నిర్మాణ ఆలస్యానికి...10 శాతం వడ్డీ చెల్లించాలి 

ఈనాడు, హైదరాబాద్‌: రెరా అమలులో దేశానికి ఆదర్శంగా ఉన్న ‘మహారెరా’... నిర్మాణ సంస్థ లోపాలపై కొరడా ఝుళిపిస్తోంది. గడువులోపు ప్రాజెక్ట్‌ పూర్తి చేసి అప్పగించక పోవడంతో మహారాష్ట్రలోని రన్‌వాల్‌ కన్‌స్ట్రక్షన్స్‌పై కొనుగోలుదారులు...

Published : 24 Nov 2018 02:32 IST

మహారెరా ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: రెరా అమలులో దేశానికి ఆదర్శంగా ఉన్న ‘మహారెరా’... నిర్మాణ సంస్థ లోపాలపై కొరడా ఝుళిపిస్తోంది. గడువులోపు ప్రాజెక్ట్‌ పూర్తి చేసి అప్పగించక పోవడంతో మహారాష్ట్రలోని రన్‌వాల్‌ కన్‌స్ట్రక్షన్స్‌పై కొనుగోలుదారులు... రెరాను ఆశ్రయించారు. 2014 నుంచి 10.05 శాతం వడ్డీని చెల్లించాలని.. ప్రాజెక్ట్‌ను 18 నెలల్లో పూర్తి చేయాలని మహారాష్ట్ర రియల్‌ఎస్టేట్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఆదేశించింది. బాంబే హైకోర్టులో బిల్డర్‌ అప్పీల్‌ చేసుకునేందుకు డిసెంబరు 5 వరకు తీర్పును నిలుపుదల చేసింది. ముంబయిలోని ములండ్‌ పారిశ్రామికవాడ స్థలంలో రీ డెవలప్‌మెంట్‌లో భాగంగా సదరు నిర్మాణ సంస్థ 2005లో గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. అయిదు భవనాలు నిర్మించి ఇస్తామని 21 మంది కొనుగోలుదారుల నుంచి ఒప్పందం చేసుకుంది. 2006-07లోనే ఒక్కొక్కరి నుంచి రూ.20-30 లక్షలు తీసుకుంది. 2008-09 నాటికి ఫ్లాట్లు అందించాలనేది ఒప్పందం. నిర్మాణదారు గడువులోపు ఇల్లు కట్టలేదు. కోర్టు కేసులతో కాలం వెళ్లదీశాడు. దీనిపై కొనుగోలుదారులు మహారెరాను ఆశ్రయించారు. 
మన దగ్గర... 
నిర్మాణ పరంగా జాప్యాలు, లోపాలతో మన దగ్గర కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. ఫిర్యాదు చేసేందుకు కొద్దిరోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం మన దగ్గర రెరాలో ప్రాజెక్ట్‌ల నమోదుకు మూడు నెలల గడువు ఇచ్చారు. ఈ నెలాఖరు వరకు అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని సంస్థలు నమోదు చేసుకోగా.. చివరివారంలో ఎక్కువ సంస్థలు తమ ప్రాజెక్ట్‌లను రిజిస్టర్‌ చేసుకునే అవకాశం ఉంది. గడువు పొడిగించాలని స్థిరాస్తి సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని