హమ్మయ్య! జీఎస్‌టీ భారం తగ్గనుంది 

ఇంటి ధర కంటే వస్తు సేవల పన్నును చూసి కొనుగోలుదారులు హడలెత్తేవారు. ఇంటి కొనుగోలుపై జీఎస్‌టీ భారం అంతగా ఉండేది మరి. వచ్చే నెల 1 నుంచి ఇప్పుడున్న జీఎస్‌టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు...

Published : 02 Mar 2019 01:41 IST

అందుబాటు ధరల్లో పెరగనున్న ఇళ్ల నిర్మాణం

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటి ధర కంటే వస్తు సేవల పన్నును చూసి కొనుగోలుదారులు హడలెత్తేవారు. ఇంటి కొనుగోలుపై జీఎస్‌టీ భారం అంతగా ఉండేది మరి. వచ్చే నెల 1 నుంచి ఇప్పుడున్న జీఎస్‌టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. అందుబాటు ఇళ్లకు ఒక శాతమే. దీంతో ఎక్కువ ప్రయోజనాన్ని నగర కొనుగోలుదారులు పొందనున్నారు. కోరుకున్న సౌకర్యాలతో ఇల్లు కొనుగోలు చేసే సౌలభ్యం ఏర్పడింది. 
ఏడాదిన్నర క్రితం వరకు ఉన్న పలు రకాల పన్నుల స్థానంలో ఒకే పన్ను విధానం జీఎస్‌టీని కేంద్రం ప్రవేశపెట్టింది. స్థిరాస్తిని 12 శాతం పన్నుల శ్లాబులో చేర్చింది. అందుబాటు ఇళ్లకైతే 8 శాతం జీఎస్‌టీగా పేర్కొంది. నిర్మాణంలో ఉన్న ఇళ్లను కొనుగోలు చేస్తే జీఎస్‌టీ వర్తిస్తుందని పేర్కొంది. దీంతో హైదరాబాద్‌ మార్కెట్‌లో పూర్తైన ఇళ్లకు గిరాకీ పెరిగింది. నిర్మాణంలో ఉండగా కొనుగోలుకు ఎక్కువ మంది ముందుకొచ్చేవారు కాదు. వాస్తవంగా నిర్మాణంలో ఉండగా చదరపు అడుగు తక్కువకు దొరుకుతుంది. నిర్మాణదారులకు కొనుగోలుదారుడు దశలవారీగా చెల్లించే సొమ్ముతో ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. సత్వరం నిర్మాణం పూర్తవ్వడానికి దోహదం చేస్తుంది. ఇరువురికి ఉపయోగకరంగా ఉండేది. జీఎస్‌టీ 12 శాతం దెబ్బకు ఇటు కొనుగోలుదారులు.. అటు నిర్మాణదారులకు భారంగా మారింది. కొనుగోలుదారుడిపై అదనంగా 6.25 శాతం భారం పడింది. 
జీఎస్‌టీకి ముందు నిర్మాణ సంస్థల నుంచి ఇల్లు, ఫ్లాట్‌ కొనుగోలు చేస్తే వినియోగదారులు సేవా పన్ను కింద 4.5 శాతం చెల్లించేవారు. ఇది కాకుండా విలువ ఆధారిత పన్ను మన రాష్ట్రంలో 1.25 శాతంగా ఉంది. ఆ రకంగా వినియోగదారుడు 5.75 శాతం పన్ను కట్టేవారు. జీఎస్‌టీ 12 పెరగడంతో 6.25 శాతం భారం పడింది. రూ.50 లక్షల ఇల్లు కొంటే రూ.6 లక్షలు జీఎస్‌టీ చెల్లించాల్సి వచ్చేది. 
కేంద్రం మాత్రం నిర్మాణ సామగ్రికి సంబంధించి పలు వస్తువులపై పన్నుల మీద పన్నులు చెల్లించాల్సిన పని తప్పిందని.. ఇన్‌ఫుట్‌ టాక్స్‌ సబ్సిడీ బిల్డర్లకు వస్తుంది కాబట్టి ఈ ప్రయోజనాలను కొనుగోలుదారుకు బదలాయిస్తే స్థిరాస్తిపై ఇప్పుడు 6 శాతమే పన్ను ఉంటుందని చెప్పింది. ఇన్‌ఫుట్‌ టాక్స్‌ సబ్సిడీని కొందరు మూడు, ఐదు శాతం తగ్గించి విక్రయించగా.. ఎక్కువ మంది పూర్తిగా వసూలు చేశారు. దీంతో కేంద్రం ఆ సబ్సిడీని ఎత్తివేస్తూ కొనుగోలుదారులకు జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించింది. దీంతో రూ.50 లక్షల విలువైన ఇంటిని కొనుగోలు చేస్తే వచ్చేనెల నుంచి ఇదివరకులా రూ.6లక్షలు కాకుండా రూ.2.5 లక్షలు చెల్లిస్తే చాలు. 
వాస్తవంగా కొనుగోలు చేసే ధర చాలా ఎక్కువే ఉన్నా.. సేల్‌ డీడ్‌లో మార్కెట్‌ ధరనే చూపుతున్నారు. ఆ రకంగా అధికశాతం బిల్డర్లు రూ.50 లక్షలకు ఫ్లాట్‌ను కొన్నా వాటి రిజిస్ట్రేషన్‌ విలువ రూ.30 లక్షలలోపే చూపుతున్నారు. కాబట్టి జీఎస్‌టీ రూ.1.5 లక్షలే చెల్లించేది. 
ఇప్పటికే కొనుగోలు చేసి జీఎస్‌టీ చెల్లించిన వారి విషయంలో జీఎస్‌టీ మండలి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఈ మేరకు వారు నిపుణుల కమిటీని నియమించారు. 
వీటికి ఒక శాతమే... 
అందుబాటు ఇళ్లకు జీఎస్‌టీని 8 శాతం నుంచి ఏకంగా ఒక శాతానికి తగ్గించింది. దీంతో నగరంలో సామాన్య, మధ్యతరగతి వాసులకు సొంతింటి కొనుగోలులో భారం భారీగా తగ్గనుంది. నాన్‌ మెట్రోలో ఇంటి ధర రూ.45 లక్షల లోపు ఉండి.. 968 చదరపు అడుగుల విస్తీర్ణం లోపు ఉన్న ఇళ్లకు జీఎస్‌టీ ఒకశాతం వర్తిస్తుంది. రూ.40 లక్షలు పెట్టి ఇల్లు కొన్నా జీఎస్‌టీ రూ.40వేలు చెల్లిస్తే సరిపోతుంది. 
986 అడుగులు కార్పెట్‌ ఏరియా ఉంటేచాలు. మన దగ్గర ఇప్పటివరకు బిల్డర్లు విక్రయించే సూపర్‌ బిల్టప్‌ ఏరియాలోనే ఇంటిలోపలే కాదు బయట లాబీలు, కారిడార్లు అన్నీ కలిపి విక్రయిస్తున్నారు. ఆ రకంగా 1200 చదరపు అడుగుల ఇంటిని రూ.45 లక్షల లోపు కొనుగోలు చేస్తే జీఎస్‌టీ ఒక శాతమే వర్తిస్తుంది. 
హైదరాబాద్‌ మెట్రో నగరమా కాదా అనేది స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అధికారికంగా దేశంలో నాలుగు నగరాలు దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా మాత్రమే అని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మన నగరం నాన్‌ మెట్రో అయితే సూపర్‌ బిల్టప్‌తో కలిపి 1200 అడుగుల ఇంటి వరకు జీఎస్‌టీ పెద్ద భారం కాదు. ఒక శాతమే ఉంటుంది. 
రెరా అమల్లోకి వచ్చినప్పుటి నుంచి కార్పెట్‌ ఏరియానే కొనుగోలుదారుడి పేరున రిజిస్ట్రేషన్‌ చేయాలి. కాబట్టి కొనేటప్పుడే ఎంత విస్తీర్ణం అనేది తెలుసుకోవడం సులువే. 
వీటివైపు నిర్మాణదారుల దృష్టి..  కేంద్రం జీఎస్‌టీలో నిర్వచించిన మాదిరి రూ.45 లక్షల లోపు ఇళ్లు కట్టేవారు రాబోయే రోజుల్లో పెరగనున్నారు. సొంతిల్లు విశాలంగా ఉండాలనే కోరుకునేవారు ఎక్కువ కాబట్టి ఇప్పటివరకు వెయ్యి చదరపు అడుగుల పైన రెండు పడకగదుల ఫ్లాట్లను నిర్మిస్తూ వస్తున్నారు. ఇప్పటికే భూముల ధరలు పెరగడంతో క్రమంగా విస్తీర్ణం తగ్గించుకుంటూ వస్తున్నారు. ఫలితంగా కొనే స్థాయిలో ధరలు ఉండేలా చూసుకుంటున్నారు. జీఎస్‌టీ భారం లేకుండా ఉండేందుకు 90 చదరపు మీటర్ల లోపు కార్పెట్‌ ఏరియా ఉండేలా నిర్మాణాలు ఎక్కువ సంఖ్యలో చేపట్టే అవకాశం ఉందని స్థిరాస్థి సంఘాల ప్రతినిధులు అంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని