శివారులో నిర్మాణాల జోరు

నగరంలో ఓఆర్‌ఆర్‌తో రవాణా అనుసంధానం మెరుగు కావడంతో ప్రధాన నగరం నుంచి దూరంగా, రణగొణ ధ్వనులు లేని ప్రశాంత వాతావరణంలో

Published : 02 Nov 2019 02:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ఓఆర్‌ఆర్‌తో రవాణా అనుసంధానం మెరుగు కావడంతో ప్రధాన నగరం నుంచి దూరంగా, రణగొణ ధ్వనులు లేని ప్రశాంత వాతావరణంలో స్థిరపడాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. శివార్లలో కదా అని సౌకర్యాల విషయంలో రాజీ పడేందుకు కొనుగోలుదారులు ఇష్టపడడం లేదు. నగరంలో మాదిరి సౌకర్యాలను అక్కడ కూడా ఆశిస్తున్నారు. అలాంటి అవకాశం ఉన్న ప్రాంతాల వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.

* మెట్రో కారిడార్ల నుంచి అన్నివైపులా 15 కి.మీ. దూరంలో బాహ్య వలయ రహదారిలోపే బహుళ అంతస్తుల నిర్మాణాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇటీవల వీటిలో కొనుగోళ్లు పెరిగాయి.
* మెట్రో మాత్రమే కాదు.. ప్రభుత్వం శివారు ప్రాంతాల్లో రద్దీని తగ్గించేందుకు చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రాజెక్ట్‌(ఎస్‌ఆర్‌డీపీ), బహుళ అంతస్తుల ఆకాశ వంతెనలు సైతం ఊతం ఇస్తున్నాయి. ఎల్‌బీనగర్‌లో 6ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టింది. మౌలిక వసతుల అభివృద్ధితో ఆయా ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకునేందుకు అన్నివర్గాలు ఆసక్తి చూపిస్తున్నాయి. పెద్దఎత్తున మాల్స్‌ నిర్మాణంలో ఉన్నాయి. 6మల్టీఫ్లెక్స్‌లలో 36 తెరలు వస్తున్నాయి.
* అభివృద్ధి మొత్తం పశ్చిమ హైదరాబాద్‌ గచ్చిబౌలి, మియాపూర్‌వైపు కేంద్రీకృతం కావడంతో ప్రభుత్వం ‘లుక్‌ ఈస్ట్‌’ అంటోంది. ఉప్పల్‌-పోచారం, ఆదిభట్ల వైపు ఉపాధి అవకాశాలు పెంచేలా సర్కారు ప్రోత్సాహకాలు ఇవ్వబోతోంది. దీంతో ఇక్కడ నివాసాలకు మొగ్గు ఏర్పడుతుంది. ఇప్పటికే పలు ప్రాజెక్ట్‌లు ఈప్రాంతాల్లో ఇటీవల మొదలెట్టారు.  అవుటర్‌ రింగ్‌రోడ్డుకు పక్కన, చేరువలో ఉండటం.. సమీపంలో వరంగల్‌, నాగార్జున సాగర్‌, శ్రీశైలం జాతీయ రహదారులు ఉండడం వంటి సానుకూల అంశాలు ఉన్నాయి.
* సికింద్రాబాద్‌ ఉత్తర హైదరాబాద్‌ ప్రాంతంలో రహదారులు, కూడళ్ల విస్తరణతో రవాణాను మెరుగుపరిచే ప్రయత్నాలు మొదలయ్యాయి. కొంపల్లి మార్గంలో వృద్ధికి అవకాశం ఉందని నిర్మాణ సంస్థలు అంటున్నాయి.
* బాహ్య వలయ రహదారికి అటుఇటు అందుబాటు ధరల్లో వ్యక్తిగత ఇళ్లు, సకల హంగులతో విల్లాలు పెద్ద ఎత్తున ఉన్నాయి.  ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, మియాపూర్‌, గచ్చిబౌలి, రాజేంద్రనగర్‌, సాగర్‌రోడ్డు వరకు రూ.40 లక్షలు మొదలు రూ.కోటి ధరల్లో వ్యక్తిగత ఇళ్లు, విల్లాలు అందుబాటులో ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని