రైతులకు 60 శాతం..హెచ్‌ఎండీఏకు 40 శాతం!

భూసమీకరణ పథకం(ల్యాండ్‌ పూలింగ్‌) కింద హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)కు భూములుఅప్పగించాలనుకునే రైతన్నలకు ప్రభుత్వం తీపి కబురు

Updated : 06 Sep 2021 20:51 IST

ల్యాండ్‌ పూలింగ్‌లో భూయజమానుల వాటా పెంపు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 

ఈనాడు, హైదరాబాద్‌: భూసమీకరణ పథకం(ల్యాండ్‌ పూలింగ్‌) కింద హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)కు భూములుఅప్పగించాలనుకునే రైతన్నలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పరిహారం పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సౌకర్యాలతో అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో భూయజమానుల వాటాను 50 నుంచి 60 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నాలా, భూవినియోగ మార్పిడి, ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ తదితర ఛార్జీలనూ హెచ్‌ఎండీఏనే భరించనుంది. 2005లో ఉప్పల్‌ భగాయత్‌లో 754 ఎకరాలను సేకరించి వివిధ దశల్లో లేఅవుట్లుగా అభివృద్ధి చేసింది. సాంకేతిక కారణాలు, కోర్టు కేసులతో పన్నెండేళ్ల తర్వాత రైతులకు నష్టపరిహారం అందించింది. రెండు దశల్లో ప్లాట్లను విక్రయించగా హెచ్‌ఎండీఏకు రూ.1056 కోట్ల ఆదాయం సమకూరింది. ఉప్పల్‌ మాదిరిగానే భూములు అప్పగించాలనుకునే వారు ముందుకు రావాలంటూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కనీసం 50 ఎకరాలుండాలని పేర్కొంది. ఆశించిన స్పందన రాకపోవడంతో హెచ్‌ఎండీఏ అధికారులు కంగుతిన్నారు. మరో నోటిఫికేషన్‌ జారీ చేసి ప్రత్యేకంగా గ్రామసభలు నిర్వహించారు. తమ వాటాను పెంచితేనే భూములిస్తామంటూ రైతులు స్పష్టం చేయడంతో అడుగు ముందుకుపడలేదు. ఈమేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. పాత జీవోలోని నిబంధనలను సవరించాలని విన్నవించారు. తదనుగుణంగా పురపాలక శాఖ కార్యదర్శి శుక్రవారం తాజా జీవో సంఖ్య 83ను జారీ చేశారు. లేఅవుట్‌ డ్రాఫ్ట్‌కు అధికారికంగా అనుమతిచ్చిన ఆరు నెలల్లోపు భూయజమానులకు ప్లాట్లను కేటాయిస్తారు. ప్రస్తుతం 500 ఎకరాల్లో లేఅవుట్‌ పనులు కొనసాగుతున్నాయని, తాజా నిర్ణయంతో మరింత మంది ముందుకొచ్చే అవకాశముందని హెచ్‌ఎండీఏ భావిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని