అందుబాటు ఇళ్లకు ‘ఉత్తరం’

కొంపల్లి-మేడ్చల్‌ ప్రాంతం వృద్ధిపథంలో పయనిస్తోంది. నాగ్‌పూర్‌ జాతీయ రహదారి, కరీంనగర్‌ రహదారి చుట్టుపక్కల నిర్మాణాలు పెరిగాయి. భారీ వాణిజ్య భవనాలు, మల్టీప్లెక్స్‌లు, బహుళ అంతస్తుల నివాస సముదాయాలు ఇక్కడ ...

Updated : 24 Aug 2019 01:59 IST

ఈనాడు, హైదరాబాద్‌

మెట్రో, ఎంఎంటీఎస్‌, బాహ్యవలయ రహదారితో అనుసంధానం.. సమీపంలో పేరున్న విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వినోద కేంద్రాలతో పాటు పచ్చదనంతో నివాసాలకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో హైదరాబాద్‌ ఉత్తరం ఒకటి.. బొల్లారంలో ఎంఎంటీఎస్‌ సిద్ధం కావడంతో చుట్టుపక్కల స్థిరాస్తి మార్కెట్‌ ఊపందుకుంది. రిటైర్మెంట్‌ హోమ్స్‌ వంటి థీమ్స్‌తో కడుతున్న నిర్మాణాలు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అందుబాటు ధరల్లో ఇక్కడ ఫ్లాట్లు దొరుకుతున్నాయి.

కొంపల్లి-మేడ్చల్‌ ప్రాంతం వృద్ధిపథంలో పయనిస్తోంది. నాగ్‌పూర్‌ జాతీయ రహదారి, కరీంనగర్‌ రహదారి చుట్టుపక్కల నిర్మాణాలు పెరిగాయి. భారీ వాణిజ్య భవనాలు, మల్టీప్లెక్స్‌లు, బహుళ అంతస్తుల నివాస సముదాయాలు ఇక్కడ పెద్ద ఎత్తున నిర్మాణంలో ఉన్నాయి. సుచిత్ర, కొంపల్లి, బొల్లారం ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు అందుబాటులో ఉండగా.. వ్యక్తిగత ఇళ్లు, విల్లాలు, స్థలాల కోసం బాహ్య వలయ రహదారి వరకు వెళుతున్నారు.

* సికింద్రాబాద్‌కు కొంపల్లి ప్రాంతం 15 కి.మీ. దూరం ఉంటుంది. దగ్గరలో బొల్లారం ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ ఉంది. అతి త్వరలో అందుబాటులోకి రాబోతుంది. ఇది వస్తే నగరానికి రోజువారీ ప్రయాణం సౌకర్యంగా మారనుంది. ఎంఎంటీఎస్‌ రాకతో ఈ ప్రాంతం స్థిరాస్తి కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా మారింది. పెద్ద సంస్థలు తమ ప్రాజెక్ట్‌లను ఇక్కడ మొదలెట్టాయి. ఇప్పటికే ప్రారంభమైన మెట్రోరైలుతో ఈ ప్రాంతం నుంచి ఐటీ కేంద్రానికి రవాణా సౌకర్యం మెరుగవుతుందని బిల్డర్లు అంటున్నారు. వీరికి సమీపంలో ప్యారడైజ్‌, పరేడ్‌గ్రౌండ్స్‌ మెట్రో స్టేషన్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడి నుంచి హైటెక్‌సిటీకి చేరుకోవచ్చు. ఈ ఏడాది ఆఖరు నాటికి జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ కూడా రాబోతుంది. ఇదంతా స్థిరాస్తి మార్కెట్‌లో సానుకూలతకు దోహదం చేస్తోంది. దీంతో నివాసాలకు అనువైనదిగా చెబుతున్నారు.

* ప్రస్తుతం ఫ్లాట్ల ధరలు చదరపు అడుగు రూ.3వేల నుంచి రూ.3800 వరకు చెబుతున్నారు. రహదారికి దగ్గర ఉన్నవాటి ధరలు కాస్త ఎక్కువగా చెబుతున్నారు. దూరంగా వెళితే రూ.2500 శ్రేణిలోనూ దొరుకుతున్నాయి.

బాహ్య వలయ రహదారితో..
* వ్యక్తిగత ఇళ్లు, విల్లాలు కావాలంటే అవుటర్‌-మేడ్చల్‌ దిశగా చూస్తున్నారు. పశ్చిమ ప్రాంతంతో పోలిస్తే తక్కువలో సొంతింటి కలను సాకారం చేసుకునే అవకాశం ఉండటం.. ఇక్కడి నుంచి ఐటీ కేంద్రానికి తక్కువ సమయంలోనే చేరుకునే సదుపాయం ఉండటంతో ఇప్పుడీ ప్రాంతం స్థిరాస్తి పరంగా ఆశావహంగా మారింది. కొనుగోలుదారులు ముందుకు వస్తుండటంతో అవుటర్‌ బయట మేడ్చల్‌ వరకు పలు వెంచర్లు వెలిశాయి. ప్రముఖ సంస్థల గేటెడ్‌ కమ్యూనిటీ వెంచర్లు ఇక్కడ ఉన్నాయి.
* మేడ్చల్‌ వరకు ఎంఎంటీఎస్‌ రెండోదశ విస్తరిస్తుండటంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెడుతున్నవారు ఉన్నారు.
* అవుటర్‌ చుట్టుపక్కల నుంచి గుండ్లపోచంపల్లి వరకు విల్లాలు ఉన్నాయి. వీటి ధరలు ఇటీవలే పెరిగాయి. మున్ముందు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని