకు ఫ్లైయాష్‌ ఇటుకలను ప్రస్తుతం వాడారు.

* కేరళలో ఎక్కువగా కన్పించే ఫిల్లర్‌ స్లాబ్‌ రూఫ్‌ను నిర్మించారు. పెంకుల శ్లాబు ఇది. దీన్ని కూడా లారీబేకర్‌ డిజైన్‌ అంటారు. పెంకుల కారణంగా ఇల్లు వేసవిలోనూ చల్లగా ఉంటుంది. తక్కువ కాంక్రీట్‌, సిమెంట్‌ వాడారు.

* ఇంటి లోపల పాత రోజుల్లో మాదిరి గోడల ప్లాస్టరింగ్‌ను మట్టితో చేపట్టారు.

* బయటివైపు ఎలాంటి ప్లాస్టరింగ్‌ చేయలేదు. ఫ్లైయాష్‌ ఇటుకలు కాబట్టి అవసరం పడలేదు. ఆవుపేడ ఆధారితంగా తయారు చేసిన ప్రకృతిక్‌ పెయింట్‌ వేశారు.

* గచ్చు కోసం తాండూరు బండలను వాడారు. రెండు రంగుల్లో ఇవి లభిస్తున్నాయి. వీటితో ఫ్లోరింగ్‌ అందంగా కన్పించడమే కాదు నిర్వహణ ఇబ్బందులు తక్కువే.

* చదరపు అడుగుకు రూ.683 ఖర్చు అయిందని ఎన్‌ఐఆర్‌డీ అధికారులు తెలిపారు. ఇంటీరియర్‌ ఖర్చుతో ఏకంగా ఇల్లే పూర్తయిపోయింది.


మిగులు విద్యుత్తు..

నమూనా ఇల్లుపై 2 కిలోవాట్‌ సౌర పలకలను ఏర్పాటు చేశారు. ఇంటి అవసరాలకు కావాల్సిన కరెంట్‌ను మేడపైనే ఉత్పత్తి చేసుకోవచ్చు. సగటున ప్రతిరోజూ 8 యూనిట్లు కరెంట్‌ ఉత్పత్తి అవుతుంది. చిన్న ఇంటికి ఏడాది పొడవు సగటున ప్రతిరోజు 4 యూనిట్లకు మించి అవసరం ఉండదు.

* నమూనా ఇంట్లో ఎల్‌ఈడీ లైట్లు, విద్యుత్తు ఆదా చేసే ఫ్యాన్లు, సౌర విద్యుత్తుతో నడిచే స్టౌవ్‌ను అమర్చారు. వీటికైతే రోజూ రెండు యూనిట్లకు మించి ఖర్చు కాదు. వేసవిలో కాస్త ఎక్కువ వినియోగం ఉంటుంది.

* ఇలా ప్రతిరోజూ మిగిలిన యూనిట్లను నెట్‌మీటర్‌ ద్వారా గ్రిడ్‌కు అనుసంధానించవచ్చు. ఆ మేరకు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ప్రస్తుతం డిస్కం నెట్‌మీటర్‌లో యూనిట్‌ రూ.4.19 వరకు వినియోగదారులకు చెల్లిస్తుంది. ప్రతి ఆరునెలలకు ఒకసారి వీటిని చెల్లిస్తారు.

* ఇంటి ఖర్చుకు అదనంగా రూ.1.06 లక్షలు సౌర విద్యుత్తు కోసం ఖర్చయింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని